Lakshya Sen: సేన్‌.. మరో సంచలనం

భారత యువ షట్లర్‌ లక్ష్యసేన్‌ సంచలనాల మోత కొనసాగుతోంది. గత వారం జర్మన్‌ ఓపెన్‌లో ప్రపంచ నంబర్‌వన్‌ విక్టర్‌ అక్సెల్సెన్‌కు షాకిచ్చి ఆశ్చర్యపరిచిన అతను.. ఇప్పుడు మరో అద్భుత విజయం సాధించాడు. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ లీ జియాను ఓడించి ప్రతిష్ఠాత్మక ఆల్‌ఇంగ్లాండ్‌ ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్‌కు దూసుకెళ్లాడు

Updated : 20 Mar 2022 06:41 IST

ఆల్‌ఇంగ్లాండ్‌ ఫైనల్లోకి ప్రవేశం
21 ఏళ్ల నిరీక్షణకు తెర
సెమీస్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌కు షాక్‌

బర్మింగ్‌హామ్‌

భారత యువ షట్లర్‌ లక్ష్యసేన్‌ సంచలనాల మోత కొనసాగుతోంది. గత వారం జర్మన్‌ ఓపెన్‌లో ప్రపంచ నంబర్‌వన్‌ విక్టర్‌ అక్సెల్సెన్‌కు షాకిచ్చి ఆశ్చర్యపరిచిన అతను.. ఇప్పుడు మరో అద్భుత విజయం సాధించాడు. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ లీ జియాను ఓడించి ప్రతిష్ఠాత్మక ఆల్‌ఇంగ్లాండ్‌ ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్‌కు దూసుకెళ్లాడు. 2001లో పుల్లెల గోపీచంద్‌ టైటిల్‌ సాధించాక.. ఈ టోర్నీ తుదిపోరులో ఆడబోతున్న భారత పురుష షట్లర్‌ లక్ష్యసేనే కావడం విశేషం.

కొన్ని నెలలుగా అద్భుత విజయాలతో దూసుకెళ్తున్న భారత యువ షట్లర్‌ లక్ష్యసేన్‌.. కెరీర్లోనే అతి పెద్ద టైటిల్‌ ముంగిట నిలిచాడు. బ్యాడ్మింటన్‌లో అత్యంత పురాతనమైన, షట్లర్లు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే ఆల్‌ఇంగ్లాండ్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో అతను ఫైనల్‌కు చేరుకున్నాడు. శనివారం హోరాహోరీగా సాగిన పురుషుల సింగిల్స్‌ సెమీఫైనల్లో లక్ష్య 21-13, 12-21, 21-19తో ఆరో సీడ్‌, మలేసియా స్టార్‌ లీ జి జియాపై విజయం సాధించాడు. ఆల్‌ఇంగ్లాండ్‌ పురుషుల సింగిల్స్‌లో ఇప్పటిదాకా ముగ్గురు భారత షట్లర్లే ఫైనల్‌ చేరారు. 1980లో ప్రకాశ్‌ పదుకొనే, 2001లో పుల్లెల గోపీచంద్‌ టైటిళ్లు సాధించగా.. 1947లో ప్రకాశ్‌ నాథ్‌ రన్నరప్‌గా నిలిచాడు. మహిళల్లో సైనా మాత్రమే ఆల్‌ఇంగ్లాండ్‌ ఫైనల్‌ ఆడింది. 2015లో ఆమె తుది పోరులో ఓటమి పాలెంౖది.

తొలి గేమ్‌ ముగిసిన తీరు చూస్తే లక్ష్యసేన్‌ సునాయాసంగా ఫైనల్‌ చేరేలాగే  కనిపించింది. గేమ్‌ మధ్య వరకు అతడికి పోటీ ఇచ్చిన జియా.. విరామం తర్వాత లక్ష్య జోరు ముందు నిలవలేకపోయాడు. 13-12 వద్ద వరుసగా ఆరు పాయింట్లు సాధించిన భారత షట్లర్‌.. అలవోకగా గేమ్‌ను సొంతం చేసుకున్నాడు. రెండో గేమ్‌లో పుంజుకున్న జియా.. ఆటను ఏకపక్షంగా మార్చేశాడు. తొలి పాయింట్‌ దగ్గర మాత్రమే లక్ష్యకు ఆధిక్యం ఇచ్చిన జియా.. తర్వాత అవకాశమే ఇవ్వలేదు. 3-2 వద్ద వరుసగా ఆరు పాయింట్లు సాధించిన అతను.. ఒక దశలో 16-5తో తిరుగులేని స్థాయికి చేరుకున్నాడు. అదే ఊపులో గేమ్‌ను గెలుచుకున్నాడు. నిర్ణయాత్మక మూడో గేమ్‌ మాత్రం హోరాహోరీగా సాగింది. విజయాన్ని వదిలిపెట్టకూడదన్న పట్టుదలతో లక్ష్య, జియా పోరాడారు. 11-10తో విరామానికి వెళ్లిన జియా.. ఆ తర్వాత దూకుడు పెంచాడు. 16-12తో మ్యాచ్‌ను ఎగరేసుకుపోయేలా కనిపించాడు. కానీ భారత షట్లర్‌ పట్టు వదల్లేదు. 16-18తో వెనుకబడ్డ స్థితిలో అద్భుత ఆటతీరుతో వరుసగా నాలుగు పాయింట్లు సాధించిన అతను.. ఆధిక్యంలోకి దూసుకెళ్లాడు. జియా పోరాటాన్ని కొనసాగించినా.. చివరికి లక్ష్యదే పైచేయి అయింది. టాప్‌ సీడ్‌ అక్సెల్సెన్‌ (డెన్మార్క్‌), నాలుగో సీడ్‌ టియాన్‌ చెన్‌ (చైనీస్‌ తైపీ) మధ్య రెండో సెమీస్‌ విజేతతో లక్ష్య ఆదివారం ఫైనల్‌ ఆడతాడు.


గాయత్రి జోడీ ఓటమి

సంచలన ప్రదర్శనతో ఆల్‌ఇంగ్లాండ్‌ బాడ్మింటన్‌ సెమీస్‌ చేరిన గాయత్రి గోపీచంద్‌ పుల్లెల-ట్రీసా జాలీ జోడీ.. ఫైనల్లో చోటు కోసం గట్టిగానే పోరాడినా ఫలితం లేకపోయింది. చైనా జోడీ జాంగ్‌ షియాన్‌-జాంగ్‌ యులతో హోరాహోరీగా సాగిన సెమీఫైనల్లో గాయత్రి-ట్రీసా 17-21, 16-21తో పోరాడి ఓడింది. తొలి గేమ్‌లో 11-8తో విరామ సమయానికి ఆధిక్యంలో ఉన్న గాయత్రి జోడీ.. రెండో అర్ధంలో తడబడింది. రెండో గేమ్‌ ఒక దశలో 14-14తో సమమైంది. కానీ చైనా ద్వయం వరుసగా నాలుగు పాయింట్లు సాధించి ఆధిక్యంలోకి వెళ్లింది. పుంజుకునేందుకు గాయత్రి జోడీ గట్టిగా ప్రయత్నించినా గేమ్‌, మ్యాచ్‌ చేజారాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని