IND vs SL: దంచికొట్టారు.. సిరీస్‌ సొంతం చేసుకున్నారు

బాదుడే బాదుడు. టీమ్‌ ఇండియా చితక్కొట్టేసింది. సూపర్‌ ఫామ్‌ను కొనసాగిస్తూ శ్రేయస్‌ మరోసారి రెచ్చిపోతే.. విధ్వంసక విన్యాసాలతో జడేజా విరుచుకుపడ్డాడు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ సంజు శాంసనూ బ్యాట్‌

Updated : 27 Feb 2022 06:51 IST

చెలరేగిన శ్రేయస్‌

మెరిసిన జడేజా, శాంసన్‌

రెండో టీ20లో శ్రీలంకపై భారత్‌ ఘనవిజయం

నేడే మూడో టీ20 రాత్రి 7 నుంచి

ధర్మశాల

బాదుడే బాదుడు. టీమ్‌ ఇండియా చితక్కొట్టేసింది. సూపర్‌ ఫామ్‌ను కొనసాగిస్తూ శ్రేయస్‌ మరోసారి రెచ్చిపోతే.. విధ్వంసక విన్యాసాలతో జడేజా విరుచుకుపడ్డాడు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ సంజు శాంసనూ బ్యాట్‌ ఝుళిపించాడు. ఫలితం.. 184 పరుగుల లక్ష్యం సైతం ఉఫ్‌! బ్యాట్స్‌మెన్‌ దంచి కొట్టిన వేళ రెండో టీ20లో శ్రీలంకను చిత్తు చేసిన టీమ్‌ ఇండియా.. మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే సిరీస్‌ను చేజిక్కించుకుంది.

శ్రేయస్‌ అయ్యర్‌ (74 నాటౌట్‌; 44 బంతుల్లో 6×4, 4×6) చెలరేగడంతో శనివారం రెండో టీ20లో భారత్‌ 7 వికెట్ల తేడాతో శ్రీలంకపై ఘనవిజయం సాధించింది. నిశాంక (75; 53 బంతుల్లో 11×4), శనక (47 నాటౌట్‌; 19 బంతుల్లో 2×4, 5×6), గుణతిలక (38; 29 బంతుల్లో 4×4, 2×6) మెరవడంతో మొదట శ్రీలంక 5 వికెట్లకు 183 పరుగులు సాధించింది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ శ్రేయస్‌తో పాటు జడేజా (45 నాటౌట్‌; 18 బంతుల్లో 7×4, 1×6), సంజు శాంసన్‌ (39; 25 బంతుల్లో 2×4, 3×6) రెచ్చిపోవడంతో లక్ష్యాన్ని భారత్‌ 17.1 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్‌ 2-0 ఆధిక్యం సంపాదించింది. మూడో టీ20 ఆదివారం ధర్మశాలలోనే జరుగుతుంది.

శ్రేయస్‌ విధ్వంసం: లక్ష్యం పెద్దదే. ఆపై ఓపెనర్లు రోహిత్‌ (1), ఇషాన్‌ కిషన్‌ (16; 15 బంతుల్లో 2×4)లను లంక త్వరగానే వెనక్కి పంపింది. కానీ సూపర్‌ ఫామ్‌ను కొనసాగిస్తూ శ్రేయస్‌ ఆ జట్టుకు ఎలాంటి అవకాశమూ ఇవ్వలేదు. అతడు నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడ్డాడు. కళ్లు చెదిరే షాట్లతో అలరించాడు. ఇన్నింగ్స్‌ వెన్నెముకలా నిలిచి భారత్‌ను విజయపథంలో నడిపించాడు. ఛేదనలో మొదటి ఓవర్లోనే ఔటైన రోహిత్‌ స్థానంలో వచ్చిన శ్రేయస్‌.. ఫెర్నాండో బౌలింగ్‌లో బౌండరీతో పరుగుల ఖాతా తెరిచాడు. అతడి బౌలింగ్‌లోనే అయిదో ఓవర్లో వరుసగా మూడు బౌండరీలు కొట్టాడు. ఆరో ఓవర్లో ఇషాన్‌ ఔట్‌ కావడంతో వచ్చిన సంజు.. శ్రేయస్‌కు సహకరించాడు. అయితే 8 ఓవర్లలో 56/2తో నిలిచిన భారత్‌కు ఛేదన అంత తేలికేమీ కాదని అనిపించినా.. జోరు పెంచిన శ్రేయస్‌ లంక బౌలింగ్‌ను తుత్తునియలు చేస్తూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. జయవిక్రమ బౌలింగ్‌లో వరుసగా రెండు సిక్స్‌లు.. కరుణరత్నె, శనక ఓవర్లలో ఒక్కో సిక్స్‌ దంచాడు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనే కృతనిశ్చయంతో కనిపించిన శాంసన్‌ కూడా క్రమంగా గేర్‌ మార్చాడు. లహిరు కుమార వేసిన ఇన్నింగ్స్‌ 13వ ఓవర్లో మూడు సిక్స్‌లు, ఫోర్‌తో చెలరేగిపోయాడు. కానీ అదే ఓవర్‌ చివరి బంతికి అతడు ఔట్‌ కావడంతో 84 పరుగుల మూడు వికెట్‌ భాగస్వామ్యానికి తెరపడింది. అయినా.. భారత్‌ మరీ ఆందోళన చెందాల్సిన అవసరం లేకపోయింది. సాధించాల్సిన రన్‌రేట్‌ ఎక్కువేమీ లేదు. రెచ్చిపోయి ఆడిన జడేజా.. శ్రేయస్‌కు పెద్దగా పని లేకుండా చేశాడు. ఎడాపెడా బౌండరీలతో జట్టును వడవడిగా లక్ష్యం దిశగా తీసుకెళ్లిన అతడు.. విజయాన్ని మరింత తేలిక చేశాడు. చమీర బౌలింగ్‌ (16వ ఓవర్‌) జడేజా వరుసగా 6, 4, 4, 4 దంచేశాడు. జడేజా, శ్రేయస్‌ అభేద్యమైన నాలుగో వికెట్‌కు 58 పరుగులు జోడించడంతో 17 బంతులు మిగిలి ఉండగానే టీమ్‌ ఇండియా విజయాన్నందుకుంది.

మెరిసిన నిశాంక, శనక: శ్రీలంక ఇన్నింగ్స్‌లో ఓపెనర్‌ నిశాంక ఆటే హైలైట్‌. భారత బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ఓ దశలో తక్కువ స్కోరుతో సరిపెట్టుకునేలా కనిపించిన ఆ జట్టు.. మెరుగైన స్కోరు సాధించిందంటే కారణం అతడు. అలాగే కెప్టెన్‌ శనక విధ్వంసం కూడా. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లంక త్వరగా వికెట్లు కోల్పోలేదు కానీ.. వేగంగా పరుగులు చేయలేకపోయింది. నిశాంక, గుణతిలక స్వేచ్ఛగా బ్యాట్‌ ఝుళిపించలేకపోయారు. భువి, బుమ్రా బౌలింగ్‌లో పరుగుల కోసం చాలా కష్టపడ్డారు. 4 ఓవర్లలో స్కోరు 13 పరుగులే. అయితే బౌలర్లు మారడంతో బ్యాట్స్‌మెన్‌ దూకుడు కాస్త పెరిగింది. బంతులు చకచకా బౌండరీలు దాటాయి. 8 ఓవర్లకు స్కోరు 51/0. తొమ్మిదో ఓవర్లో గుణతిలక ఒక్కసారిగా గేర్‌ మార్చి రెచ్చిపోయాడు. జడేజా బౌలింగ్‌లో తొలి మూడు బంతుల్లో వరుసగా 6, 4, 6 దంచి భారత్‌ను కలవరపెట్టాడు. కానీ అదే ఊపులో మరో భారీ షాట్‌ ఆడబోయి అతడు శ్రేయస్‌కు చిక్కడంతో టీమ్‌ ఇండియా ఖాతాలో తొలి వికెట్‌ చేరింది. తర్వాతి ఓవర్లోనే అసలంక (2)ను చాహల్‌ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ఆ వెంటనే మిశార (1)ను హర్షల్‌ వెనక్కి పంపాడు. 9 పరుగుల వ్యవధిలో మూడు వికెట్లు చేజార్చుకున్న లంక 67/0 నుంచి 76/3కు చేరుకుంది. కానీ నిశాంక చక్కని బ్యాటింగ్‌, ఆఖర్లో కెప్టెన్‌ శనక విధ్వంసంతో ఆ జట్టు భారీ స్కోరు సాధించగలిగింది. వికెట్లు పడ్డా చలించని నిశాంక.. దూకుడు పెంచాడు. చకచకా బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. భువి ఓవర్లో రెండు ఫోర్లు.. జడేజా, చాహల్‌ ఓవర్లలో ఒక్కో ఫోర్‌ దంచేశాడు. ఇక చండిమాల్‌ (9) నిష్క్రమణతో నిశాంకకు తోడైన శనక వీరవిహారం చేశాడు. అతడు రెండు సిక్స్‌లు, నిశాంక ఓ బౌండరీ బాదడంతో హర్షల్‌ వేసిన ఇన్నింగ్స్‌ 17వ ఓవర్లో ఏకంగా 19 పరుగులొచ్చాయి. తర్వాత బుమ్రా ఓవర్లో నిశాంక మూడు ఫోర్లు బాదేశాడు. 19వ ఓవర్లో శనక ఓ సిక్స్‌, ఫోర్‌ కొట్టగా.. నిశాంక ఔటయ్యాడు. జోరు కొనసాగించిన శనక.. ఆఖరి ఓవర్లో (హర్షల్‌ పటేల్‌) చివరి రెండు బంతులను సిక్స్‌లుగా మలిచి ఇన్నింగ్స్‌కు మెరుపు ముగింపునిచ్చాడు. ఆఖరి అయిదు ఓవర్లలో శ్రీలంక ఏకంగా 80 పరుగులు రాబటింది.

రుతురాజ్‌ ఔట్‌: ఓపెనర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ గాయం కారణంగా శ్రీలంకతో టీ20 సిరీస్‌ మొత్తానికి దూరమయ్యాడు. గాయం వల్ల తొలి మ్యాచ్‌కు దూరమైన అతడు.. శనివారం రెండో టీ20కి కూడా అందుబాటులో లేకుండా పోయాడు. అతడి స్థానంలో మయాంక్‌ అగర్వాల్‌ను జట్టులోకి తీసుకున్నారు. ఇప్పటికే అతడు జట్టుతో చేరాడు. రుతురాజ్‌ జాతీయ క్రికెట్‌ అకాడమీకి వెళ్తాడని బీసీసీఐ తెలిపింది. గాయాల కారణంగా సూర్యకుమార్‌, దీపక్‌ చాహర్‌ ఇప్పటికే సిరీస్‌కు దూరమైన సంగతి తెలిసిందే.

శ్రీలంక ఇన్నింగ్స్‌: నిశాంక ఎల్బీ (బి)  భువనేశ్వర్‌ 75; గుణతిలక (సి) వెంకటేశ్‌ (బి) జడేజా 38; అసలంక ఎల్బీ (బి) చాహల్‌ 2; మిశార (సి) శ్రేయస్‌ (బి) హర్షల్‌ 1; చండిమాల్‌ (సి) రోహిత్‌ (బి) బుమ్రా 9; శనక నాటౌట్‌ 47; కరుణరత్నె నాటౌట్‌ 0; ఎక్స్‌ట్రాలు 11 మొత్తం: (20 ఓవర్లలో) 183/5; వికెట్ల పతనం: 1-67, 2-71, 3-76, 4-102, 5-160; బౌలింగ్‌: భువనేశ్వర్‌ 4-0-36-1; బుమ్రా    4-0-24-1; హర్షల్‌ పటేల్‌ 4-0-52-1; చాహల్‌ 4-0-27-1; జడేజా 4-0-37-1

భారత్‌ ఇన్నింగ్స్‌: రోహిత్‌ శర్మ (బి) చమీర 1; ఇషాన్‌ కిషన్‌ (సి) శనక (బి) లహిరు 16; శ్రేయస్‌ అయ్యర్‌ నాటౌట్‌ 74; సంజు శాంసన్‌ (సి) ఫెర్నాండో (బి) లహిరు 39; జడేజా నాటౌట్‌ 45; ఎక్స్‌ట్రాలు 11 మొత్తం: (17.1 ఓవర్లలో) 186/3; వికెట్ల పతనం: 1-9, 2-44, 3-128; బౌలింగ్‌: చమీర 3.1-0-39-1; ఫెర్నాండో 4-0-47-0; లహిరు కుమార 3-0-31-2; జయవిక్రమ 2-0-19-0; చమిక కరుణరత్నె 3-0-24-0; దసున్‌ శనక 2-0-24-0

11

టీ20ల్లో పూర్తిస్థాయి కెప్టెన్‌ అయ్యాక రోహిత్‌ నేతృత్వంలో భారత్‌ సాధించిన విజయాలు. వరుసగా మూడో సిరీస్‌లో టీమ్‌ఇండియా నెగ్గింది.

16

 స్వదేశంలో 17 టీ20ల్లో కెప్టెన్‌గా రోహిత్‌ సాధించిన విజయాలు. మోర్గాన్‌ (15), కేన్‌ విలియమ్సన్‌ (15) పేరిట ఉన్న రికార్డును అతడు తిరగరాశాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని