Olympics: భారత్‌లో 2036 ఒలింపిక్స్‌?

భారతీయుల కల నెరవేరే దిశగా అడుగులు పడుతున్నాయి. దశాబ్దాల సుదీర్ఘ నిరీక్షణకు ముగింపు పలికేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్‌ ఆతిథ్య హక్కులు దక్కించుకునే వైపుగా దేశం సాగుతుందనే సూచనలు కనిపిస్తున్నాయి. అన్నీ

Updated : 24 Feb 2022 08:46 IST

ఆతిథ్య హక్కుల కోసం ప్రయత్నాలు

బీజింగ్‌: భారతీయుల కల నెరవేరే దిశగా అడుగులు పడుతున్నాయి. దశాబ్దాల సుదీర్ఘ నిరీక్షణకు ముగింపు పలికేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్‌ ఆతిథ్య హక్కులు దక్కించుకునే వైపుగా దేశం సాగుతుందనే సూచనలు కనిపిస్తున్నాయి. అన్నీ అనుకున్నట్లు జరిగితే 2036 ఒలింపిక్స్‌ భారత్‌లో జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే గత ఎనిమిది ఒలింపిక్స్‌ (వింటర్‌ ఒలింపిక్స్‌తో సహా)కు గాను నాలుగు ఆసియా దేశాల్లోనే జరిగాయి. ఈ నేపథ్యంలో మరోసారి ఆ క్రీడలు ఆసియాకు తిరిగొస్తే వాటికి కచ్చితంగా భారత్‌ ఆతిథ్యమిస్తుందనే అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే 2024 (పారిస్‌), 2028 (లాస్‌ ఏంజిలెస్‌), 2032 (బ్రిస్బేన్‌) ఒలింపిక్స్‌ వేదికలు ఖరారయ్యాయి. ఇక ఇప్పుడు అందరి చూపు 2036పై పడింది. ఆ క్రీడల ఆతిథ్య హక్కులు ఎవరికి దక్కుతాయనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. దానికి సమాధానం భారత్‌ అని వినిపిస్తోంది. ‘‘2036 ఒలింపిక్స్‌ ఆతిథ్య హక్కుల కోసం భారత్‌ రేసులో ఉంది’’ అని భారత ఒలింపిక్‌ కమిటీ అధ్యక్షుడు నరిందర్‌ బత్రా కూడా స్పష్టం చేశాడు. మరోవైపు 40 ఏళ్ల తర్వాత తిరిగి భారత్‌లో వచ్చే ఏడాది అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐఓసీ) వార్షిక సమావేశం జరగబోతుంది. ఒలింపిక్స్‌ నిర్వహించాలనే కల దిశగా ఇదో కీలక అడుగు అని చెప్పొచ్చు. 2025లో ఐఓసీ అధ్యక్ష ఎన్నికల తర్వాత 2036 ఒలింపిక్స్‌ ఆతిథ్య దేశాన్ని ఎంపిక చేసే అవకాశం ఉంది. విస్త్రత స్థాయిలో బిడ్డింగ్‌ కాకుండా ఆసక్తి ఉన్న దేశాల నుంచి వచ్చే దరఖాస్తులను పరిశీలించి ఐఓసీ నాయకత్వ విభాగం ఈ ఆతిథ్య హక్కులను కట్టబెట్టే ఆస్కారం ఉంది. స్పాన్సర్లు, ప్రసార హక్కులు, ప్రభుత్వ మద్దతు, ప్రజల ఆదరణ.. ఇలా ఏ రకంగా చూసుకున్నా భారత్‌లో ఒలింపిక్స్‌ నిర్వహించడం వల్ల ఐఓసీకి లాభం చేకూరే అవకాశం ఉంది. అందుకే ఐఓసీ కూడా భారత్‌ వైపు మొగ్గు చూసేందుకు ఆసక్తితో ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అహ్మదాబాద్‌ ఆతిథ్య నగరంగా దేశంలో ఈ క్రీడలు జరిగే ఆస్కారముంది. మరోవైపు కరోనా కారణంగా ఏడాది పాటు వాయిదా వేసిన అనంతరం టోక్యో ఒలింపిక్స్‌ నిర్వహించడంతో జపాన్‌కు దాదాపు రూ.14.9 వేల కోట్లు అధికంగా ఖర్చు అయినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో 2030 వింటర్‌ ఒలింపిక్స్‌ను నిర్వహించే అవకాశాన్ని ఆ దేశానికి ఇవ్వాలని ఐఓసీ యోచిస్తున్నట్లు తెలిసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని