R Praggnanandhaa: ప్రజ్ఞానంద సంచలనం

ప్రస్తుత ప్రపంచ చెస్‌లో మాగ్నస్‌ కార్ల్‌సన్‌ (నార్వే) కొరకరాని కొయ్య! మహా మహా ఆటగాళ్లే అతడిని నిలువరించేందుకు శ్రమ పడతారు. అలాంటిది పెద్దగా అనుభవం లేని, 16 ఏళ్ల భారత గ్రాండ్‌మాస్టర్‌ ప్రజ్ఞానంద..

Updated : 22 Feb 2022 06:55 IST

ప్రపంచ ఛాంపియన్‌ కార్ల్‌సన్‌కు షాక్‌
చెన్నై

ప్రస్తుత ప్రపంచ చెస్‌లో మాగ్నస్‌ కార్ల్‌సన్‌ (నార్వే) కొరకరాని కొయ్య! మహా మహా ఆటగాళ్లే అతడిని నిలువరించేందుకు శ్రమ పడతారు. అలాంటిది పెద్దగా అనుభవం లేని, 16 ఏళ్ల భారత గ్రాండ్‌మాస్టర్‌ ప్రజ్ఞానంద.. కార్ల్‌సన్‌కు ఓటమి రుచి చూపించాడు. ఎయిర్‌థింగ్స్‌ మాస్టర్స్‌ ఆన్‌లైన్‌ ర్యాపిడ్‌ చెస్‌ టోర్నమెంట్లో ఈ భారత కుర్రాడు మాగ్నస్‌ను ఓడించి సంచలనం సృష్టించాడు. ఎనిమిదో రౌండ్లో నల్ల పావులతో ఆడిన ప్రజ్ఞానంద హ్యాట్రిక్‌ విజయాలతో జోరు మీదున్న కార్ల్‌సన్‌ ఆట కట్టించాడు. అతడు ఈ మ్యాచ్‌ను 39 ఎత్తుల్లో గెలుచుకున్నాడు. భారత్‌ నుంచి ఇప్పటిదాకా విశ్వనాథన్‌ ఆనంద్‌, పెంటేల హరికృష్ణ మాత్రమే కార్ల్‌సన్‌ను ఓడించగలిగారు. తాజా విజయంతో ఈ టోర్నమెంట్లో ప్రజ్ఞానంద 8 పాయింట్లతో (2 విజయాలు, 4 ఓటములు, 2 డ్రాలు) 12వ స్థానంలో ఉన్నాడు. ఇదే టోర్నీలో ఆర్మేనియా స్టార్‌ అరోనియన్‌కు కూడా ఈ చెన్నై చిన్నోడు షాకిచ్చాడు .‘‘కార్ల్‌సన్‌తో పోరుకు ప్రత్యేకంగా ఏం సిద్ధం కాలేదు. అతడితో ఆడేటప్పుడు ఆస్వాదించా. ప్రపంచ ఛాంపియన్‌తో తలపడుతున్నా అన్న ఒత్తిడి కలగకుండా చూసుకున్నా’’ అని ప్రజ్ఞానంద చెప్పాడు. సంచలన విజయం సాధించిన ప్రజ్ఞానందను దిగ్గజ ఆటగాడు విశ్వనాథన్‌ ఆనంద్‌, అఖిల భారత చెస్‌ సంఘం, క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందుల్కర్‌ అభినందించారు. ‘‘మన దేశంలోని ప్రతిభావంతులైన క్రీడాకారులను చూసి ఎప్పుడూ గర్విస్తా. ప్రజ్ఞకు ఈ రోజు బాగా కలిసొచ్చింది’’ అని ఆనంద్‌ ట్వీట్‌ చేశాడు. 2018లో 12 సంవత్సరాల 10 నెలల 13 రోజుల వయసులో గ్రాండ్‌మాస్టర్‌ అయిన ప్రజ్ఞానంద.. ప్రపంచ చెస్‌లో ఈ హోదా సాధించిన అయిదో పిన్న వయస్కుడిగా నిలిచాడు. అతడు సీనియర్‌ సర్క్యూట్‌లోనూ తన ముద్ర వేస్తున్నాడు. 2019లో ఎక్స్‌ట్రాకాన్‌ చెస్‌ టైటిల్‌ గెలిచిన ఈ టీనేజర్‌.. అదే ఏడాది ప్రపంచ యూత్‌ చెస్‌లో అండర్‌-18 టైటిల్‌ సొంతం చేసుకున్నాడు. 2020లో జరిగిన మెల్ట్‌వాటర్‌ చెస్‌ టూర్‌లో ప్రపంచ ఛాంపియన్‌ మాగ్నస్‌ కార్ల్‌సన్‌తో డ్రా చేసుకున్న ప్రజ్ఞానంద.. సెర్గీ కర్జాకిన్‌, రద్జబోవ్‌ లాంటి సీనియర్లపై విజయాలు నమోదు చేశాడు. ప్రస్తుతం 2612 ఫిడే రేటింగ్‌తో ఉన్న అతడు గత ఏడాది ప్రపంచకప్‌లో నాలుగో రౌండ్‌ వరకు వెళ్లాడు. ప్రజ్ఞానంద సోదరి వైశాలి ఇంటర్నేషనల్‌ మాస్టర్‌.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని