Updated : 22 Feb 2022 07:32 IST

Dravid - Saha: సాహా వ్యాఖ్యలతో బాధేం లేదు: ద్రవిడ్‌

నిజాయితీగా చెప్పాల్సింది చెప్పా
ఇబ్బంది పడ్డా వాస్తవాలు వెల్లడించాల్సిందే
టీమ్‌ఇండియా కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌

‘‘రిటైర్మెంట్‌ గురించి ఆలోచించాలని ద్రవిడ్‌ నాకు సూచించాడు’’.. శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు భారత జట్టులో చోటు దక్కని నేపథ్యంలో అసహనం వ్యక్తం చేస్తూ సీనియర్‌ వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ వృద్ధిమాన్‌ సాహా చేసిన వ్యాఖ్యలివి. తననిక జట్టు ఎంపికకు పరిగణనలోకి తీసుకోబోమని టీమ్‌ మేనేజ్‌మెంట్‌ ముందే చెప్పేసిందని కూడా అతను వెల్లడించాడు. ఈ వ్యాఖ్యలు భారత క్రికెట్‌ వర్గాల్లో చిన్నపాటి దుమారాన్నే రేపాయి. ఈ నేపథ్యంలో ద్రవిడ్‌ స్పందించాడు. సాహా తన గురించి చేసిన వ్యాఖ్యలు తనకేమీ బాధ కలిగించలేదని.. అతడితో తాను నిజాయితీగా ఏం చెప్పాలనుకున్నానో అది చెప్పానని అన్నాడు. ఆటగాళ్లకు కష్టంగా అనిపించినా.. వాళ్లకు వాస్తవాలు చెప్పాల్సిందే అని, తాను ఇలాగే ఉంటానని కూడా ద్రవిడ్‌ స్పష్టం చేయడం గమనార్హం.

కోల్‌కతా

జట్టులో అయినా, తుది జట్టులో అయినా ఆటగాళ్లకు చోటు ఇవ్వలేని పరిస్థితుల్లో వారికి ఆ విషయాన్ని నిజాయితీగా చెప్పడం అవసరమని టీమ్‌ఇండియా కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ అన్నాడు. రిషబ్‌ పంత్‌ భారత నంబర్‌వన్‌ వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌గా రుజువు చేసుకోవడం, ప్రత్యామ్నాయ వికెట్‌ కీపర్‌గా కేఎస్‌ భరత్‌ లాంటి యువ ఆటగాళ్లకు అవకాశం కల్పించాలని భావించిన నేపథ్యంలో సాహాకు ఇకపై అవకాశం ఇవ్వలేమని అతడికి స్పష్టం చేయాల్సి వచ్చిందని ద్రవిడ్‌ వెల్లడించాడు. ‘‘సాహా వ్యాఖ్యలతో నేనేమీ బాధ పడలేదు. సాహా సాధించిన ఘనతలు, భారత క్రికెట్‌కు చేసిన సేవల విషయంలో తన పట్ల నాకెంతో గౌరవం ఉంది. ఆ స్థాయి ఆటగాడికి నిజాయితీగా, స్పష్టంగా అసలు విషయం చెప్పాల్సిన అవసరముంది. పంత్‌ ఉత్తమ వికెట్‌ కీపర్‌గా నిరూపించుకోవడం, మేం మరో యువ వికెట్‌ కీపర్‌ను తీర్చిదిద్దుకోవాలనుకోవడం గురించి అతడికి వివరించే ప్రయత్నం చేశా. ఇలా మాట్లాడినంత మాత్రాన సాహా పట్ల నా గౌరవం, అభిప్రాయం ఏమీ మారినట్లు కాదు’’ అని ద్రవిడ్‌ తెలిపాడు. సాహా అనే కాక ఆటగాళ్లందరితోనూ తాను ఇలాగే నిజాయితీగా ఉంటానని, సమాచార లోపం లేకుండా చూసుకుంటానని రాహుల్‌ చెప్పాడు. ‘‘నేను తరచుగా ఆటగాళ్లతో మాట్లాడుతుంటాను. మనం చెప్పే విషయాలన్నిటితో వాళ్లు అంగీకరించాలనేమీ లేదు. కొన్నిసార్లు కఠినమైన సంభాషణలు జరుగుతాయి. అవతలి వారిని బాధిస్తాయని ఆ విషయాలను దాచిపెట్టలేం. ఆటగాళ్లతో మాట్లాడకుండా ఉండలేం. ప్రతి మ్యాచ్‌ ముంగిట తుది జట్టు ఎంపిక సమయంలో ఆటగాళ్లందరితో చర్చించాలని నేను భావిస్తా. తాము ఎందుకు తుది జట్టులో లేమో ఆటగాళ్లు ప్రశ్నించవచ్చు. చోటు దక్కని వాళ్లు బాధ పడటం సహజం. ఎవరితో ఏమీ మాట్లాడకుండా ఉండిపోవడం చాలా తేలిక. నేను అలా చేయను. ముందు బాధపడ్డా.. ఏదో ఒక దశలో ఇలా మాట్లాడటం ఎంత అవసరమో ఆటగాళ్లు అర్థం చేసుకుంటారు’’ అని ద్రవిడ్‌ అన్నాడు.


మరి వాళ్ల సంగతేంటి?

శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు జట్టులో చోటు కోల్పోయిన సీనియర్‌ సాహా ఒక్కడే కాదు. ఇషాంత్‌ శర్మ, పుజారా, రహానెలపైనా వేటు పడింది. భారత జట్టులో ఇలా ఒకేసారి నలుగురు సీనియర్లపై వేటు పడ్డ దాఖలాలు గత కొన్నేళ్లలో ఎప్పుడూ లేవు. ఈ నిర్ణయంతో సెలక్టర్లు ఒక స్పష్టమైన సంకేతాన్ని పంపినట్లే కనిపిస్తోంది. ఫామ్‌తో తంటాలు పడుతున్న సీనియర్లను ఇంకెంతో జట్టులో కొనసాగించే పరిస్థితి లేదన్నదే ఆ సంకేతం. అయితే సాహాకు చెప్పినట్లే ఇకపై జట్టు ఎంపికలో పరిగణనలోకి తీసుకోబోమని చెప్పడమో.. రిటైరవ్వమని సంకేతాలివ్వడమో మిగతా ముగ్గురి విషయంలో జరిగిందా అన్నదే ప్రశ్న. సాహా వికెట్‌ కీపర్‌ కాబట్టి.. పంత్‌ను కాదని టెస్టుల్లో కూడా అతడిని ఆడించే అవకాశమే లేదు. వికెట్‌ కీపర్‌ అన్నది ఒక్క స్థానమే కాబట్టి అది పంత్‌తో భర్తీ అయిపోయినట్లే. పైగా సాహా వయసు 37 ఏళ్లు. అతను ఫిట్‌నెస్‌ సమస్యలతో ఇబ్బంది పడుతున్నాడు. బ్యాటింగ్‌ ఫామ్‌ కూడా బాగా లేదు. ఆంధ్రా ఆటగాడు శ్రీకర్‌ భరత్‌ నిలకడగా రాణిస్తూ ప్రత్యామ్నాయ వికెట్‌ కీపర్‌ స్థానానికి గట్టి పోటీదారుగా మారాడు. ఈ నేపథ్యంలో సాహాకు దారులు మూసుకుపోవడంతో అతడికి స్పష్టత ఇచ్చినట్లున్నారు. మిగతా ముగ్గురిలో ఇషాంత్‌ పరిస్థితి దాదాపు సాహాతో సమానం. అతను 34వ పడిలో ఉన్నాడు. ఫిట్‌నెస్‌ సమస్యలు ఎదుర్కొంటున్నాడు. ఫామ్‌లో లేడు. యువ బౌలర్లు చాలామంది పోటీలో ఉండటంతో వారిని కాదని ఇషాంత్‌ను ఆడించే పరిస్థితి కనిపించడం లేదు. చాలా ఏళ్ల నుంచి అతడి ప్రదర్శన సాధారణంగా ఉన్నప్పటికీ.. అవకాశాలు ఇస్తూనే ఉన్నారు. అలాగే 100 టెస్టులు ఆడేసిన అతను.. ఇదే ప్రదర్శనతో ఇకపై టీమ్‌ఇండియాలో కొనసాగడం కష్టంగానే ఉంది. ఇక పుజారా, రహానెలపై వేటు వేయాలనే డిమాండ్‌ చాన్నాళ్ల నుంచే ఉంది. అయినా గత ప్రదర్శనలను దృష్టిలో ఉంచుకుని అవకాశాలు ఇస్తూనే వచ్చారు. కానీ వాళ్లు నిలకడ అందుకోలేదు. ఈ నేపథ్యంలో వీరిపై వేటు పడింది. అలాగని వీరికి దారులు మూసుకుపోలేదు. దేశవాళీల్లో సత్తా చాటితే మళ్లీ జట్టులోకి వచ్చే అవకాశాలు లేకపోలేదు. కానీ కోచ్‌ ద్రవిడ్‌ ప్రాధాన్యం యువ ఆటగాళ్లకేనని.. ఇంతకుముందులా ఓ మోస్తరు ప్రదర్శనలతో జట్టులో కొనసాగడం కష్టమన్నది మాత్రం స్పష్టం.

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని