Sachin Tendulkar: సచిన్‌తో ఆ బుడతడు!

చిన్నప్పుడే చాలా అందంగా క్రికెటింగ్‌ షాట్లు ఆడుతూ సామాజిక మాధ్యమాల ద్వారా వెలుగులోకి వచ్చిన అయిదేళ్ల ఎస్‌కే షాహిద్‌కు ఊహించని అనుభవం ఎదురైంది. అతడు ఎంతో ఇష్టపడే సచిన్‌

Updated : 12 Mar 2022 06:53 IST

ముంబయి: చిన్నప్పుడే చాలా అందంగా క్రికెటింగ్‌ షాట్లు ఆడుతూ సామాజిక మాధ్యమాల ద్వారా వెలుగులోకి వచ్చిన అయిదేళ్ల ఎస్‌కే షాహిద్‌కు ఊహించని అనుభవం ఎదురైంది. అతడు ఎంతో ఇష్టపడే సచిన్‌ తెందుల్కర్‌ సమక్షంలో ప్రాక్టీస్‌ చేసే సువర్ణావకాశం దక్కింది. ముంబయిలోని మిడిలెసెక్స్‌ గ్లోబల్‌ అకాడమీలో షాహిద్‌ను కలిసి అభినందించిన సచిన్‌.. బ్యాటింగ్‌లో కొన్ని మెళుకువలు కూడా చెప్పాడు. షాహిద్‌ కుటుంబం ముంబయి రావడానికి, అక్కడ ఉండడటానికి అయిన ఖర్చులను సచినే భరించాడు. ‘‘మా అబ్బాయి షాహిద్‌ వయసు అయిదేళ్లు. సచిన్‌ తెందుల్కర్‌ను ఆరాధించే అతడు క్రికెటర్‌ కావాలని ఆశించాడు. షాహిద్‌ క్రికెట్‌ ఆడుతున్న వీడియోను ట్విటర్‌లో పోస్టు చేశాం. ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో విస్తృతం అయింది. ఆ వీడియోను చూసిన సచిన్‌.. అకాడమీకి వచ్చే ఏర్పాట్లు చేయడం ఆనందంగా ఉంది. సచిన్‌ను ఒకసారి చూడాలన్నది షాహిద్‌ కల. అలాంటిది ఏకంగా అతడినే కలవడం నమ్మశక్యంగా అనిపించట్లేదు. మిడిలెసెక్స్‌ గ్లోబల్‌ అకాడమీలో అయిదు రోజులు షాహీద్‌ ప్రాక్టీస్‌ చేశాడు. ప్రతిరోజూ ఎలా శిక్షణ పొందాలనేది షెడ్యూల్‌ ఇచ్చారు. సచిన్‌ దగ్గరుండి షాహీద్‌ బ్యాటింగ్‌ చూశారు. బ్యాక్‌ఫుట్‌పై ఎలాంటి బంతులను ఆడాలో చెప్పారు. బ్యాట్‌ గ్రిప్‌ ఎలా పట్టుకోవాలో చూపించారు’’ అని షాహిద్‌ తండ్రి షేక్‌ షంషేర్‌ తెలిపాడు. హెయిర్‌ సెలూన్‌లో పని చేసే షంషేర్‌ సరదాగా ట్విటర్లో అప్‌లోడ్‌ చేసిన వీడియో వైరల్‌గా మారింది. ఆస్ట్రేలియా ఛానల్‌ ఫాక్స్‌ క్రికెట్‌ సచిన్‌ సహా ప్రముఖులను ట్యాగ్‌ చేస్తూ ఈ వీడియోను రీట్వీట్‌ చేసింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని