Updated : 08 Mar 2022 06:55 IST

Shane Warne: షేన్‌వార్న్‌ది సహజ మరణమే

వెల్లడించిన థాయ్‌లాండ్‌ పోలీసులు
బ్యాంకాక్‌

స్పిన్‌ దిగ్గజం షేన్‌వార్న్‌ది సహజ మరణమేనని శవ పరీక్ష నివేదిక ఆధారంగా సోమవారం థాయ్‌లాండ్‌ పోలీసులు ప్రకటించారు. వైద్యులు అందించిన ఆ నివేదికను వార్న్‌ కుటుంబానికి, ఆస్ట్రేలియా రాయబార కార్యాలయానికి పంపినట్లు తెలిపారు. వార్న్‌ మృతిపై అతని కుటుంబ సభ్యులు ఎలాంటి అనుమానాలు వ్యక్తం చేయలేదన్నారు. అయితే మరణానికి గల కారణాన్ని మాత్రం వెల్లడించలేదు. అతను గుండెపోటుతోనే తుదిశ్వాస విడిచాడని ప్రాథమికంగా భావిస్తున్నట్లు చెప్పారు. ‘‘వార్న్‌కు సంబంధించిన వస్తువులు పోయినట్లు ఎలాంటి ఆధారాలు లేవు. ఘర్షణ జరిగినట్లు కూడా కనిపించడం లేదు. శవ పరీక్ష నివేదిక ఆధారంగా అతనిది సహజ మరణమే అని ఆసుపత్రి డైరెక్టర్‌ చెప్పాడు. వార్న్‌కు ఛాతీ నొప్పి కలిగిందని, తిరిగి వచ్చాక ఆసుపత్రికి వెళ్లాలని అనుకున్నాడని అతని తండ్రి వెల్లడించాడు. ఇది సహజ మరణమే హత్య కాదు’’ అని ఏసీపీ జనరల్‌ సురాహేత్‌ తెలిపారు. చాలా త్వరగా ఈ లోకాన్ని విడిచి వెళ్లిన వార్న్‌ అందరినీ షాక్‌కు గురి చేశాడని థాయ్‌లాండ్‌లోని ఆస్ట్రేలియా రాయబారి అలన్‌ పేర్కొన్నాడు. 52 ఏళ్ల వార్న్‌ శుక్రవారం కన్నుమూసిన సంగతి తెలిసిందే. అనుమానాస్పద మృతి ఘటనలో ప్రామాణిక విధానం ప్రకారం వార్న్‌ శవ పరీక్ష నివేదికను వీలైనంత త్వరగా న్యాయవాది కార్యాలయానికి పంపిస్తామని పోలీసులు పేర్కొన్నారు. అతని పార్థివ దేహాన్ని ఆస్ట్రేలియాకు ఎప్పుడు పంపిస్తారనే విషయంపై మాత్రం ఇప్పుడే ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. మరోవైపు తమ తనయుడి మరణంతో ముగింపు లేని ఓ పీడకల మొదలైందని వార్న్‌ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘షేన్‌ లేని భవిష్యత్తు నమ్మశక్యంగా లేదు. అతనితో గడిపిన ఆనందకరమైన జ్ఞాపకాలన్నీ ఈ దుఃఖాన్ని తట్టుకోవడానికి సాయం చేస్తాయి. ఆస్ట్రేలియా గర్వపడే వ్యక్తి వార్న్‌. ఎంసీజీ మైదానంలో ఓ స్టాండ్‌కు అతని పేరు పెట్టాలనుకోవడం గొప్ప విషయం. అధికారిక లాంఛనాలతో అతని అంత్యక్రియలు నిర్వహించాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం’’ అని వార్న్‌ తల్లిదండ్రులు బ్రిజిట్‌, కీత్‌ ఓ ప్రకటనలో తెలిపారు. ‘‘మీరు నా హృదయంలో కలిగించిన శూన్యాన్ని ఏదీ భర్తీ చేయలేదు. మీరో ఉత్తమ తండ్రి, గొప్ప స్నేహితుడు’’ అని వార్న్‌ తనయుడు జాక్సన్‌ పేర్కొన్నాడు.

ఛాతీనొప్పి వస్తోందన్నాడు: రెండు వారాల పాటు కేవలం ద్రవ ఆహారమే తీసుకున్న వార్న్‌ విహారానికి వెళ్లేముందు ఛాతీ నొప్పి, అధిక చెమట వస్త్తోందన్నాడని అతని మేనేజర్‌ జేమ్స్‌ ఎర్స్‌కిన్‌ వెల్లడించాడు. బరువు తగ్గే క్రమంలో వార్న్‌ పూర్తిగా 14 రోజులు కేవలం ద్రవ ఆహారమే తీసుకున్నాడని అతను చెప్పాడు. అలా ఇప్పటివరకూ మూణ్నాలుగు సార్లు చేశాడని పేర్కొన్నాడు. మరణానికి కొన్ని రోజుల ముందు గతంలో ఫిట్‌గా ఉన్న తన ఫొటోను పోస్టు చేస్తూ తిరిగి అలా మారేందుకు బరువు తగ్గే ప్రక్రియ మొదలెట్టానని ఇన్‌స్టాగ్రామ్‌లో వార్న్‌ ప్రకటించాడు. హృదయ సంబంధిత సమస్యతో ఇటీవల వార్న్‌ ఓ వైద్యుణ్ని సంప్రదించాడని అతని కుటుంబ సభ్యులు పోలీసులకు చెప్పారు. మరోవైపు గదిలో అచేతనంగా పడి ఉన్న తన స్నేహితుడిని కాపాడేందుకు వార్న్‌ మిత్రులు ఎంతగానో ప్రయత్నించారని పారామెడికల్‌ వైద్యుడు అనుక్‌ వెల్లడించాడు. విల్లాలో పార్టీ చేసుకున్నట్లు ఎలాంటి సంకేతాలు కనిపించలేదని, వార్న్‌ స్పందించకపోవడంతో అతని మిత్రులు తీవ్ర ఆవేదన చెందారని అతను చెప్పాడు. ఇక చివరగా వార్న్‌.. టోస్ట్‌ మీద ఆస్ట్రేలియా వెజిమైట్‌ పెట్టుకుని తిన్నాడని విల్లాలో అతనితో పాటు కలిసి భోజనం చేసిన స్నేహితుడు టామ్‌ హాల్‌ తెలిపాడు.

ఎంసీజీలో లక్షమంది సమక్షంలో అంత్యక్రియలు: చారిత్రక మెల్‌బోర్న్‌ క్రికెట్‌ స్టేడియం (ఎంసీజీ)లో ప్రభుత్వ లాంఛనాలతో వార్న్‌ అంత్యక్రియలు జరగనున్నాయి. వచ్చే రెండు నుంచి మూడు వారాల్లో జరిగే ఈ కార్యక్రమానికి లక్ష మంది వరకూ ప్రజలు హాజరయ్యే అవకాశం ఉంది. వ్యక్తిగతంగా కుటుంబ సభ్యులు నివాళులు అర్పించిన తర్వాత అతని మృతదేహాన్ని ఎంసీజీకి తరలిస్తారని తెలిసింది. అతని పార్థివ దేహం ఇంకా మెల్‌బోర్న్‌కు చేరకపోవడంతో అంత్యక్రియల తేదీని నిర్ణయించలేదు. ప్రధాని స్కాట్‌ మోరిసన్‌, విక్టోరియా ప్రీమియర్‌ డానియల్‌ ఆండ్రూస్‌ ఈ కార్యక్రమానికి హాజరవుతారని సమాచారం. తనకెంతో ఇష్టమైన ఎంసీజీ మైదానంలో వార్న్‌ 1994 యాషెస్‌ సిరీస్‌ బాక్సింగ్‌ డే టెస్టులో హ్యాట్రిక్‌ అందుకున్నాడు. టెస్టుల్లో 700వ వికెట్‌ ఘనతకు ఇక్కడే సొంతం చేసుకున్నాడు. ఈ మైదాన పరిసరాల్లో ఉన్న వార్న్‌ విగ్రహం దగ్గర ప్రజలు నివాళులు అర్పిస్తున్నారు.

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని