Updated : 03 Mar 2022 07:12 IST

Pujara-Rahane: పుజారా, రహానె, పాండ్య కిందికి

బీసీసీఐ కాంట్రాక్టుల్లో పతనం

మొహాలి: ఎంత సీనియర్లయినా ఫామ్‌ కోల్పోతే ఉపేక్షించేది లేదని ఇటీవల జట్టు ఎంపికలోనే సంకేతాలు ఇచ్చిన బీసీసీఐ.. ఇప్పుడు కాంట్రాక్టుల విషయంలోనూ ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. నిలకడ లేమితో శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు జట్టులో చోటు కోల్పోయిన సీనియర్‌ ఆటగాళ్లు చెతేశ్వర్‌ పుజారా, అజింక్య రహానె, ఇషాంత్‌ శర్మలలను వార్షిక కాంట్రాక్టులో ‘ఎ’ నుంచి ‘బి’ విభాగానికి తగ్గించింది. గత ఏడాది ‘ఎ’లో ఉన్న ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య, ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ ఏకంగా ‘సి’కి పడిపోవడం గమనార్హం. గత ఏడాది ‘ఎ’లో పదిమంది చోటు దక్కించుకోగా.. ఈసారి అయిదుగురే (కేఎల్‌ రాహుల్‌, షమి, అశ్విన్‌, జడేజా, పంత్‌) అందులో కొనసాగుతున్నారు. మూడు ఫార్మాట్లలో నిలకడగా రాణిస్తున్న హైదరాబాదీ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ ‘సి’ నుంచి ‘బి’కి ఎగబాకాడు. వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ వృద్ధిమాన్‌ సాహాను ‘సి’ కాంట్రాక్టు ఇచ్చారు. నిలకడగా రాణించలేకపోతున్న మయాంక్‌ అగర్వాల్‌ ‘బి’ నుంచి ‘సి’కి పడ్డాడు. రూ.7 కోట్ల వార్షిక జీతం పొందే ‘ఎ+’ విభాగంలో కోహ్లి, రోహిత్‌, బుమ్రా కొనసాగుతున్నారు. మహిళా క్రికెటర్ల కాంట్రాక్టులను సైతం బీసీసీఐ ఖరారు చేసింది. ఇప్పటికే హర్మన్‌ప్రీత్‌, స్మృతి మంధాన, పూనమ్‌ యాదవ్‌ ఉన్న గ్రూప్‌ ‘ఎ’లోకి కొత్తగా దీప్తి శర్మ, రాజేశ్వరి గైక్వాడ్‌లను చేర్చారు. వీరికి వార్షిక వేతనం రూ.50 లక్షలు. రూ.30 లక్షలు ‘బి’ విభాగంలో మిథాలి రాజ్‌, జులన్‌ గోస్వామి కొనసాగుతున్నారు. జెమీమా రోడ్రిగ్స్‌ ‘బి’ నుంచి ‘సి’ (రూ.10 లక్షలు)కి పడింది.

ఎ+ (ఏడాదికి రూ.7 కోట్లు): కోహ్లి, రోహిత్‌ ,బుమ్రా
ఎ (రూ.5 కోట్లు): అశ్విన్‌, జడేజా, పంత్‌, కేఎల్‌ రాహుల్‌, షమి
బి (రూ.3 కోట్లు): పుజారా, రహానె, ఇషాంత్‌, శ్రేయస్‌, అక్షర్‌ పటేల్‌, సిరాజ్‌, శార్దూల్‌
సి (రూ.1 కోటి): ధావన్‌, హార్దిక్‌ పాండ్య, సాహా, వాషింగ్టన్‌ సుందర్‌, దీపక్‌ చాహర్‌, చాహల్‌, శుభ్‌మన్‌ గిల్‌, విహారి, మయాంక్‌, సూర్యకుమార్‌, ఉమేశ్‌, భువనేశ్వర్‌.
దక్షిణాఫ్రికాతో టీ20 విశాఖలో: ఐపీఎల్‌ తర్వాత జూన్‌లో దక్షిణాఫ్రికాతో సొంతగడ్డపై భారత్‌ ఆడబోయే టీ20 సిరీస్‌కు వేదికలు ఖరారయ్యాయి. ఈ మ్యాచ్‌లు వరుసగా కటక్‌, విశాఖపట్నం, దిల్లీ, రాజ్‌కోట్‌, చెన్నైల్లో జరుగుతాయి. మ్యాచ్‌ల తేదీలు ఖరారు కావాల్సి ఉంది.

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని