Shane Warne: షేన్‌ వార్న్‌ కన్నుమూత

ఫాస్ట్‌బౌలర్ల ఆధిపత్యం సాగుతున్న సమయంలో.. పేసర్లకు స్వర్గధామం లాంటి ఆస్ట్రేలియా పిచ్‌లపై.. తన లెగ్‌స్పిన్‌తో సరికొత్త చరిత్ర లిఖించిన దిగ్గజం షేన్‌వార్న్‌ తుదిశ్వాస విడిచాడు. థాయ్‌లాండ్‌లో వార్న్‌ గుండెపోటుతో...

Updated : 05 Mar 2022 06:50 IST

మెల్‌బోర్న్‌: ఫాస్ట్‌బౌలర్ల ఆధిపత్యం సాగుతున్న సమయంలో.. పేసర్లకు స్వర్గధామం లాంటి ఆస్ట్రేలియా పిచ్‌లపై.. తన లెగ్‌స్పిన్‌తో సరికొత్త చరిత్ర లిఖించిన దిగ్గజం షేన్‌వార్న్‌ తుదిశ్వాస విడిచాడు. థాయ్‌లాండ్‌లో వార్న్‌ గుండెపోటుతో మరణించినట్లు భావిస్తున్నట్లు అతడి సిబ్బంది తెలిపారు. 52 ఏళ్ల ఆయనకు ఓ తనయుడు, ఇద్దరు కుమార్తెలున్నారు. థాయ్‌లాండ్‌లోని రెండో అతి పెద్ద ద్వీపమైన కోహ్‌ సమూయిలోని తన విల్లాలో ఆయన మృతి చెందాడు. ‘‘షేన్‌వార్న్‌ తన విల్లాలో అచేతనంగా పడి ఉన్నారు. వైద్య బృందం ఎంతగా ప్రయత్నించినా ఆయన ప్రాణాలు కాపాడలేకపోయారు. ఆయన మరణానికి గుండెపోటు కారణమై ఉండొచ్చని భావిస్తున్నారు. వారి కుటుంబం ఇప్పుడు గోప్యతను కోరుకుంటోంది. మరిన్ని విషయాలను త్వరలోనే వెల్లడిస్తాం’’ అని వార్న్‌ సిబ్బంది ప్రకటించారు. 1992లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన వార్న్‌.. 145 టెస్టుల్లో 708 వికెట్లు పడగొట్టాడు. టెస్టుల్లో అత్యధిక వికెట్ల వీరుల జాబితాలో ముత్తయ్య మురళీధరన్‌ (800) తర్వాత వార్న్‌ రెండో స్థానంలో ఉన్నాడు. అతను 194 వన్డేల్లో 293 వికెట్లు సాధించాడు. 2007లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన వార్న్‌.. 2013లో అన్ని రకాల క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. 1999 వన్డే ప్రపంచకప్‌లో ఆసీస్‌ విజేతగా నిలవడంలో ఆయన కీలక పాత్ర పోషించాడు. ఆటకు రిటైర్మెంట్‌ ప్రకటించిన తర్వాత వ్యాఖ్యాతగా, విశ్లేషకుడిగా విభిన్న పాత్రలు పోషించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని