Updated : 14 Mar 2022 09:06 IST

PinkBall Test: భారత్‌ చేతుల్లో..

 గులాబి టెస్టులో ఆధిపత్యం

విజృంభించిన బుమ్రా

మెరిసిన శ్రేయస్‌, పంత్‌

 లంక లక్ష్యం 447.. ప్రస్తుతం 28/1

బెంగళూరులో టీమ్‌ఇండియా పట్టు బిగించేసింది. గులాబి టెస్టు రోహిత్‌ సేన సొంతమైనట్లే! అద్భుతం జరిగితే తప్ప మూడో రోజే మ్యాచ్‌ ముగియడంఖాయం. బుమ్రా పదునైన పేస్‌తో తొలి ఇన్నింగ్స్‌లో లంకను 109కే కుప్పకూల్చిన భారత్‌.. శ్రేయస్‌, పంత్‌ రెండో ఇన్నింగ్స్‌లోనూ అదరగొట్టడంతో ప్రత్యర్థికి కొండంత లక్ష్యాన్ని నిర్దేశించింది. ఇంకా మూడు రోజుల ఆట మిగిలి ఉన్న మ్యాచ్‌లో.. లంక మూడో రోజు పూర్తిగా ఆడటం కూడా కష్టమే. ఇప్పటికే ఆ జట్టు పతనం మొదలైంది.

బెంగళూరు:తిరుగులేని ఆధిపత్యాన్ని కొనసాగించిన భారత్‌.. రెండో టెస్టులో ఘనవిజయం దిశగా సాగుతోంది. ఆదివారం శ్రేయస్‌ అయ్యర్‌ (67; 87 బంతుల్లో 9×4), పంత్‌ (50;  31 బంతుల్లో 7×4, 2×6), రోహిత్‌ (46; 79 బంతుల్లో 4×4) మెరవడంతో టీమ్‌ఇండియా 303/9 వద్ద రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది. తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యాన్ని కలుపుకొని శ్రీలంకకు 447 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఛేదనలో లంక 28/1తో నిలిచింది. తొలి ఓవర్‌ మూడో బంతికే బుమ్రా.. తిరిమానె (0)ను వికెట్ల ముందు బలిగొన్నాడు. కరుణరత్నె (10), కుశాల్‌ మెండిస్‌ (16) క్రీజులో ఉన్నారు. ఆదివారం మధ్యాహ్నం 86/6తో తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన లంక.. 109 పరుగులకు కుప్పకూలింది. బుమ్రా (5/24) అయిదు వికెట్ల ఘనత సాధించాడు.

మళ్లీ వాళ్ల ధనాధనే..: తొలి ఇన్నింగ్స్‌లో 143 పరుగుల భారీ ఆధిక్యం సంపాదించిన టీమ్‌ఇండియా రెట్టించిన ఉత్సాహంతో రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించగా.. శ్రేయస్‌ అయ్యర్‌, రిషబ్‌ పంత్‌ మరోసారి అదరగొట్టారు. జట్టును తిరుగులేని స్థితిలో నిలిపారు. పంత్‌ కేవలం 28 బంతుల్లో అర్ధశతకం సాధించగా.. ఇన్నింగ్స్‌కు శ్రేయస్‌ వెన్నెముకలా నిలిచాడు. రోహిత్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను ఆరంభించిన మయాంక్‌ (22) చకచకా అయిదు బౌండరీలు కొట్టినా.. ఆరంభాన్ని ఉపయోగించుకోలేకపోయాడు. ఎంబుల్దేనియా బౌలింగ్‌లో తొలి వికెట్‌గా నిష్క్రమించాడు. అప్పటికి భారత్‌ స్కోరు 42. కాస్త సమయం తీసుకున్నా.. రోహిత్‌ తనవైన షాట్లతో అలరించాడు. ఎక్కువగా ఫ్రంట్‌ ఫుట్‌పైనే ఆడిన అతడు.. స్పిన్నర్లను ఎంతో విశ్వాసంతో స్వీప్‌, రివర్స్‌స్వీప్‌ చేశాడు. లంచ్‌ విరామానికి విహారి (35; 79 బంతుల్లో 4×4)తో కలిసి అజేయంగా నిలిచిన అతడు.. ఆ తర్వాత ధనంజయ బౌలింగ్‌లో ముందుకొచ్చి భారీ షాట్‌ ఆడబోయి లాంగాన్‌లో మాథ్యూస్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. అప్పటికి జట్టు స్కోరు 98. విహారి మరోసారి మంచి ఆరంభాన్ని ఉపయోగించుకోలేకపోయాడు. కాసేపు కోహ్లి (13)తో కలిసి ఇన్నింగ్స్‌ను నడిపించిన అతడు.. జయవిక్రమ బంతిని స్వీప్‌ చేయబోయి బౌల్డయ్యాడు. కాసేపటికే జయవిక్రమ బంతిని మిడ్‌వికెట్లో ఆడబోయిన కోహ్లి వికెట్ల ముందు దొరికిపోవడంతో భారత్‌ 139/4తో నిలిచింది. అయితే అప్పటికే మంచి ఆధిక్యంతో ఉండడంతో భారత్‌కు ఆందోళన చెందాల్సిన అవసరం లేకపోయింది. అప్పటికే పంత్‌ దంచుడు మొదలెట్టాడు. టీ20 తరహాలో చెలరేగాడు. జయవిక్రమ బౌలింగ్‌లో భారీ సిక్స్‌ బాదిన అతడు.. ధనంజయ ఓవర్లో వరుసగా 4, 6 కొట్టాడు. కోహ్లి ఔటైనా అతడి జోరు ఏమాత్రం తగ్గలేదు. మరోవైపు శ్రేయస్‌ స్ట్రైక్‌ రొటేట్‌ చేస్తుండగా.. పంత్‌ ఎడాపెడా ఫోర్లతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ఆ ఊపులో ఎక్స్‌ట్రా కవర్లోఓ బౌండరీతో అర్ధసెంచరీని అందుకున్నాడు. కానీ అదే స్కోరు వద్ద జయవిక్రమకు రిటర్న్‌ క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. కానీ శ్రీలంకకు ఎలాంటి ఉపశమనం లేదు. కారణం శ్రేయస్‌ అయ్యర్‌.

అదే జోరు: తొలి ఇన్నింగ్స్‌లో 92 పరుగులతో భారత్‌కు మంచి స్కోరు సాధించి పెట్టిన శ్రేయస్‌ అయ్యర్‌ మరోసారి అదరగొట్టాడు. సాధికార బ్యాటింగ్‌తో జట్టును తిరుగులేని స్థితిలోకి తీసుకెళ్లాడు. ముచ్చటైన షాట్లతో అలరించిన శ్రేయస్‌.. విశ్వ ఫెర్నాండో బంతిని కవర్స్‌లో బౌండరీకి పంపి అర్ధసెంచరీ (69 బంతుల్లో) పూర్తి చేసుకున్నాడు. జడేజా (22)తో ఆరో వికెట్‌కు 63 పరుగులు జోడించిన అతడు.. అశ్విన్‌ (13)తో ఏడో వికెట్‌కు 31 పరుగులు జోడించాడు. చివరికి శ్రేయస్‌ ఎనిమిదో వికెట్‌గా నిష్క్రమించాడు. అక్షర్‌ పటేల్‌ (9) ఔటవగానే రోహిత్‌ ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేశాడు. షమి (16 నాటౌట్‌; 8 బంతుల్లో 2×4, 1×6) అజేయంగా నిలిచాడు.

బుమ్రా తొలిసారి..: శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో భారత పేసర్‌ బుమ్రా బౌలింగే హైలైట్‌. పదునైన పేస్‌తో లంకను బెంబేలెత్తించిన అతడు.. స్వదేశంలో టెస్టుల్లో మొదటిసారి అయిదు వికెట్ల ఘనత సాధించాడు. ఓవర్‌నైట్‌ స్కోరు 86/6తో ఆదివారం ఇన్నింగ్స్‌ను కొనసాగించిన శ్రీలంకను చుట్టేయడానికి భారత్‌కు ఎంతో సమయం పట్టలేదు. విజృంభించిన బుమ్రా, అశ్విన్‌ అరగంటలోపే లంక కథను ముగించారు. రెండో రోజు టీమ్‌ ఇండియా వికెట్ల వేటను బుమ్రా ఆరంభించాడు. బుమ్రా భారత బౌలింగ్‌ దాడిని ఆరంభించగా.. ఓవర్‌నైట్‌ బ్యాట్స్‌మన్‌ డిక్వెలా (21) వరుసగా రెండు ఫోర్లతో అతడికి స్వాగతం పలికాడు. కానీ బుమ్రా తన తర్వాతి ఓవర్లో ఓ షార్ట్‌ బాల్‌తో ఎంబుల్దేనియా (1)ను బోల్తా కొట్టించాడు. పుల్‌ షాట్‌కు యత్నించిన బ్యాట్స్‌మన్‌.. టాప్‌ ఎడ్జ్‌తో పంత్‌కు చిక్కాడు. బుమ్రా తన తర్వాతి ఓవర్లో మరో షార్ట్‌ బాల్‌తో డిక్వెలాను వెనక్కి పంపి అయిదు వికెట్ల ఘనత పూర్తి చేసుకున్నాడు. డిక్వెలా కూడా పంత్‌కే చిక్కాడు. అంతకుముందు ఓవర్లో క్యారమ్‌ బాల్‌తో లక్మల్‌ (5)ను అశ్విన్‌ బౌల్డ్‌ చేశాడు. అశ్విన్‌ తన తర్వాతి ఓవర్లోనే మరో క్యారమ్‌ బంతితో ఫెర్నాండో (8)ను ఔట్‌ బోల్తా కొట్టించాడు. అతడు స్టంపౌట్‌ కావడంతో లంక ఇన్నింగ్స్‌ ముగిసింది.


పంత్‌ ధాటికి 40 ఏళ్ల రికార్డు బద్దలు

దొరికిన బంతిని దొరికినట్లు బాది.. టెస్టుల్లో టీ20 ఆట చూపించిన పంత్‌ దెబ్బకు 40 ఏళ్ల రికార్డు బద్దలైంది. టెస్టుల్లో అత్యంత వేగంగా అర్ధశతకం అందుకున్న భారత ఆటగాడిగా పంత్‌ చరిత్ర సృష్టించాడు. శ్రీలంకతో డేనైట్‌ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో 28 బంతుల్లోనే 50 పరుగులు చేసిన అతను.. దిగ్గజ ఆటగాడు కపిల్‌ దేవ్‌ (1982లో పాకిస్థాన్‌పై 30 బంతుల్లో అర్ధశతకం) రికార్డును తిరగరాశాడు. అంతే కాకుండా టెస్టుల్లో అతి తక్కువ బంతుల్లో అర్ధసెంచరీ చేసిన వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌గా పంత్‌ ప్రపంచ రికార్డు నమోదు చేశాడు. గత రికార్డు మాజీ కెప్టెన్‌ ధోని, ఇయాన్‌ స్మిత్‌ (చెరో 34 బంతుల్లో) పేర్ల మీద ఉమ్మడిగా ఉంది.
 


భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 252

శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌: మెండిస్‌ (సి) శ్రేయస్‌ (బి) బుమ్రా 2; కరుణరత్నె (బి) షమి 4; తిరిమానె (సి) శ్రేయస్‌ (బి) బుమ్రా 8; మాథ్యూస్‌ (సి) రోహిత్‌ (బి) బుమ్రా 43; ధనంజయ డిసిల్వా ఎల్బీ (బి) షమి 10; అసలంక (సి) అశ్విన్‌ (బి) అక్షర్‌ 5; డిక్వెలా (సి) పంత్‌ (బి) బుమ్రా 21; ఎంబుల్దేనియా (సి) పంత్‌ (బి) బుమ్రా 1; లక్మల్‌ (బి) అశ్విన్‌ 5; జయవిక్రమ నాటౌట్‌ 1; ఫెర్నాండో (స్టంప్డ్‌) పంత్‌ (బి) అశ్విన్‌ 8; ఎక్స్‌ట్రాలు 1 మొత్తం: (35.5 ఓవర్లలో ఆలౌట్‌) 109; వికెట్ల పతనం: 1-2, 2-14, 3-14, 4-28, 5-50, 6-85, 7-95, 8-100, 9-100; బౌలింగ్‌: బుమ్రా 10-4-24-5; అశ్విన్‌ 8.5-1-30-2; షమి 6-1-18-2; జడేజా 6-1-15-0; అక్షర్‌ పటేల్‌ 5-1-21-1

భారత్‌ రెండో ఇన్నింగ్స్‌: మయాంక్‌ (సి) ధనంజయ (బి) ఎంబుల్దేనియా 22; రోహిత్‌ (సి) మాథ్యూస్‌ (బి) ధనంజయ 46; విహారి (బి) జయవిక్రమ 35; కోహ్లి ఎల్బీ (బి) జయవిక్రమ 13; పంత్‌ (సి) అండ్‌ (బి) జయవిక్రమ 50; శ్రేయస్‌ అయ్యర్‌ ఎల్బీ (బి) ఎంబుల్దేనియా 67; జడేజా (బి) ఫెర్నాండో 22; అశ్విన్‌ (సి) డిక్వెలా (బి) జయవిక్రమ 13; అక్షర్‌ పటేల్‌ (బి) ఎంబుల్దేనియా 9; షమి నాటౌట్‌ 16; ఎక్స్‌ట్రాలు 10 మొత్తం: (68.5 ఓవర్లలో) 303/9 డిక్లేర్డ్‌; వికెట్ల పతనం: 1-42, 2-98, 3-116, 4-139, 5-184, 6-247, 7-278, 8-278,   9-303; బౌలింగ్‌: లక్మల్‌ 10-2-34-0; ఎంబుల్దేనియా  20.5-1-87-3; ఫెర్నాండో 10-2-48-1; ధనంజయ డిసిల్వా 9-0-47-1; జయవిక్రమ 19-2-78-4
శ్రీలంక రెండో ఇన్నింగ్స్‌: తిరిమానె ఎల్బీ (బి) బుమ్రా 0; కరుణరత్నె బ్యాటింగ్‌ 10; కుశాల్‌ మెండిస్‌ బ్యాటింగ్‌ 16; ఎక్స్‌ట్రాలు 2 మొత్తం: (7 ఓవర్లలో) 28/1; వికెట్ల పతనం:1-0; బౌలింగ్‌: బుమ్రా 3-1-9-1; షమి 3-0-13-0; అశ్విన్‌ 1-0-4-0

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts