Updated : 04 Mar 2022 06:54 IST

Virat Kohli - Rohit Sharma: 100 టెస్టులు ఆడతాననుకోలేదు

మొహాలి: కెరీర్‌ మొదలు పెట్టినప్పుడు వంద టెస్టులు ఆడతానని ఏమాత్రం ఊహించలేదని టీమ్‌ ఇండియా మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి అన్నాడు. ఏదైనా సాధ్యమే అనడానికి తన జీవితమే గొప్ప ఉదాహరణ అని చెప్పాడు. ‘‘భవిష్యత్త్లులో ఏం జరుగుతుందో మనకు తెలియదు. కాబట్టి ముందు ముందు ఏదో జరగదని అనవసరంగా భయపడొద్దు. నిస్పృహకు గురికాకూడదు. జీవితంలో ఏదైనా సాధ్యమే అనడానికి నా జీవితమే ఉదాహరణ. ఈ మ్యాచ్‌కు ప్రేక్షకులను అనుమతిస్తున్నారని తెలిసింది. శుక్రవారం ఉదయం నాకు ప్రత్యేకమైన ఉదయం. నేను అబద్ధం చెప్పదలచుకోలేదు. నాకు కాస్త గుబులుగానే ఉంది. భారత్‌కు చివరి మ్యాచ్‌ ఆడే వరకు ఈ భయం ఉండాలి. భయం పోయిందంటే ఆ ఆటగాడి పనైపోయిందన్నమాటే. వందో టెస్టు ఆడబోతున్నానంటే నమ్మలేకపోతున్నా. భారత జట్టు తరఫున 100 టెస్టులు ఆడతానని నేనెప్పుడూ ఊహించలేదు. ఇది సుదీర్ఘ ప్రయాణం. ఈ వంద టెస్టులాడే క్రమంలో ఎంతో క్రికెట్టాడా. ఎంతో అంతర్జాతీయ క్రికెట్‌ ఆడా. ఫిట్‌నెస్‌ కోసం ఎంతో కష్టపడ్డా. నాకు, నా కుటుంబానికి, నా కోచ్‌కు ఇది గొప్ప సందర్భం. ఇది చాలా చాలా ప్రత్యేకమైన సందర్భం. ఎంతో మనసు పెట్టి టెస్టు క్రికెట్‌ ఆడా. నా సామర్థ్యం మేరకు విధులు నిర్వర్తించా. నా బాధ్యతలు నెరవేర్చా. నా మొదటి టెస్టు (అడిలైడ్‌లో 116, 2012) శతకం నా మదిలో ఇంకా తాజాగానే ఉంది’’ అని కోహ్లి అన్నాడు.


‘‘ఒక టెస్టు జట్టుగా మేం చాలా మెరుగైన స్థితిలో ఉన్నాం. ఈ ఫార్మాట్లో మేం ఈ స్థాయికి రావడంలో పూర్తి ఘనత విరాట్‌కు చెందుతుంది. గత కొన్నేళ్లలో టెస్టు జట్టుతో అతను సాధించిన ఘనతలు అసామాన్యం. అతను ఎక్కడ వదిలేశాడో అక్కడి నుంచి నేను కొనసాగించాలనుకుంటున్నా. సరైన ఆటగాళ్లతో సరైన దిశగా అడుగులు వేయాలనుకుంటున్నా. విరాట్‌ కెరీర్‌ ఆరంభం నుంచి తన ప్రయాణాన్ని అద్భుత రీతిలో సాగిస్తున్నాడు. ఇప్పుడిలా వందో టెస్టు ఆడుతుండటం గొప్ప విషయం. టెస్టుల్లో అతను మేటి ప్రదర్శనలెన్నో చేశాడు. ఈ మ్యాచ్‌ను అతడికి ప్రత్యేకంగా మార్చేందుకు మేం కచ్చితంగా ప్రయత్నం చేస్తాం. కోహ్లి ఆట చూసేందుకు అభిమానులు కూడా స్టేడియానికి వస్తుండటం శుభ పరిణామం. పుజారా, రహానెల స్థానాలను భర్తీ చేయడం అంత తేలిక కాదు. వారి స్థానాల్లో ఎవరు ఆడతారో ఇప్పుడే చెప్పలేను. మ్యాచ్‌ రోజు ఉదయం వరకు ఎదురు చూద్దాం’’

- రోహిత్‌, టీమ్‌ఇండియా కెప్టెన్‌

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts