IPL 2022: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు స్టెయిన్‌ వచ్చేశాడు

ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ బౌలింగ్‌ కోచ్‌గా సరికొత్త పాత్ర పోషించేందుకు దక్షిణాఫ్రికా మాజీ పేసర్‌ డేల్‌ స్టెయిన్‌ వచ్చేశాడు. గురువారం భారత్‌ చేరుకున్న అతను.. ఐపీఎల్‌ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు చెప్పాడు. 

Updated : 18 Mar 2022 06:48 IST

ముంబయి: ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ బౌలింగ్‌ కోచ్‌గా సరికొత్త పాత్ర పోషించేందుకు దక్షిణాఫ్రికా మాజీ పేసర్‌ డేల్‌ స్టెయిన్‌ వచ్చేశాడు. గురువారం భారత్‌ చేరుకున్న అతను.. ఐపీఎల్‌ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు చెప్పాడు. గతేడాది ఆగస్టులో క్రికెట్‌కు వీడ్కోలు పలికిన అతను ఇప్పుడు ప్రధాన కోచ్‌ టామ్‌ మూడీ, బ్యాటింగ్‌ కోచ్‌ లారా, స్పిన్‌ బౌలింగ్‌ కోచ్‌ ముత్తయ్య మురళీధరన్‌తో కలిసి సన్‌రైజర్స్‌ కోసం పనిచేయనున్నాడు. ‘‘భారత్‌కు మళ్లీ వచ్చినందుకు సంతోషంగా ఉంది. ఇక్కడికి వచ్చి చాలా కాలమైంది. ఇప్పుడు ఈ గడ్డపై అడుగుపెట్టడంతో ఉత్తేజం కలుగుతోంది. విమానాశ్రయం నుంచి ఎన్నో జ్ఞాపకాలతో ప్రయాణం మొదలెట్టా. దక్షిణాఫ్రికా జట్టు తరపున లేదా ఐపీఎల్‌ ఆడడం కోసం గతంలో ఇక్కడికి వచ్చా. ఇప్పుడు కోచ్‌గా సరికొత్త పాత్ర కోసం ఉత్సాహంగా ఎదురు చూస్తున్నా. తిరిగి మైదానంలో అడుగు పెట్టేందుకు ఆత్రుతగా ఉన్నా’’ అని స్టెయిన్‌ చెప్పాడు. స్టెయిన్‌ 95 ఐపీఎల్‌ మ్యాచ్‌ల్లో 97 వికెట్లు పడగొట్టాడు. గతేడాది టీ20 ప్రపంచకప్‌లో వ్యాఖ్యాతగానూ అతను పనిచేశాడు. ‘‘జాకెట్‌ ధరించి టై కట్టుకుని వ్యాఖ్యానం చేశా. కానీ టీ షర్ట్స్‌, షార్ట్స్‌ వేసుకుని మైదానంలో ఉండడమే నాకిష్టం. అలాంటి అవతారం ఎత్తబోతున్నందుకు ఆనందంగా ఉంది’’ అని స్టెయిన్‌ పేర్కొన్నాడు. ఈ నెల 29న సన్‌రైజర్స్‌ తన తొలి మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌తో తలపడుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని