RCB - Virat Kohli: కోహ్లి మళ్లీ కెప్టెన్‌గానా.. కానే కాదు

ఐపీఎల్‌లో ఆరంభం నుంచి రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్టుతోనే ఉన్న విరాట్‌ కోహ్లి.. వచ్చే సీజన్‌ నుంచి కేవలం ఆటగాడిగానే కొనసాగనున్నాడు. గత సీజన్‌లోనే అతను ఆర్సీబీ పగ్గాలు వదిలేసిన సంగతి తెలిసిందే. కానీ మళ్లీ అతనికే జట్టు సారథ్య బాధ్యతలు అప్పగించాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Updated : 08 Mar 2022 07:04 IST

దిల్లీ: ఐపీఎల్‌లో ఆరంభం నుంచి రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్టుతోనే ఉన్న విరాట్‌ కోహ్లి.. వచ్చే సీజన్‌ నుంచి కేవలం ఆటగాడిగానే కొనసాగనున్నాడు. గత సీజన్‌లోనే అతను ఆర్సీబీ పగ్గాలు వదిలేసిన సంగతి తెలిసిందే. కానీ మళ్లీ అతనికే జట్టు సారథ్య బాధ్యతలు అప్పగించాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కోహ్లి తిరిగి కెప్టెన్సీ చేపట్టే అవకాశం లేదని ఆర్సీబీ మాజీ సారథి వెటోరి అభిప్రాయపడ్డాడు. ‘‘ఆర్సీబీ కెప్టెన్‌గా మళ్లీ కోహ్లీని చూస్తామని అనుకోవడం లేదు. అతను ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. మళ్లీ అతడినే నాయకుణ్ని చేయాలని పట్టుబట్టడం సరికాదేమో. అది ఫలితాన్ని ఇవ్వదు. ఫ్రాంఛైజీ లేదా అంతర్జాతీయ క్రికెట్లో ఆటగాళ్లు ఒక్కసారి సారథ్యం వదిలేశాక వాళ్లను స్వేచ్ఛగా సాగనివ్వాలి. అదే సరైంది. డుప్లెసిస్‌, మ్యాక్స్‌వెల్‌తో కలిసి కోహ్లీని నాయకత్వ బృందంలో భాగంగా జట్టు చూస్తుందని అనుకుంటున్నా. దినేశ్‌ కార్తీక్‌నూ అందులో చేర్చుకోవచ్చు. మూడేళ్ల కాలాన్ని దృష్టిలో పెట్టుకుని మ్యాక్స్‌వెల్‌ను జట్టు జాగ్రత్తగా గమనించే అవకాశం ఉంది. గత సీజన్‌లో లాగా అతను ఫామ్‌ కొనసాగిస్తే మూడేళ్ల పాటు అతనే కెప్టెన్‌గా ఉండే ఆస్కారం ఉంది. మరోవైపు మ్యాక్సీకి బదులుగా డుప్లెసిస్‌పైనా జట్టు దృష్టి సారించే అవకాశాలను కొట్టిపారేయలేం’’ అని అతను చెప్పాడు. కెప్టెన్సీ అనుభవం ఉన్న డుప్లెసిస్‌, దినేశ్‌ కార్తీక్‌ను మెగా వేలంలో వరుసగా రూ.7 కోట్లు, రూ.5.5 కోట్లకు ఆర్సీబీ దక్కించుకున్న సంగతి తెలిసిందే. మరోవైపు బిగ్‌బాష్‌ లీగ్‌లో జట్టును నడిపించిన అనుభవం మ్యాక్స్‌వెల్‌కు ఉంది. మరి వీళ్లలో జట్టు ఎవరిని కెప్టెన్‌గా ఎంపిక చేస్తుందో చూడాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని