Updated : 20 Feb 2022 06:46 IST

IND vs WI: సున్నా చుట్టించేస్తారా!

నేడే విండీస్‌తో చివరి టీ20

రాత్రి 7 గంటల నుంచి

వైట్‌వాష్‌పై టీమ్‌ఇండియా కన్ను

కోల్‌కతా

బ్యాటర్లు ఫామ్‌ అందుకున్నారు.. బౌలర్లు కుదురుకున్నారు.. కెప్టెన్‌ జోరుమీదున్నాడు.. ఇలా ఏ రకంగా చూసినా వెస్టిండీస్‌తో సిరీస్‌లో భారత్‌కు అన్నీ మంచి శకునాలే! ఇప్పటికే టీ20 సిరీస్‌ను సొంతం చేసుకున్న టీమ్‌ఇండియా.. పొట్టి ఫార్మాట్లోనూ ప్రత్యర్థిని వైట్‌వాష్‌ చేయాలనే పట్టుదలతో ఉంది. ఆదివారమే చివరి టీ20. కోహ్లి, పంత్‌కు విశ్రాంతినిచ్చిన జట్టు ప్రయోగాలకు సిద్ధమైంది. ఈ ఏడాది ఆస్ట్రేలియాలో టీ20 ప్రపంచకప్‌ నేపథ్యంలో జట్టు బలాన్ని పరీక్షించనుంది. మరోవైపు కనీసం ఒక్క గెలుపుతోనైనా.. స్వదేశానికి బయల్దేరాలని విండీస్‌ ఆరాటపడుతోంది. మరి భారత జోరుకు కళ్లెం వేయడం ఆ జట్టుకు సాధ్యమేనా?  

న్డే సిరీస్‌లో 3-0తో వెస్టిండీస్‌ను వైట్‌వాష్‌ చేసిన టీమ్‌ఇండియా.. టీ20ల్లోనూ అదే ఫలితాన్ని పునరావృతం చేయాలనే ధ్యేయంతో ఉంది. ప్రత్యర్థికి మంచి పట్టున్న పొట్టి ఫార్మాట్లో ఇప్పటికే 2-0తో సిరీస్‌ సొంతం చేసుకున్న భారత్‌.. నేడు ఆఖరి టీ20లోనూ గెలిచి వట్టిచేతులతో కరీబియన్‌ జట్టును ఇంటికి పంపాలని చూస్తోంది. అన్ని విభాగాల్లోనూ పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తున్న రోహిత్‌ సేన.. ఈ మ్యాచ్‌లో మార్పులు చేయడం ఖాయమైంది. మరోవైపు గత మ్యాచ్‌లో విజయానికి చేరువగా వచ్చి.. ఓటమిపాలైన విండీస్‌ ఈ సారి ఆ దూరాన్ని అందుకోవాలనే పట్టుదలతో ఉంది. ఆల్‌రౌండర్లతో నిండిన ఆ జట్టు స్థాయికి తగ్గట్లు రాణిస్తే భారత్‌కు సవాలు తప్పదు.

వాళ్లకు అవకాశం..: కోహ్లి, పంత్‌కు పది రోజుల విశ్రాంతి ఇవ్వడంతో ఈ మ్యాచ్‌ కోసం టీమ్‌ఇండియా కచ్చితంగా రెండు మార్పులు చేయనుంది. కోహ్లి స్థానంలో శ్రేయస్‌ జట్టులోకి వస్తాడు. పంత్‌ స్థానంలో రుతురాజ్‌ ఆడొచ్చు. అతనే రోహిత్‌తో కలిసి ఇన్నింగ్స్‌ ఆరంభించే ఛాన్స్‌ ఉంది. ఓపెనర్‌గా గత రెండు మ్యాచ్‌ల్లోనూ ఇషాన్‌ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. అతను దిగువన ఆడనున్నాడు. ఇక అవకాశం కోసం చూస్తున్న శ్రేయస్‌ మరోసారి సత్తాచాటేందుకు సిద్ధమయ్యాడు. తన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్న వెంకటేశ్‌ అయ్యర్‌ స్థానంలో దీపక్‌ హుడాను తీసుకునేందుకు జట్టు మొగ్గు చూపొచ్చు. మరోవైపు గత రెండు మ్యాచ్‌ల్లోనూ పేసర్లు భువనేశ్వర్‌, హర్షల్‌ మంచి ప్రదర్శన చేశారు. కానీ అటు బెంచ్‌ మీద సిరాజ్‌తో పాటు అవేశ్‌ ఖాన్‌ ఉన్నాడు. ఈ నేపథ్యంలో వీళ్లిద్దరికీ జట్టులో చోటు దక్కుతుందా? లేదా సిరాజ్‌ను మాత్రమే ఆడిస్తారా? అన్న ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. అవేశ్‌కు అరంగేట్రం చేసే అవకాశాన్ని జట్టు మేనేజ్‌మెంట్‌ ఇస్తుందేమో చూడాలి. దీపక్‌ చాహర్‌కు బదులు శార్దూల్‌ను తీసుకునే ఛాన్స్‌ ఉంది.

ఈ ఒక్కటైనా..: పటిష్ఠమైన ఇంగ్లాండ్‌ను సొంతగడ్డపై టీ20 సిరీస్‌లో 3-2తో ఓడించి భారత్‌లో అడుగుపెట్టిన వెస్టిండీస్‌.. ఈ పర్యటనలో మాత్రం విజయం కోసం ఎదురు చూస్తూనే ఉంది. మొదట వన్డేల్లో వైట్‌వాష్‌ అయిన ఆ జట్టు.. ఇప్పుడు టీ20ల్లో ఆ ప్రమాదాన్ని తప్పించుకోవాలని భావిస్తోంది. పూరన్‌ ఫామ్‌లో ఉన్నాడు. ఇక రెండో టీ20లో పావెల్‌ విధ్వంసం సృష్టించాడు. మరోసారి వీళ్లతో పాటు టాప్‌ఆర్డర్‌ రాణిస్తే ఆ జట్టు రేసులో నిలుస్తుంది. కెప్టెన్‌గా పొలార్డ్‌ కూడా సహచరుల్లో స్ఫూర్తి రగిలించాల్సిన అవసరం ఉంది. ఇక బౌలింగ్‌ పరంగా చూస్తే ఆఫ్‌ స్పిన్‌ ఆల్‌రౌండర్‌ చేజ్‌ నిలకడగా వికెట్లు తీస్తున్నాడు. కానీ ఆల్‌రౌండర్లనే నమ్ముకున్న ఆ జట్టుకు వికెట్లు అందించే పూర్తిస్థాయి పేసర్లు కావాల్సినంతగా అందుబాటులో లేరు. బౌలింగ్‌ మెరుగైతేనే విండీస్‌ విజయంపై ఆశలు పెటుకోవచ్చు.

జట్లు (అంచనా): భారత్‌: రోహిత్‌, రుతురాజ్‌, శ్రేయస్‌, సూర్యకుమార్‌, ఇషాన్‌, వెంకటేశ్‌/దీపక్‌ హుడా, హర్షల్‌/అవేశ్‌, దీపక్‌ చాహర్‌/శార్దూల్‌, రవి బిష్ణోయ్‌, భువనేశ్వర్‌/సిరాజ్‌, చాహల్‌/కుల్‌దీప్‌; వెస్టిండీస్‌: మేయర్స్‌, కింగ్‌, పూరన్‌, పావెల్‌, పొలార్డ్‌, హోల్డర్‌, చేజ్‌, షెఫర్డ్‌, స్మిత్‌, అకీల్‌, కాట్రెల్‌

పిచ్‌ ఎలా ఉంది?

ఈడెన్‌ గార్డెన్స్‌లో గత రెండు మ్యాచ్‌ల్లోనూ స్పిన్నర్లు ప్రభావం చూపారు. ఈ మ్యాచ్‌లోనూ అవే పరిస్థితులు కొనసాగే అవకాశం ఉంది. బ్యాటింగ్‌కు కూడా పిచ్‌ మంచిగా సహకరిస్తోంది. రెండో ఇన్నింగ్స్‌లో మంచు ప్రభావం కారణంగా టాస్‌ గెలిచిన జట్టు ఛేదనకే మొగ్గు చూపే ఆస్కారముంది.

1 అంతర్జాతీయ టీ20ల్లో భారత్‌ తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచేందుకు చాహల్‌కు కావాల్సిన వికెట్లు. ప్రస్తుతం అతను బుమ్రా (66)తో కలిసి సమానంగా అగ్రస్థానంలో ఉన్నాడు.

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts