PinkBall Test: మన గులాబీయే.. తొలి రోజు భారత్‌దే పైచేయి

574/8.. శ్రీలంకతో తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ స్కోరిది. శనివారం ఆరంభమైన రెండో టెస్టులో తొలి రోజు రోహిత్‌ సేన 252 పరుగులకే ఆలౌటైంది. ఈ అంతరం చూసి బ్యాటింగ్‌లో భారత్‌ తేలిపోయిందని అనుకుంటే తప్పులో కాలేసినట్లే. డేనైట్‌ టెస్టు.. గులాబి బంతి.. విపరీతమైన టర్న్‌, బౌన్స్‌.. ఏ బంతి ఎటు తిరుగుతుందో.. ఎంత ఎత్తులో వస్తుందో తెలియదు.. ప్రతి బంతికీ వికెట్‌ పడేలా కనిపించిన ప్రతికూల పరిస్థితుల్లో భారత్‌ భారీ స్కోరు చేసినట్లే లెక్క. 86 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన లంకను చూశాక మన జట్టు ఎంత బాగా బ్యాటింగ్‌ చేసిందో ఇంకా బాగా అర్థమైంది.

Updated : 13 Mar 2022 09:48 IST

శ్రేయస్‌ సూపర్‌ ఇన్నింగ్స్‌
మెరిసిన బుమ్రా, షమి
భారత్‌ 252.. శ్రీలంక 86/6

574/8.. శ్రీలంకతో తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ స్కోరిది. శనివారం ఆరంభమైన రెండో టెస్టులో తొలి రోజు రోహిత్‌ సేన 252 పరుగులకే ఆలౌటైంది. ఈ అంతరం చూసి బ్యాటింగ్‌లో భారత్‌ తేలిపోయిందని అనుకుంటే తప్పులో కాలేసినట్లే. డేనైట్‌ టెస్టు.. గులాబి బంతి.. విపరీతమైన టర్న్‌, బౌన్స్‌.. ఏ బంతి ఎటు తిరుగుతుందో.. ఎంత ఎత్తులో వస్తుందో తెలియదు.. ప్రతి బంతికీ వికెట్‌ పడేలా కనిపించిన ప్రతికూల పరిస్థితుల్లో భారత్‌ భారీ స్కోరు చేసినట్లే లెక్క. 86 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన లంకను చూశాక మన జట్టు ఎంత బాగా బ్యాటింగ్‌ చేసిందో ఇంకా బాగా అర్థమైంది. తొలి రోజు ఆట చూస్తే.. తొలి టెస్టులా ఈ మ్యాచ్‌ మూడు రోజులు సాగుతుందా అన్నది అనుమానమే. ఇంకా ముందే లంకను చుట్టేసేలా ఉంది టీమ్‌ఇండియా.

బెంగళూరు

సొంతగడ్డపై ఇంతకుముందు ఆడిన రెండు డేనైట్‌ టెస్టులను వరుసగా 3, 2 రోజుల్లోనే ప్రత్యర్థులను చుట్టేసిన భారత్‌.. మూడో మ్యాచ్‌లోనూ అదే ఒరవడిని కొనసాగించేలా ఉంది. బ్యాటింగ్‌ చాలా కష్టంగా మారిన పరిస్థితుల్లో తొలి రోజు బ్యాటుతో, బంతితో సత్తా చాటింది. శ్రేయస్‌ అయ్యర్‌ (92; 98 బంతుల్లో 10×4, 4×6) మేటి ఇన్నింగ్స్‌ ఆడటంతో తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 252 పరుగులు చేసింది. లంక బౌలర్లలో ఎంబుల్దేనియా (3/94), జయవిక్రమ (3/81), ధనంజయ డిసిల్వా (2/32) రాణించారు. అనంతరం జస్‌ప్రీత్‌ బుమ్రా (3/15), మహ్మద్‌ షమి (2/18)ల ధాటికి లంక 86/6తో నిలిచింది. మాథ్యూస్‌ (43; 85 బంతుల్లో 3×4, 2×6) చెప్పుకోదగ్గ ఒక్కడే ఇన్నింగ్స్‌ ఆడాడు. ఆట ఆఖరుకు డిక్వెలా (13), ఎంబుల్దేనియా (0) క్రీజులో ఉన్నారు.

స్పిన్‌ నుంచి పేస్‌కు..: భారత ఇన్నింగ్స్‌లో స్పిన్నర్లదే ఆధిపత్యం కాగా.. లంక బ్యాటింగ్‌ మొదలయ్యాక పేసర్ల హవా కనిపించింది. అంతకుముందులా బంతి టర్న్‌ కాలేదు. మంచు ప్రభావం వల్ల స్పిన్నర్లకు బంతి మీద పట్టు చిక్కలేదు. కానీ స్వింగ్‌ అవుతున్న గులాబి బంతిని పేసర్లు బాగా ఉపయోగించుకున్నారు. బుమ్రా, షమి నిప్పులు చెరిగే బంతులతో లంకకు కఠిన సవాల్‌ విసిరారు. బుమ్రా వరుస ఓవర్లలో కుశాల్‌ మెండిస్‌ (2), తిరిమానె (8)లను ఔట్‌ చేసి లంకను ఆరంభంలోనే గట్టి దెబ్బ తీశాడు. షమి.. దిముత్‌ కరుణరత్నె (4)ను ఇన్‌ స్వింగర్‌తో బౌల్డ్‌ చేసి లంకను మరింత ఇబ్బందుల్లోకి నెట్టాడు. అప్పటికి స్కోరు 14/3. ఈ స్థితిలో మాథ్యూస్‌, ధనంజయ డిసిల్వా (10) కాసేపు బౌలర్లను ప్రతిఘటించారు. కానీ షమి ఈ భాగస్వామ్యాన్ని బలపడనివ్వలేదు. ధనంజయను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. భారత్‌ సమీక్షలో ఈ వికెట్‌ సాధించింది. కాసేపటికే అక్షర్‌ బౌలింగ్‌లో అసలంక (5) ముందుకొచ్చి షాట్‌ ఆడబోయి అశ్విన్‌కు దొరికిపోయాడు. 50/5తో లంక పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో మాథ్యూస్‌.. డిక్వెలాతో కలిసి జట్టును ఆదుకున్నాడు. కానీ ఆఖర్లో అతను బుమ్రాకు తలవంచాడు.

వారెవా శ్రేయస్‌: మధ్యాహ్నం బంతి విపరీతంగా టర్న్‌, బౌన్స్‌ అయిన పిచ్‌పై బ్యాటింగ్‌ చేయడం చాలా కష్టమై టీమ్‌ఇండియా ఒక దశలో 126/5తో నిలిచింది. ఇన్నింగ్స్‌లో పెద్ద భాగస్వామ్యాలేవీ నమోదు కాలేదు. టర్న్‌, బౌన్స్‌ కారణంగా స్పిన్‌ బౌలింగ్‌ ఆడటం చాలా కష్టంగా మారిన పిచ్‌పై లంక క్రమం తప్పకుండా వికెట్లు పడగొట్టగలిగింది. 59.1 ఓవర్ల పాటు సాగిన భారత ఇన్నింగ్స్‌లో పేసర్లు వేసింది 11 ఓవర్లు మాత్రమే. స్పెషలిస్టు స్పిన్నర్లు ఎంబుల్దేనియా, జయవిక్రమలకు తోడు పార్ట్‌ టైం స్పిన్నర్‌ ధనంజయ డిసిల్వా భారత బ్యాటింగ్‌ను బాగానే దెబ్బ తీశారు. అయితే పరిస్థితులను అర్థం చేసుకున్న భారత బ్యాట్స్‌మెన్‌ ఎదురు దాడి  చేయడం ద్వారా వేగంగా పరుగులు రాబట్టే ప్రయత్నం  చేసి సఫలమయ్యారు. పంత్‌ తనదైన శైలిలో చెలరేగి సరైన సమయంలో ఇన్నింగ్స్‌కు ఊపు తెస్తే.. తర్వాత ఓ ఎండ్‌లో వికెట్లు పడుతూనే ఉన్నా, మరో ఎండ్‌లో అసాధారణ రీతిలో షాట్లు ఆడుతూ భారత్‌కు మంచి స్కోరు సాధించి పెట్టాడు శ్రేయస్‌.

అలా మొదలై..: టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్‌.. రెండో ఓవర్లోనే వికెట్‌ కోల్పోయింది. అయితే ఇది లంక బౌలింగ్‌ ప్రతిభతో సాధించిన వికెట్‌ కాదు. మయాంక్‌ చేజేతులా సమర్పించుకున్నది. మయాంక్‌ ప్యాడ్లకు తాకిన బంతికి విశ్వ ఫెర్నాండో ఎల్బీ అప్పీల్‌ చేయగా.. అంపైర్‌ స్పందించలేదు. ఈలోపు లెగ్‌ బై కోసం మయాంక్‌ ముందుకొచ్చేశాడు. నాన్‌ స్ట్రైక్‌లో ఉన్న రోహిత్‌ ఒక్క అడుగు కూడా ముందుకు వేయకుండా, వద్దంటున్నా మయాంక్‌ ఆగలేదు. అవతల రనౌట్‌ లాంఛనం ముగిసింది. తర్వాత రోహిత్‌ (15))కు విహారి (31; 81 బంతుల్లో 4×4) జత కలిశాడు. ఇద్దరూ ఆచితూచి ఆడుతూ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపిస్తున్న సమయంలో ఎంబుల్దేనియా రంగప్రవేశం చేశాడు. అతను వచ్చీ రాగానే రోహిత్‌ను స్లిప్‌ క్యాచ్‌తో పెవిలియన్‌ చేర్చాడు. ఆపై విహారి, కోహ్లి (23; 48 బంతుల్లో 2×4) కీలక భాగస్వామ్యంతో ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. గంటకు పైగా వికెట్‌ ఇవ్వని ఈ జంట.. ఓ మోస్తరు వేగంతో పరుగులు చేసింది. అయితే క్రీజులో కుదురుకున్న వీళ్లిద్దరూ స్వల్ప వ్యవధిలో వెనుదిరిగారు. విహారిని జయవిక్రమ వికెట్‌ కీపర్‌ క్యాచ్‌తో వెనక్కి పంపితే.. కోహ్లిని ఎంబుల్దేనియా బౌల్డ్‌ చేశాడు. ఈ వికెట్లతో ఆత్మరక్షణలో పడుతుందనుకున్న భారత్‌.. పరుగుల వేటలో దూసుకెళ్లింది. అందుక్కారణం పంత్‌ (39; 26 బంతుల్లో 7×4). పరిస్థితులతో సంబంధం లేకుండా తన ఆట తాను ఆడే ఈ వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మెన్‌ క్రీజులో అడుగు పెట్టగానే షాట్లకు దిగాడు. 4 పరుగుల వద్ద క్యాచ్‌ చేజారడంతో బతికిపోయిన పంత్‌.. బౌండరీల మోత మోగించడంతో చూస్తుండగానే స్కోరు 120 దాటేసింది. కానీ ప్రమాదకరంగా మారుతున్న అతణ్ని కూడా ఎంబుల్దేనియానే బౌల్డ్‌ చేశాడు. ఇక్కడి నుంచి వికెట్ల పతనం ఆగలేదు. గత మ్యాచ్‌ హీరో జడేజా (4)తో పాటు అశ్విన్‌ (13), అక్షర్‌ పటేల్‌ (9) విఫలమయ్యారు. అయినా భారత్‌ అంత స్కోరు చేయడానికి శ్రేయస్‌ వీరోచిత ఇన్నింగ్సే కారణం. బ్యాటింగ్‌ చాలా కష్టంగా ఉన్న పరిస్థితుల్లో అతడి ఆట గురించి ఎంత చెప్పినా తక్కువే. ఓవైపు వికెట్లు పడుతుండటంతో వీలైనంత ఎక్కువ స్కోరు చేయడం కోసం షాట్లు ఆడుతూనే సాగాడతను. సెంచరీ కోసం చూడకుండా శ్రేయస్‌ ఇంకో భారీ షాట్‌కు ప్రయత్నించి స్టంపౌట్‌ కావడంతో భారత్‌ ఇన్నింగ్స్‌ ముగిసింది.

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: మయాంక్‌ రనౌట్‌ 4; రోహిత్‌ (సి) ధనంజయ (బి) ఎంబుల్దేనియా 15; విహారి (సి) డిక్వెలా (బి) జయవిక్రమ 31; కోహ్లి ఎల్బీ (బి) ధనంజయ 23; పంత్‌ (బి) ఎంబుల్దేనియా 39; శ్రేయస్‌ (స్టంప్డ్‌) డిక్వెలా (బి) జయవిక్రమ 92; జడేజా (సి) తిరిమానె (బి) ఎంబుల్దేనియా 4; అశ్విన్‌ (సి) డిక్వెలా (బి) ధనంజయ 13; అక్షర్‌ (బి) లక్మల్‌ 9; షమి (సి) ధనంజయ (బి) జయవిక్రమ 5; బుమ్రా నాటౌట్‌ 0; ఎక్స్‌ట్రాలు 17 మొత్తం: (59.1 ఓవర్లలో ఆలౌట్‌) 252; వికెట్ల పతనం: 1-10, 2-29, 3-76, 4-86, 5-126, 6-148, 7-183, 8-215, 9-229; బౌలింగ్‌: లక్మల్‌ 8-3-12-1; విశ్వ ఫెర్నాండో 3-0-18-0; ఎంబుల్దేనియా 24-2-94-3; జయవిక్రమ 17.1-3-81-3; ధనంజయ డిసిల్వా 7-1-32-2

శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌: కుశాల్‌ మెండిస్‌ (సి) శ్రేయస్‌ (బి) బుమ్రా 2; దిముత్‌ కరుణరత్నె (బి) షమి 4; తిరిమానె (సి) శ్రేయస్‌ (బి) బుమ్రా 8; మాథ్యూస్‌ (సి) రోహిత్‌ (బి) బుమ్రా 43; ధనంజయ డిసిల్వా ఎల్బీ (బి) షమి 10; అసలంక (సి) అశ్విన్‌ (బి) అక్షర్‌ 5; డిక్వెలా బ్యాటింగ్‌ 13; ఎంబుల్దేనియా బ్యాటింగ్‌ 0; ఎక్స్‌ట్రాలు 1 మొత్తం: (30 ఓవర్లలో 6 వికెట్లకు) 86;  వికెట్ల పతనం: 1-2, 2-14, 3-14, 4-28,  5-50, 6-85; బౌలింగ్‌: బుమ్రా 7-3-15-3; అశ్విన్‌ 6-1-16-0; షమి 6-1-18-2; జడేజా 6-1-15-0; అక్షర్‌ పటేల్‌ 5-1-21-1

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని