IND vs WI: ఆ ఒక్కటీ వదల్లేదు

ఏమా ఆటా.. ఏమా షాట్లు! ఒకదానికి మించి ఇంకోటి! సూర్యకుమార్‌ అసలు గ్యాప్‌ ఇస్తేనే కదా! ఇలా కూడా ఆడతారా అనిపించేలోపే.. దానికి మించిన ఇంకో షాటు! అబ్బో ఇలా కొట్టేశాడేంటి అనుకుంటే అంతకుమించిన ఇంకో మెగా హిట్టూ! ఔరా అనిపించేలా అంతలా చెలరేగిపోయాడీ ఈ స్టార్‌ బ్యాటర్‌! రెండో టీ20లోలా మూడో టీ20లోనూ కరీబియన్‌ వీరులు వణికిస్తారేమో అని భయపడితే.. వారినే భయపెట్టేశాడతను! సూర్య సిక్సర్లతో చెలరేగడంతో మొదట భారీ స్కోరు చేసిన భారత్‌.. ఆపై బౌలర్లు విజృంభించడంతో 17 పరుగుల తేడాతో గెలిచి విండీస్‌ను వైట్‌వాష్‌ చేసింది. టీ20 సిరీస్‌ను 3-0తో ఘనంగా ముగించింది. వన్డే సిరీస్‌నూ రోహిత్‌ సేన 3-0తో గెలిచిన సంగతి తెలిసిందే.

Updated : 21 Feb 2022 06:39 IST

భారత్‌ డబుల్‌ క్లీన్‌స్వీప్‌
టీ20ల్లోనూ విండీస్‌ వైట్‌వాష్‌
చెలరేగిన సూర్యకుమార్‌
వెంకటేశ్‌ ఆల్‌రౌండ్‌ ప్రదర్శన
చివరి మ్యాచ్‌లోనూ రోహిత్‌సేన గెలుపు

ఏమా ఆటా.. ఏమా షాట్లు! ఒకదానికి మించి ఇంకోటి! సూర్యకుమార్‌ అసలు గ్యాప్‌ ఇస్తేనే కదా! ఇలా కూడా ఆడతారా అనిపించేలోపే.. దానికి మించిన ఇంకో షాటు! అబ్బో ఇలా కొట్టేశాడేంటి అనుకుంటే అంతకుమించిన ఇంకో మెగా హిట్టూ! ఔరా అనిపించేలా అంతలా చెలరేగిపోయాడీ ఈ స్టార్‌ బ్యాటర్‌! రెండో టీ20లోలా మూడో టీ20లోనూ కరీబియన్‌ వీరులు వణికిస్తారేమో అని భయపడితే.. వారినే భయపెట్టేశాడతను! సూర్య సిక్సర్లతో చెలరేగడంతో మొదట భారీ స్కోరు చేసిన భారత్‌.. ఆపై బౌలర్లు విజృంభించడంతో 17 పరుగుల తేడాతో గెలిచి విండీస్‌ను వైట్‌వాష్‌ చేసింది. టీ20 సిరీస్‌ను 3-0తో ఘనంగా ముగించింది. వన్డే సిరీస్‌నూ రోహిత్‌ సేన 3-0తో గెలిచిన సంగతి తెలిసిందే.

కోల్‌కతా

అదరహో సూర్యకుమార్‌ (65; 31 బంతుల్లో 1×4, 7×6)! ఈ మిడిల్‌ ఆర్డర్‌ బ్యాటర్‌ ఆకాశమే హద్దుగా చెలరేగడంతో సిరీస్‌లో ఆఖరిదైన మూడో టీ20లో భారత్‌ ఘన విజయాన్ని అందుకుంది. ఆదివారం మొదట భారత్‌ 20 ఓవర్లలో 5 వికెట్లకు 184 పరుగుల భారీ స్కోరు చేసింది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ సూర్యతో పాటు వెంకటేశ్‌ అయ్యర్‌ (35 నాటౌట్‌; 19 బంతుల్లో 4×4, 2×6) చెలరేగాడు. ఛేదనలో విండీస్‌ 20 ఓవర్లలో 9 వికెట్లకు 167 పరుగులే చేయగలిగింది. హర్షల్‌ (3/22), చాహర్‌ (2/15), వెంకటేశ్‌ (2/23), శార్దూల్‌ (2/33) జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. విండీస్‌ బ్యాటర్లలో పూరన్‌ (61; 47 బంతుల్లో 8×4, 1×6) టాప్‌ స్కోరర్‌.

విజృంభించిన బౌలర్లు: ఛేదనలో ఆరంభం నుంచే విండీస్‌ తడబడింది. దీపక్‌ చాహర్‌ విజృంభించడంతో ఆ జట్టు 26 పరుగులకే మేయర్స్‌ (6), హోప్‌ (8) వికెట్లు కోల్పోయింది. ఈ స్థితిలో రెండో టీ20లో అదరగొట్టిన పూరన్‌, పావెల్‌ (25) మరోసారి జట్టును ఆదుకున్నారు. ఉన్నంతసేపు ధాటిగా ఆడిన పావెల్‌ను హర్షల్‌ పటేల్‌ ఔట్‌ చేసి బ్రేక్‌ ఇచ్చాడు. పొలార్డ్‌ (5), హోల్డర్‌ (2), చేజ్‌ (12) స్వల్ప స్కోర్లకే వెనుదిరగడంతో విండీస్‌ 100/6తో పరాజయం దిశగా సాగింది. కానీ వరుసగా మూడో టీ20లోనూ అర్ధసెంచరీ చేసిన పూరన్‌.. షెపర్డ్‌ (29; 21 బంతుల్లో 1×4, 3×6)తో కలిసి భారత బౌలర్లపై ఎదురుదాడి చేశాడు. ఈ జోడీ భారీ షాట్లతో చెలరేగడంతో ఒక దశలో విండీస్‌కు గెలుపు ఆశలు చిగురించాయి. కానీ పూరన్‌ను ఔట్‌ చేసిన శార్దూల్‌ ప్రత్యర్థిని గట్టి దెబ్బ కొట్టాడు. ఆ తర్వాత విండీస్‌ పోరాడినా పరుగుల అంతరాన్ని మాత్రమే తగ్గించగలిగింది. విండీస్‌ ఇన్నింగ్స్‌లో తొలి రెండు వికెట్లు తీసిన దీపక్‌ చాహర్‌ గాయపడి 1.5 ఓవర్ల తర్వాత మైదానాన్ని వీడాడు. తర్వాత అతడి కోటాను వెంకటేశ్‌ పూర్తి చేశాడు.

సూర్య ప్రతాపం: అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత ఇన్నింగ్స్‌లో సూర్యకుమార్‌ ఆటే హైలైట్‌! బెదురు లేకుండా ఆడిన ఈ కుర్రాడు విండీస్‌ బౌలర్లకు చుక్కలు చూపించాడు. 93 పరుగులకే 4 కీలక వికెట్లు పడినా సూర్య తగ్గలేదు. స్పిన్నర్‌, పేసర్‌ అని చూడకుండా ఉతికేశాడు. వాల్ష్‌ బౌలింగ్‌లో రెండు సిక్సర్లతో మొదలైన అతడి జోరు.. ఇన్నింగ్స్‌ ఆఖరి అయిదు ఓవర్లలో మరో స్థాయికి వెళ్లింది. ఫ్లిక్‌ షాట్లు.. శక్తివంతమైన డ్రైవ్‌లు, లెగ్‌ గ్లాన్స్‌లు ఒకటేమిటి అన్ని అస్త్రాలు బయటకు తీశాడతను. ముఖ్యంగా అతడు కొట్టిన ఏడు సిక్సర్లు దేనికవే ప్రత్యేకం. సిక్స్‌ కొట్టడం ఇంత సులభమా అన్నట్లు తన తల మీదుగా కొట్టిన స్కూప్‌... ఆఫ్‌సైడ్‌ బ్యాట్‌ విసురుతున్నట్టు కొట్టిన మెరుపు కట్‌ షాట్‌ చూసి తీరాల్సిందే. 14 ఓవర్లకు 93/4తో ఉన్న భారత్‌ చివరికి భారీ స్కోరుతో ఇన్నింగ్స్‌ను ముగించిందంటే సూర్య ప్రతాపాన్ని అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలోనే అతడు 27 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. సిక్స్‌తో అతడు ఈ మైలురాయిని చేరుకున్నాడు. అతడికి తోడు వెంకటేశ్‌ అయ్యర్‌ కూడా చెలరేగాడు. తొలి రెండు టీ20ల్లో మాదిరే ఇన్నింగ్స్‌కు రాకెట్‌ వేగాన్ని అందించాడు. ఈ క్రమంలో కొన్ని కళ్లు చెదిరే ఫ్లిక్‌ షాట్లు ఆడాడు. సూర్య చివరి ఓవర్లో మూడు సిక్సర్లు  బాది ఇన్నింగ్స్‌కు అదిరే ముగింపునిచ్చాడు. చివరి   5 ఓవర్లలో భారత్‌ 86 పరుగులు రాబట్టింది. సూర్య-వెంకటేశ్‌ జోడీ అయిదో వికెట్‌కు 37 బంతుల్లోనే 91 పరుగులు జోడించింది.

రోహిత్‌ మిడిలార్డర్‌లో..: సూర్య-వెంకటేశ్‌ విధ్వంసానికి ముందు భారత్‌ ఇన్నింగ్స్‌ మరీ గొప్పగా సాగలేదు. ఈ సిరీస్‌లో తొలిసారి అవకాశం దక్కించుకున్న రుతురాజ్‌ గైక్వాడ్‌ (8 బంతుల్లో 4) విఫలమయ్యాడు. ఈ స్థితిలో ధాటిగా ఆడిన ఇషాన్‌ కిషన్‌ (34; 31 బంతుల్లో 5×4), శ్రేయస్‌ అయ్యర్‌ (25)తో కలిసి ఇన్నింగ్స్‌ను నడిపించాడు. కానీ వీళ్లిద్దరూ స్వల్ప తేడాతో ఔట్‌ కావడంతో భారత్‌ 66/3తో నిలిచింది. కోహ్లి లేకపోవడంతో ప్రయోగాత్మకంగా మిడిలార్డర్‌లో వచ్చిన కెప్టెన్‌ రోహిత్‌ (7) కూడా వెనుదిరగడంతో భారత్‌ ఇబ్బందుల్లో పడింది. డ్రేక్స్‌ బౌలింగ్‌లో క్రీజు వదిలి ముందుకెళ్లిన రోహిత్‌ లైన్‌ తప్పి బౌల్డ్‌ అయ్యాడు. ఈ మ్యాచ్‌కు భారత్‌ నాలుగు మార్పులు చేసింది. కోహ్లి, పంత్‌కు విశ్రాంతినిచ్చి రుతురాజ్‌ గైక్వాడ్‌, శ్రేయస్‌ అయ్యర్‌లను తీసుకున్న టీమ్‌ఇండియా.. భువనేశ్వర్‌ కుమార్‌, యుజ్వేంద్ర చాహల్‌ స్థానాల్లో ఆల్‌రౌండర్‌ శార్దూల్‌ ఠాకూర్‌, అవేష్‌ఖాన్‌కు అవకాశం ఇచ్చింది. అవేష్‌కు ఇదే తొలి అంతర్జాతీయ మ్యాచ్‌.

భారత్‌ ఇన్నింగ్స్‌: రుతురాజ్‌ (సి) మేయర్స్‌ (బి) హోల్డర్‌ 4; ఇషాన్‌ కిషన్‌ (బి) చేజ్‌ 34; శ్రేయస్‌ (సి) హోల్డర్‌ (బి) వాల్ష్‌ 25; రోహిత్‌ (బి) డ్రేక్స్‌ 7; సూర్యకుమార్‌ (సి) పావెల్‌ (బి) షెపర్డ్‌ 65; వెంకటేశ్‌ నాటౌట్‌ 35; ఎక్స్‌ట్రాలు 14 మొత్తం: (20 ఓవర్లలో 5 వికెట్లకు) 184; వికెట్ల పతనం: 1-10, 2-63; 3-66, 4-93, 5-184; బౌలింగ్‌: హోల్డర్‌ 4-0-29-1; షెపర్డ్‌   4-0-50-1; చేజ్‌ 4-0-23-1; వాల్ష్‌ 4-0-30-1; డ్రేక్స్‌ 3-0-37-1; అలెన్‌ 1-0-5-0

వెస్టిండీస్‌ ఇన్నింగ్స్‌: మేయర్స్‌ (సి) కిషన్‌ (బి) చాహర్‌ 6; హోప్‌ (సి) కిషన్‌ (బి) చాహర్‌ 8; పూరన్‌ (సి) కిషన్‌ (బి) శార్దూల్‌ 61; పావెల్‌ (సి) శార్దూల్‌ (బి) హర్షల్‌ 25; పొలార్డ్‌ (సి) బిష్ణోయ్‌ (బి) వెంకటేశ్‌ 5; హోల్డర్‌ (సి) శ్రేయస్‌ (బి) వెంకటేశ్‌ 2; చేజ్‌ (బి) హర్షల్‌ 12; షెపర్డ్‌ (సి) రోహిత్‌ (బి) హర్షల్‌ 29; అలెన్‌ నాటౌట్‌ 5; డ్రేక్స్‌ (సి) రోహిత్‌ (బి) శార్దూల్‌ 4; వాల్ష్‌ నాటౌట్‌ 0; ఎక్స్‌ట్రాలు 10 మొత్తం: (20 ఓవర్లలో 9 వికెట్లకు) 167; వికెట్ల పతనం: 1-6, 2-26, 3-73, 4-82,  5-87, 6-100, 7-148, 8-158, 9-166; బౌలింగ్‌: దీపక్‌ చాహర్‌ 1.5-0-15-2; అవేష్‌ఖాన్‌ 4-0-42-0; వెంకటేశ్‌ అయ్యర్‌ 2.1-0-23-2; శార్దూల్‌ ఠాకూర్‌ 4-0-33-2; రవి బిష్ణోయ్‌ 4-0-29-0; హర్షల్‌ పటేల్‌ 4-0-22-3.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని