Kidambi Srikanth: క్వార్టర్స్‌లో శ్రీకాంత్‌

జర్మన్‌ ఓపెన్‌ ప్రపంచ టూర్‌ సూపర్‌ 300 టోర్నీలో భారత స్టార్‌ షట్లర్‌ కిదాంబి శ్రీకాంత్‌ క్వార్టర్‌ఫైనల్లోకి దూసుకెళ్లాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్‌ ప్రిక్వార్టర్స్‌లో 8వ సీడ్‌ శ్రీకాంత్‌ 21-16, 21-23, 21-

Updated : 11 Mar 2022 07:21 IST

సింధు, సైనా పరాజయం

దిల్లీ

జర్మన్‌ ఓపెన్‌ ప్రపంచ టూర్‌ సూపర్‌ 300 టోర్నీలో భారత స్టార్‌ షట్లర్‌ కిదాంబి శ్రీకాంత్‌ క్వార్టర్‌ఫైనల్లోకి దూసుకెళ్లాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్‌ ప్రిక్వార్టర్స్‌లో 8వ సీడ్‌ శ్రీకాంత్‌ 21-16, 21-23, 21-18తో గువాంగ్‌ జు (చైనా)పై విజయం సాధించాడు. 67 నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన పోరులో ప్రత్యర్థిపై శ్రీకాంత్‌దే పైచేయి అయింది. మరో స్టార్‌ షట్లర్లు పి.వి.సింధు, సైనా నెహ్వాల్‌కు చుక్కెదురైంది. మహిళల సింగిల్స్‌ ప్రిక్వార్టర్స్‌లో ఏడో సీడ్‌ సింధు 14-21, 21-15, 14-21తో 34వ ర్యాంకర్‌ జాంగ్‌ యి (చైనా) చేతిలో పరాజయం చవిచూసింది. తనకన్నా మెరుగైన ర్యాంకర్‌ సింధుపై గొప్పగా ఆడిన జాంగ్‌ యి తొలి గేమ్‌ను గెలుచుకుని ఆరంభంలోనే ఆధిపత్యం ప్రదర్శించింది. కానీ సింధు పుంజుకుంది. ప్రత్యర్థి నుంచి ప్రతిఘటన ఎదురైనా నిలిచిన ఈ తెలుగమ్మాయి.. విరామ సమయానికి 11-10తో స్వల్ప ఆధిక్యంలో నిలవడమేకాక ఆపై మరింత ధాటి ఆడి గేమ్‌ గెలిచి మ్యాచ్‌లో నిలిచింది. నిర్ణయాత్మక మూడో గేమ్‌లో సింధు ఒక దశలో 11-8తో ఆధిక్యంలో నిలిచింది. కానీ అక్కడ నుంచి విజృంభించిన జాంగ్‌ గేమ్‌తో పాటు మ్యాచ్‌ను కైవసం చేసుకుంది. మరో ప్రిక్వార్టర్స్‌లో సైనా 10-21, 15-21తో రచనోక్‌ ఇంటోనన్‌ (థాయ్‌లాండ్‌) చేతిలో ఓడింది. ఈ మ్యాచ్‌లో రెండో గేమ్‌లో తప్ప రచనోక్‌కు సైనా పెద్దగా పోటీ ఇవ్వలేకపోయింది. అంతకుముందు మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్లో ఆకర్షి కశ్యప్‌ 15-21, 14-21తో లైన్‌ హాజ్‌మార్క్‌ (డెన్మార్క్‌), మాళవిక బాన్సోద్‌ 18-21, 22-20, 9-21తో మిచెల్‌ లీ (కెనడా) చేతిలో ఓడారు. పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్లో పారుపల్లి కశ్యప్‌ 13-21, 13-21తో కున్లావత్‌ (థాయ్‌లాండ్‌) చేతిలో పరాజయం పాలయ్యాడు. మహిళల డబుల్స్‌ తొలి రౌండ్లో గాయత్రి గోపీచంద్‌- ట్రీసా జాలీ జోడీ 21-15, 21-12తో దెబోరా- చెరిల్‌   (నెదర్లాండ్స్‌) జంటపై విజయం సాధించింది. పురుషుల డబుల్స్‌ తొలి రౌండ్లో కృష్ణ ప్రసాద్‌- విష్ణువర్ధన్‌గౌడ్‌ జోడీ 24-22, 21-11తో ఒకమురా- మసయుకి (జపాన్‌) జంటపై గెలుపొందింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని