Cricket Rules: మన్కడింగ్‌ కాదు.. రనౌట్‌

క్రికెట్‌ మ్యాచ్‌లో మన్కడింగ్‌తో బ్యాటర్‌ను ఔట్‌ చేస్తే వెంటనే పెద్ద వివాదం మొదలవుతుంది. అది క్రీడా స్ఫూర్తికి విరుద్ధమని, అన్యాయమైన ఆట అని చర్చలు సాగుతాయి. కానీ ఇక అది ఎంత మాత్రం అన్యాయం కాదు. అది రనౌట్‌

Updated : 10 Mar 2022 06:45 IST

బంతికి ఉమ్ము రాయడంపై శాశ్వత నిషేధం

ఎంసీసీ కొత్త సవరణలు

క్రికెట్‌ మ్యాచ్‌లో మన్కడింగ్‌తో బ్యాటర్‌ను ఔట్‌ చేస్తే వెంటనే పెద్ద వివాదం మొదలవుతుంది. అది క్రీడా స్ఫూర్తికి విరుద్ధమని, అన్యాయమైన ఆట అని చర్చలు సాగుతాయి. కానీ ఇక అది ఎంత మాత్రం అన్యాయం కాదు. అది రనౌట్‌ కిందకే వస్తుంది. క్రికెట్‌ చట్టాలను రూపొందించి, సంరక్షించే మెరిల్‌బోన్‌ క్రికెట్‌ క్లబ్‌ (ఎంసీసీ) ఆ మేరకు తాజాగా సవరణ చేయడమే అందుకు కారణం. ఇంతకాలం నాన్‌ స్ట్రైకర్‌ క్రీజు దాటాడని బౌలర్‌ స్టంప్స్‌ను పడగొట్టి అతణ్ని ఔట్‌ చేయడాన్ని మన్కడింగ్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. 1948లో తొలిసారి భారత దిగ్గజం వినూ మన్కడ్‌.. ఆస్ట్రేలియా ఆటగాడు బిల్‌ బ్రౌన్‌ను ఇలా ఔట్‌ చేశాడు. దానికి ఆస్ట్రేలియా మీడియా మన్కడింగ్‌ అనే పేరు పెట్టింది. ఇంత కాలం అది ఐసీసీ క్రికెట్‌ చట్టాల్లోని అన్యాయమైన ఆట విభాగంలో ఉండేది. కానీ దీన్ని రనౌట్‌ కిందకు మారుస్తూ ఎంసీసీ నిర్ణయం తీసుకుంది. ‘‘చట్టంలోని 41.16 నిబంధన.. నాన్‌స్ట్రైకర్‌ను రనౌట్‌ చేయడాన్ని చట్టం 41 (అన్యాయమైన ఆట) నుంచి చట్టం 38 (రనౌట్‌)లోకి మార్చాం. ఆ చట్టం పేరు అలాగే ఉంటుంది’’ అని ఎంసీసీ ఓ ప్రకటనలో తెలిపింది. మరోవైపు కరోనా కారణంగా బంతిపై ఉమ్ము రుద్దడాన్ని ఐసీసీ నిషేధించిన సంగతి తెలిసిందే. తాజాగా దీన్ని శాశ్వతంగా నిషేధిస్తున్నట్లు ఎంసీసీ వెల్లడించింది. మెరుపు కోసం బంతిపై ఉమ్ము రాయడం వల్ల ఎలాంటి ప్రయోజనం కలగడం లేదని తేలిందని, అలా చేస్తే బంతి పరిస్థితిని బలవంతంగా మార్చే ఇతర చట్ట విరుద్ధమైన చర్యల్లాగానే భావిస్తామని పేర్కొంది. 2022 నియామవళిలో చేసిన భారీ మార్పులు ఈ ఏడాది అక్టోబర్‌ నుంచి అమల్లోకి వస్తాయని ఎంసీసీ స్పష్టం చేసింది. ఈ రెండు ప్రధాన సవరణలతో పాటు ఇతర కొన్ని మార్పులనూ ప్రతిపాదించింది. ఓవర్‌ చివరి బంతికి తప్ప ఓ ఆటగాడు క్యాచ్‌ ఔటైనప్పుడు క్రీజులోకి వచ్చే కొత్త బ్యాటరే స్ట్రైక్‌ తీసుకోవాలి. మ్యాచ్‌లో ఓ వ్యక్తి, జంతువు లేదా ఇతర కారణాల వల్ల ఆటంకం కలిగితే అప్పుడా బంతిని డెడ్‌బాల్‌గా ప్రకటిస్తారు. బౌలర్‌ తన బౌలింగ్‌ స్థితికి రాకముందు బ్యాటింగ్‌ చేస్తున్న ఆటగాడిని రనౌట్‌ చేసేందుకు బంతి విసిరితే దాన్నికూడా డెడ్‌బాల్‌గా పరిగణిస్తారు. చాలా అరుదుగా జరిగే దీన్ని గతంలో నోబాల్‌గా ప్రకటించేవాళ్లు. బౌలర్‌ రనప్‌ మొదలెట్టిన తర్వాత క్రీజులో బ్యాటర్‌ నిలబడే స్థానం ఆధారంగా వైడ్‌ బంతిని నిర్ణయించనున్నారు. పిచ్‌కు దూరంగా పడ్డ బంతి బ్యాట్‌కు కాస్త అందుబాటులో ఉంటే లేదా పిచ్‌పై బ్యాటర్‌ ఉండి ఆడితే అందుకు అనుమతి ఉంది. కానీ దానికి మించి పిచ్‌ దాటి బంతి వెళ్తే దాన్ని డెడ్‌బాల్‌గా చూస్తారు. ఏదైనా బంతి బ్యాటర్‌ను పిచ్‌ దాటి ఆడేలా ప్రేరేపిస్తే దాన్ని నోబాల్‌గా ప్రకటిస్తారు. ఇప్పుడు బంతి వేసేటప్పుడు ఫీల్డర్‌ ఎక్కువగా కదిలితే దాన్ని డెడ్‌బాల్‌గా పరిగణిస్తున్నారు. కానీ కొత్త సవరణ ప్రకారం ఎవరైనా ఫీల్డర్‌ అలా చేస్తే జరిమానాగా బ్యాటింగ్‌ జట్టుకు అయిదు పరుగులు జతచేస్తారు.

స్వాగతించిన సచిన్‌: క్రికెట్‌ చట్టాల్లో కొత్తగా ఎంసీసీ తీసుకువచ్చిన సవరణలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మన్కడింగ్‌ను రనౌట్‌ విభాగంలో చేర్చడాన్ని సచిన్‌ స్వాగతించాడు. ‘‘మన్కడింగ్‌పై ఎంసీసీ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా. దాన్ని మన్కడింగ్‌ అని పిలవడం చాలా అసౌకర్యంగా అనిపించేది. ఇప్పుడు దాన్ని రనౌట్‌గా మార్చడం సంతోషంగా ఉంది. నా మట్టుకు అదెప్పుడూ రనౌటే. ఇక ఆటగాడు క్యాచౌట్‌ అయినప్పుడు కొత్త బ్యాటర్‌ స్ట్రైక్‌ తీసుకోవాలనేది కూడా మంచి నిర్ణయం’’ అని అతను చెప్పాడు. మరోవైపు ఇంగ్లాండ్‌ వెటరన్‌ పేసర్‌ స్టువర్ట్‌ బ్రాడ్‌ మాత్రం మన్కడింగ్‌పై ఎంసీసీ నిర్ణయం అన్యాయమని పేర్కొన్నాడు. ‘‘ఇప్పుడు మన్కడ్‌ అనేది చట్టపరమైన ఔట్‌గా మారుతుంది. నా అభిప్రాయం ప్రకారం అది అన్యాయం. బ్యాటర్‌ను ఔట్‌ చేయడమనేది నైపుణ్యాలతో ముడిపడి ఉంటుంది. మన్కడింగ్‌ చేసేందుకు ఎలాంటి నైపుణ్యాలు అవసరం లేదు’’ అని అతను ట్వీట్‌ చేశాడు. క్రికెట్‌ స్ఫూర్తి పేరుతో మన్కడింగ్‌ చేసిన వాళ్లను దోషులుగా చూసే పరిస్థితి మారుతుందని దినేశ్‌ కార్తీక్‌ చెప్పాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని