Updated : 06 Mar 2022 06:39 IST

Shane Warne: వార్న్‌ చివరి క్షణాల్లో

మరణానికి ముందు ఏం జరిగిందో చెప్పిన మేనేజర్‌

కోహ్‌ సమూయి (థాయ్‌లాండ్‌): స్పిన్‌ దిగ్గజం షేన్‌ వార్న్‌ మరణంతో క్రికెట్‌ ప్రపంచం షాక్‌కు గురైంది. 52 ఏళ్ల అతను శుక్రవారం గుండెపోటుతో హఠాత్తుగా మృతి చెందిన సంగతి తెలిసిందే. థాయ్‌లాండ్‌లో విహారంలో ఉన్న అతని మృతికి ముందు చివరి క్షణాల్లో ఏం జరిగిందో వార్న్‌ మేనేజర్‌ జేమ్స్‌ ఎర్స్‌కిన్‌ బయటపెట్టాడు. అచేతనంగా పడిపోయే ముందు వార్న్‌.. పాకిస్థాన్‌, ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్టును టీవీలో చూసినట్లు తెలిసింది. ‘‘మ్యాచ్‌ల వ్యాఖ్యానం కోసం ఇంగ్లాండ్‌ వెళ్లే ముందు దొరికిన సమయాన్ని గడిపేందుకు వార్న్‌ థాయ్‌లాండ్‌లో ఉన్నాడు. ఆ సమయంలో అతను మద్యం తీసుకోలేదు. తన స్నేహితుడు నియోఫిటోను కలిసి భోజనం చేద్దామనుకున్నాడు. సాయంత్రం 5 గంటల సమయంలో మరికొంత మందిని వార్న్‌, నియోఫిటో కలవాలనుకున్నారు. పక్క గదిలోనే ఉన్న నియో వచ్చేసరికి వార్న్‌ నిర్జీవంగా పడి ఉన్నాడు. అతనికి ఏదో అయిందని నియో భావించాడు. నోటిలో నోరు పెట్టి శ్వాస ఇచ్చేందుకు ప్రయత్నించాడు. హృదయ స్పందన లేకపోవడంతో సీపీఆర్‌ చేశాడు. 20 నిమిషాల తర్వాత అంబులెన్స్‌ వచ్చింది. ఓ గంట తర్వాత వార్న్‌ చనిపోయాడనే విషయం తెలిసింది. అతన్ని రెండు గంటల ముందు చివరగా చూశా. అతనెక్కువగా మద్యం తాగడం లేదు. బరువు తగ్గేందుకు ఆహార నియమాలు పాటిస్తున్నాడు’’ అని సుదీర్ఘ కాలంగా వార్న్‌ మేనేజర్‌గా ఉన్న జేమ్స్‌ చెప్పాడు. మరోవైపు ఆసుపత్రికి తీసుకు వచ్చేలోపే వార్న్‌ ప్రాణాలు పోయాయని థాయ్‌ అంతర్జాతీయ ఆసుపత్రి వెల్లడించింది.

అధికారిక లాంఛనాలతో: వార్న్‌కు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తామని ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్‌ మోరిసన్‌ శనివారం ప్రకటించారు. ‘‘వార్న్‌ హఠాన్మరణంతో ఆస్ట్రేలియా ప్రజలు దిగ్భ్రాంతి చెందారు. అధికారిక లాంఛనాలతో వార్న్‌ అంత్యక్రియలు చేస్తాం. మా దేశపు అత్యుత్తమ వ్యక్తుల్లో వార్న్‌ ఒకడు. క్రికెట్‌ ఆడేలా ఎంతోమంది అబ్బాయిలు, అమ్మాయిలకు స్ఫూర్తిగా నిలిచాడు’’ అని మోరిసన్‌ తెలిపారు. మరోవైపు వార్న్‌ గౌరవార్థం ఎంసీజీ మైదానంలోని ది గ్రేట్‌ సదర్న్‌ స్టాండ్‌కు అతని పేరు పెట్టనున్నట్లు విక్టోరియా క్రీడల మంత్రి మార్టిన్‌ ప్రకటించారు. వార్న్‌ ఆ మైదానంలో తన 700వ టెస్టు వికెట్‌తో పాటు ఓ యాషెస్‌ మ్యాచ్‌లో హ్యాట్రిక్‌ తీసుకున్నాడు. ఇప్పటికే ఆ మైదానం బయట అతని విగ్రహం ఉంది. అతని మరణవార్త తెలిసిన తర్వాత ప్రజలు అక్కడికి చేరుకుని పూలు, క్రికెట్‌ బంతులు విగ్రహం దగ్గర ఉంచి నివాళులు అర్పించారు.

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని