IPL 2022: కోల్‌కతా కొత్త కెప్టెన్‌.. కొత్త ఆట?

ఐపీఎల్‌ ఆరంభంలో భారీ అంచనాలతో బరిలోకి దిగి పేలవ ప్రదర్శనతో అభిమానుల నమ్మకం కోల్పోయిన జట్టు కోల్‌కతా నైట్‌రైడర్స్‌. అయితే మధ్యలో గౌతమ్‌ గంభీర్‌ నాయకత్వంలో బలంగా పుంజుకుని ఒకటికి రెండుసార్లు టైటిల్‌ సాధించి తన

Updated : 19 Mar 2022 06:44 IST

ఐపీఎల్‌-15 మరో 7 రోజుల్లో

(Photo: Kolkata Knight Riders Twitter)

ఐపీఎల్‌ ఆరంభంలో భారీ అంచనాలతో బరిలోకి దిగి పేలవ ప్రదర్శనతో అభిమానుల నమ్మకం కోల్పోయిన జట్టు కోల్‌కతా నైట్‌రైడర్స్‌. అయితే మధ్యలో గౌతమ్‌ గంభీర్‌ నాయకత్వంలో బలంగా పుంజుకుని ఒకటికి రెండుసార్లు టైటిల్‌ సాధించి తన ప్రత్యేకతను చాటుకుందా జట్టు. గంభీర్‌ ఫామ్‌ కోల్పోయాక కథ మళ్లీ మామూలే. అతడి స్థానంలో సారథ్యం వహించిన దినేశ్‌ కార్తీక్‌, ఇయాన్‌ మోర్గాన్‌ పెద్దగా ప్రభావం చూపింది లేదు. ఈ సీజన్‌కు జట్టులో కొన్ని కీలక మార్పులు చేసుకుని, కొత్తగా జట్టులోకి వచ్చిన శ్రేయస్‌ అయ్యర్‌కు పగ్గాలప్పగించి 2022 సీజన్‌ కోసం సరికొత్తగా సిద్ధమైంది నైట్‌రైడర్స్‌.

ముంబయి, చెన్నై కాకుండా ఐపీఎల్‌లో ఒకటికి మించి టైటిళ్లు గెలిచిన జట్టు కోల్‌కతా మాత్రమే. ఆ జట్టు 2012, 2014లో ఛాంపియన్‌ అయింది. మూడేళ్ల వ్యవధిలో రెండు టైటిళ్లు గెలిచాక ఆ జట్టుపై అంచనాలు పెరిగిపోయాయి. కానీ నైట్‌రైడర్స్‌కు రెండు టైటిళ్లు అందించిన గౌతమ్‌ గంభీర్‌ ఫామ్‌ కోల్పోగానే.. జట్టు ప్రదర్శనా పడిపోయింది. చివరికి అతను జట్టును వీడాడు. అతడి స్థానంలో బాధ్యతలందుకున్న కార్తీక్‌ కెప్టెన్‌గా తేలిపోయాడు. ఆ తర్వాత మోర్గాన్‌ నాయకత్వ పరంగా ఆకట్టుకున్నా, బ్యాటింగ్‌ వైఫల్యం జట్టుకు చేటు చేసింది. మొత్తంగా జట్టు కూడా గత కొన్ని సీజన్లలో నిలకడ లేమితో ఇబ్బంది పడింది. అయితే ఈసారి రసెల్‌, నరైన్‌, వెంకటేశ్‌ అయ్యర్‌, వరుణ్‌లను అట్టిపెట్టుకుని.. కమిన్స్‌ను తిరిగి జట్టులోకి తీసుకున్న ఆ జట్టు.. శ్రేయస్‌ను ఎంచుకుని పగ్గాలప్పగించింది. మొత్తంగా చూస్తే ఆ జట్టు మరీ గొప్పగా లేదు. అలాగని తీసిపడేసేలానూ లేదు.
బలాలు: దిల్లీ కెప్టెన్‌గా ఆ జట్టు రాత మారడంలో కీలక పాత్ర పోషించిన శ్రేయస్‌ అయ్యరే ఇప్పుడు కోల్‌కతాకు అతి పెద్ద బలం. గాయంతో గత సీజన్‌ ప్రథమార్ధానికి దూరమైన తనకు.. ద్వితీయార్ధంలో తిరిగి కెప్టెన్సీ ఇవ్వకపోవడంతో అలిగి ఆ జట్టును వీడాడు శ్రేయస్‌. ఇప్పుడు టీమ్‌ఇండియా తరఫున అదరగొట్టి తిరుగులేని ఆత్మవిశ్వాసంతో కోల్‌కతా పగ్గాలు చేపడుతున్నాడు. కొన్నేళ్లుగా కోల్‌కతాను ఇబ్బంది పెడుతున్న కెప్టెన్సీ సమస్య శ్రేయస్‌ వల్ల తీరిపోయినట్లే. బ్యాట్స్‌మన్‌గా కూడా అతడిది కీలక పాత్ర. నైట్‌రైడర్స్‌ అట్టి పెట్టుకున్న ఆటగాళ్లు నరైన్‌, రసెల్‌, వెంకటేశ్‌ అయ్యర్‌, వరుణ్‌ చక్రవర్తి జట్టుకు పెద్ద బలం అనడంలో సందేహం లేదు. నరైన్‌, రసెల్‌, వెంకటేశ్‌.. బ్యాటుతో, బంతితో జట్టుకు ఉపయోగపడతారు. స్పిన్నర్‌ వరుణ్‌తో ప్రత్యర్థులకు ముప్పు తప్పదు. నరైన్‌, రసెల్‌లకు తోడు కమిన్స్‌, సౌథీ, బిల్లింగ్స్‌, నబి, ఫించ్‌లతో కోల్‌కతాకు విదేశీ బలం బాగానే ఉంది. ఇంగ్లాండ్‌ ఆటగాడు హేల్స్‌ తప్పుకోవడంతో ఆస్ట్రేలియా కెప్టెన్‌ ఫించ్‌ కోల్‌కతా జట్టులోకొచ్చాడు.

బలహీనతలు: దేశీయ ఆటగాళ్లలో స్టార్ల మీద పెద్దగా దృష్టి పెట్టలేదు నైట్‌రైడర్స్‌. శ్రేయస్‌ కాకుండా ఆ స్థాయి దేశీయ బ్యాట్స్‌మన్‌ ఇంకొకరు లేకపోవడం లోటే. వెంకటేశ్‌ అయ్యర్‌, నితీశ్‌ రాణా, శ్రేయస్‌లతో టాప్‌ ఆర్డర్‌ కాస్త మెరుగ్గానే కనిపిస్తున్నా.. వీరు కాకుండా నమ్మదగ్గ దేశీయ బ్యాట్స్‌మన్‌ లేడు. శుభ్‌మన్‌ దూరమవడం దెబ్బే. షెల్డన్‌ జాక్సన్‌, బాబా ఇంద్రజిత్‌, రింకు సింగ్‌, అనుకుల్‌ రాయ్‌ లాంటి దేశవాళీ ఆటగాళ్లు ఏమేర రాణిస్తారన్నది సందేహమే. రహానె ఫామ్‌ సంగతి తెలిసిందే. దేశీయ పేసర్ల బలం కూడా కోల్‌కతాకు తక్కువే. ప్రసిద్ధ్‌ కృష్ణలా రాణించే బౌలరెవరో చూడాలి. ఉమేశ్‌ యాదవ్‌, శివమ్‌ మావిలపై పెద్దగా అంచనాల్లేవు.


దేశీయ ఆటగాళ్లు: శ్రేయస్‌ అయ్యర్‌ (కెప్టెన్‌), వెంకటేశ్‌ అయ్యర్‌, రహానె, నితీశ్‌ రాణా, వరుణ్‌ చక్రవర్తి, ఉమేశ్‌ యాదవ్‌, శివమ్‌ మావి, రింకు సింగ్‌, అనుకుల్‌ రాయ్‌, అభిజిత్‌ తోమర్‌, రమేశ్‌ కుమార్‌, ప్రథమ్‌ సింగ్‌, షెల్డన్‌ జాక్సన్‌, బాబా ఇంద్రజిత్‌, అమన్‌ ఖాన్‌, రసిక్‌ ధర్‌, అశోక్‌ శర్మ.
విదేశీయులు: రసెల్‌, నరైన్‌, కమిన్స్‌, ఫించ్‌, నబి, సామ్‌ బిల్లింగ్స్‌, చమిక కరుణరత్నె, సౌథీ.
కీలకం: శ్రేయస్‌, రసెల్‌, నరైన్‌, వెంకటేశ్‌ అయ్యర్‌, వరుణ్‌ చక్రవర్తి.
ఉత్తమ ప్రదర్శన: 2012, 2014లో ఛాంపియన్‌

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని