Virat Kohli: నా ప్రయాణం నుంచి ఆ స్ఫూర్తి పొందాలి: కోహ్లి

తీరిక లేని అంతర్జాతీయ క్రికెట్‌.. ఓ వైపు ఐపీఎల్‌.. మూడు ఫార్మాట్లోనూ ఆడడం.. అయినప్పటికీ వందో టెస్టు మైలురాయి చేరుకున్న తన ప్రయాణం నుంచి భవిష్యత్‌ తరం ఆటగాళ్లు స్ఫూర్తి పొందాలని టీమ్‌ఇండియా

Updated : 05 Mar 2022 08:02 IST

వంద వీరుడికి సత్కారం

తీరిక లేని అంతర్జాతీయ క్రికెట్‌.. ఓ వైపు ఐపీఎల్‌.. మూడు ఫార్మాట్లోనూ ఆడడం.. అయినప్పటికీ వందో టెస్టు మైలురాయి చేరుకున్న తన ప్రయాణం నుంచి భవిష్యత్‌ తరం ఆటగాళ్లు స్ఫూర్తి పొందాలని టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ఆకాంక్షించాడు. అన్ని ఫార్మాట్లలో ఆడుతూ టెస్టుల్లో ఈ ఘనత అందుకున్నాననే నిజం వాళ్లకు ప్రేరణగా నిలవాలని కోరుకున్నాడు. శుక్రవారం శ్రీలంకతో ఆరంభమైన తొలి మ్యాచ్‌తో వంద టెస్టులు ఆడిన 12వ భారత ఆటగాడిగా కోహ్లి నిలిచాడు. ఈ సందర్భంగా మ్యాచ్‌కు ముందు అతణ్ని.. బీసీసీఐ ఘనంగా సత్కరించింది. టీమ్‌ఇండియా ప్రధాన కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌.. కోహ్లీకి ప్రత్యేకంగా రూపొందించిన వందో టెస్టు టోపీని, జ్ఞాపికను అందజేశాడు. కోహ్లి భార్య అనుష్క శర్మ అతనితో పాటు మైదానంలో ఉంది.

అతని సోదరుడు వికాస్‌ స్టాండ్స్‌లో నుంచి ఈ కార్యక్రమాన్ని వీక్షించాడు. ‘‘ప్రస్తుత ఆటలో మూడు ఫార్మాట్లు, ఐపీఎల్‌ కలిపి ఎంతో క్రికెట్‌ ఆడుతున్నాం. నా టెస్టు కెరీర్‌ నుంచి భవిష్యత్‌ తరం ఆటగాళ్లు స్ఫూర్తి పొందాల్సింది ఏమైనా ఉంది అంటే.. ఇంత తీరిక లేని క్రికెట్‌ ఆడుతూనే స్వచ్ఛమైన ఫార్మాట్‌ అయిన టెస్టుల్లో వందో మ్యాచ్‌ ఘనత అందుకున్నాననే విషయాన్ని గ్రహించాలి. ఇది నాకెంతో ప్రత్యేకమైన సందర్భం. నా భార్య, సోదరుడు ఇక్కడే ఉన్నారు. నా కుటుంబ సభ్యులు, చిన్నప్పటి కోచ్‌లు అందరూ గర్వపడుతున్నారు. ఇది జట్టు ఆట. మీరు (సహచర ఆటగాళ్లు) లేకుంటే ఇది సాధ్యమయ్యేది కాదు. భారత్‌ తరపున ఆడేందుకు మొదట అవకాశం ఇచ్చిన బీసీసీఐకి ధన్యవాదాలు. అక్కడి నుంచి అంతా మెరుగవుతూ సాగింది. ఈ ప్రత్యేకమైన టోపీని ఇంతకంటే ఉత్తమ వ్యక్తి నుంచి తీసుకోలేనేమో! నా చిన్ననాటి హీరోల్లో ఒకరైన ద్రవిడ్‌తో అండర్‌-15 సమయంలో తీసుకున్న ఫొటో ఇప్పటికీ మా ఇంట్లో ఉంది. ఎవరిని చూస్తూ పెరిగానో అలాంటి వ్యక్తి చేతుల మీదుగా 100వ టెస్టు టోపీ అందుకున్నా. ఇదో గొప్ప ప్రయాణం. ఇది ఇంకా కొనసాగాలని కోరుకుంటున్నా’’ అని కోహ్లి తెలిపాడు. ‘‘విరాట్‌.. నీ చిన్నప్పుడు భారత్‌ తరపున ఓ టెస్టు మ్యాచ్‌ ఆడాలని కల కని ఉంటావు. ఇప్పుడు వందో టెస్టు ఆడే స్థాయికి చేరుకున్నావు. క్రమశిక్షణ, నైపుణ్యాలు, అంకితభావం, తపన.. ఇలా గొప్ప లక్షణాలన్నీ నీకున్నాయి. నీ ప్రయాణం గొప్పగా సాగింది. వందో టెస్టు ఆడుతున్నందుకే కాదు నీ ప్రయాణం పట్ల కూడా నువ్వు గర్వపడాలి. నువ్వు రెట్టించిన ఉత్సాహంతో మరెన్నో ఘనతలు సాధించాలి’’ అని ద్రవిడ్‌ పేర్కొన్నాడు. బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ, కార్యదర్శి జై షా, కోశాధికారి అరుణ్‌, ఉపాధ్యక్షుడు రాజీవ్‌ శుక్లా ఈ మ్యాచ్‌కు హాజరయ్యారు.

అరంగేట్ర మ్యాచ్‌లా అనిపించింది: వందో టెస్టులో బ్యాటింగ్‌ కోసం మైదానంలో అడుగుపెడుతుంటే అరంగేట్రం చేస్తున్నాననే భావన కలిగిందని కోహ్లి చెప్పాడు. ఉత్తమంగా ఆడుతున్నానని అనిపించినన్ని రోజులు శతకాల గురించి బాధపడనని అతను తెలిపాడు. ‘‘ఎప్పటిలాగే ఈ మ్యాచ్‌కు సిద్ధమయ్యా. బ్యాటింగ్‌ ఉత్తమంగా చేస్తున్నన్ని రోజులు శతకాల గురించి బాధ పడా. మైలురాళ్లు, గణాంకాలను మనమూ కాస్త పట్టించుకుంటాం. ఈ మ్యాచ్‌లో అడుగుపెడుతుంటే అరంగేట్రం చేస్తున్నాననే భావన కలిగింది. తీవ్ర ఒత్తిడికి గురయ్యా. మంచి ఆరంభం దక్కిన తర్వాత ఔటవడం నిరాశ కలిగించింది. జట్టు కోసం భారీ ఇన్నింగ్స్‌ ఆడి మంచి స్థితిలో నిలపడమే మన బాధ్యత. నా ఫిట్‌నెస్‌ను కాపాడుకుంటున్న విధానం పట్ల గర్వపడుతున్నా’’ అని విరాట్‌ పేర్కొన్నాడు.

ఆ ఊపు చూస్తే..

వందో టెస్టులో కోహ్లి ఆడిన తీరు చూస్తే.. సుదీర్ఘ శతక నిరీక్షణకు తెరదించేలాగే కనిపించాడు. మయాంక్‌ అగర్వాల్‌ రెండో వికెట్‌ రూపంలో ఔటవ్వడం ఆలస్యం.. స్టేడియం ఒక్కసారిగా హోరెత్తిపోయింది. ప్రేక్షకుల కరతాళ ధ్వనుల మధ్య క్రీజులోకి అడుగు పెట్టిన విరాట్‌.. లయ అందుకోవడానికి ఎంతో సమయం పట్టలేదు. తాను ఎదుర్కొన్న ఆరో బంతిని (విశ్వ ఫెర్నాండో బౌలింగ్‌) వికెట్‌కు నేరుగా అందమైన స్ట్రెయిట్‌ డ్రైవ్‌తో బౌండరీకి మళ్లించి అభిమానుల అలరించాడు విరాట్‌. క్రీజులో చాలా సౌకర్యంగా కనిపించిన అతణ్ని.. ఒక్క ఎంబుల్దేనియా మాత్రమే కాస్త ఇబ్బంది పెట్టాడు. చకచకా పరుగులు చేస్తూ 40ల్లోకి వచ్చేసిన విరాట్‌ ఇక అర్ధశతకం అందుకోవడం లాంఛనమే.. ఆ తర్వాత సెంచరీ కూడా కొట్టేస్తాడని అభిమానులు ఆశల పల్లకిలో ఉండగా.. ఎంబుల్దేనియా ఒక అనూహ్య బంతితో విరాట్‌ కథను ముగించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని