Hardik Pandya: కప్పు కోసం కసరత్తు

ఈ ఏడాది ఆస్ట్రేలియాలో అక్టోబర్‌లో ఆరంభమయ్యే టీ20 ప్రపంచకప్‌పై బీసీసీఐ ఇప్పటి నుంచే దృష్టి సారించింది. ఆ దిశగా కేవలం పరిమిత ఓవర్ల స్పెషలిస్ట్‌ ఆటగాళ్లతోనే జాతీయ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సీఏ)లో ప్రత్యేక శిబిరాన్ని ఈ నెల 5న ప్రారంభించింది. అందులో పాల్గొనాలని ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యకు పిలుపొచ్చినట్లు తెలిసింది.

Updated : 08 Mar 2022 06:59 IST

ప్రత్యేక శిబిరానికి హార్దిక్‌

బెంగళూరు: ఈ ఏడాది ఆస్ట్రేలియాలో అక్టోబర్‌లో ఆరంభమయ్యే టీ20 ప్రపంచకప్‌పై బీసీసీఐ ఇప్పటి నుంచే దృష్టి సారించింది. ఆ దిశగా కేవలం పరిమిత ఓవర్ల స్పెషలిస్ట్‌ ఆటగాళ్లతోనే జాతీయ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సీఏ)లో ప్రత్యేక శిబిరాన్ని ఈ నెల 5న ప్రారంభించింది. అందులో పాల్గొనాలని ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యకు పిలుపొచ్చినట్లు తెలిసింది. కానీ కాస్త సమయం కావాలని కోరిన హార్దిక్‌ మరో రెండు రోజుల్లోపు ఎన్‌సీఏ వెళ్లే అవకాశం ఉంది. కోచ్‌ ద్రవిడ్‌, సెలక్టర్లు ఈ శిబిరాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. 25 మందికి పైగా ఆటగాళ్లు అందులో పాల్గొంటున్నారు. ‘‘టీ20 ప్రపంచకప్‌కు మరో ఆరు నెలలకు పైగా సమయం ఉన్నప్పటికీ ఇప్పటి నుంచే ఆ దిశగా ప్రణాళిక ప్రారంభమైంది. ఆటగాళ్ల ఫిట్‌నెస్‌ను కోచ్‌, సెలక్టర్లు పరీక్షించాలని అనుకుంటున్నారు’’ అని సంబంధిత వర్గాలు తెలిపాయి. గతేడాది టీ20 ప్రపంచకప్‌ తర్వాత నుంచి గాయాలు, ఫామ్‌లేమితో టీమ్‌ఇండియాకు దూరంగా ఉన్నప్పటికీ తిరిగి జట్టులో స్థానం కోసం హార్దిక్‌ను పరిగణిస్తున్నారనే విషయం ఇప్పుడు స్పష్టమైంది. జూన్‌లో సొంతగడ్డపై దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌లో అతణ్ని ఆడిస్తారని సమాచారం. మరోవైపు ఐపీఎల్‌ 15వ సీజన్‌ ఆరంభానికి ముందు ఇలా బీసీసీఐ 10 రోజుల శిబిరం నిర్వహించడంపై ఫ్రాంఛైజీలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఈ నెల 26న లీగ్‌ ఆరంభమవుతుంది. 12వ తేదీ నాటికి ఆటగాళ్లందరినీ ఒక్కచోటుకు చేర్చి వాళ్ల మధ్య బంధం ఏర్పడేలా వివిధ కార్యక్రమాలు నిర్వహించాలని ఫ్రాంఛైజీలు అనుకున్నాయి. కానీ ఇప్పుడు ఎన్‌సీఏలో శిబిరం 15న ముగుస్తుంది. ఆ తర్వాత ఆటగాళ్లు మూడు రోజుల క్వారంటైన్‌లో ఉండాలి. అంటే 18న ఆయా ఫ్రాంఛైజీలతో ఆ ఆటగాళ్లు కలుస్తారన్న మాట. అయితే ఆటగాళ్లు నేరుగా ఐపీఎల్‌ జట్లతో చేరేలా శిబిరంలో చివరి అయిదు రోజులు బయో బబుల్‌ ఏర్పాటు చేస్తారని తెలిసింది. కొత్త జట్టు గుజరాత్‌ టైటాన్స్‌కు హార్దిక్‌ కెప్టెన్‌గా ఎంపికైన విషయం విదితమే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని