All England Badminton: లక్ష్య సేన్‌ కల చెదిరింది

లక్ష్య సేన్‌కు నిరాశ. ఆల్‌ ఇంగ్లాండ్‌ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌ గెలిచిన మూడో భారతీయుడిగా నిలవాలనుకున్న అతడి కల చెదిరింది. సంచలన ప్రదర్శనతో ఫైనల్‌ చేరిన ఈ యువ షట్లర్‌ తుది మెట్టుపై బోల్తా కొట్టాడు.

Updated : 21 Mar 2022 08:21 IST

ఫైనల్లో లక్ష్య ఓటమి

ఆల్‌ ఇంగ్లాండ్‌ బ్యాడ్మింటన్‌ విజేత అక్సెల్సెన్‌
లండన్‌

లక్ష్య సేన్‌కు నిరాశ. ఆల్‌ ఇంగ్లాండ్‌ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌ గెలిచిన మూడో భారతీయుడిగా నిలవాలనుకున్న అతడి కల చెదిరింది. సంచలన ప్రదర్శనతో ఫైనల్‌ చేరిన ఈ యువ షట్లర్‌ తుది మెట్టుపై బోల్తా కొట్టాడు. సంపూర్ణ ఆధిపత్యాన్ని ప్రదర్శించిన ప్రపంచ నంబర్‌వన్‌ అక్సెల్సెన్‌ అలవోకగా టైటిల్‌ను చేజిక్కించుకున్నాడు.

భారత యువ ఆటగాడు లక్ష్య సేన్‌ ఆల్‌ ఇంగ్లాండ్‌ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో రన్నరప్‌ ట్రోఫీతో సరిపెట్టుకున్నాడు. భారీ అంచనాల మధ్య ఫైనల్లో బరిలోకి దిగిన లక్ష్య.. బలమైన ప్రత్యర్థితో పోరులో తేలిపోయాడు. ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో అతడు 10-21, 15-21తో ప్రపంచ నంబర్‌వన్‌, ఒలింపిక్‌ ఛాంపియన్‌ విక్టర్‌ అక్సెల్సెన్‌ (డెన్మార్క్‌) చేతిలో పరాజయం పాలయ్యాడు. సంచలన ప్రదర్శనతో ఫైనల్‌కు దూసుకొచ్చిన లక్ష్య.. ఆఖరి పోరాటంలో ఆ స్థాయి ప్రదర్శన చేయలేకపోయాడు. అనేక తప్పులు చేశాడు. టోర్నీ ఆసాంతం ఆధిపత్యాన్ని ప్రదర్శించిన అక్సెల్సెన్‌ ఒక్క గేమ్‌ కూడా కోల్పోకుండా టైటిల్‌ను చేజిక్కించుకోవడం విశేషం. ఫైనల్లో లక్ష్య సేన్‌ పైనా అదే జోరును కొనసాగించాడు. రెండో గేమ్‌ చివర్లో లక్ష్య కాస్త పుంజుకున్నా.. మ్యాచ్‌ ఆసాంతం అక్సెల్సెన్‌దే ఆధిపత్యం. తొలి గేమ్‌ మొదట్లోనే 0-6తో వెనుకబడి ఒత్తిడికి గురైన లక్ష్య.. ఆ తర్వాత పుంజుకోలేకపోయాడు. విరామానికి 11-2తో ఉన్న అక్సెల్సెన్‌ అదే ఊపులో అలవోకగా తొలి గేమ్‌ను సొంతం చేసుకున్నాడు. రెండో గేమ్‌లో లక్ష్య కాస్త పుంజుకున్నాడు. ఆరంభంలో 4-4తో సమంగా నిలిచాడు. ఓ దశలో 5-8తో ఉన్నాడు. కానీ జోరు కొనసాగిస్తూ అక్సెల్సెన్‌ విరామానికి 11-5తో నిలిచాడు. ఆ తర్వాత 20-12తో ఆధిక్యంలోకి దూసుకెళ్లి ఎనిమిది ఛాంపియన్‌షిప్‌ పాయింట్లపై నిలిచాడు. అతడి విజయం లాంఛనమే అనుకున్న దశలో లక్ష్య కాస్త ప్రతిఘటించాడు. వరుసగా మూడు పాయింట్లు సాధించి ప్రత్యర్థిని కాస్త ఒత్తిడికి గురిచేశాడు. కానీ ఆ పోరాటం ఏమాత్రం సరిపోలేదు. టైటిల్‌ అక్సెల్సెన్‌ సొంతమైంది. అతడు ఆల్‌ ఇంగ్లాండ్‌ టైటిల్‌ గెలవడం ఇది రెండోసారి. జపాన్‌కు చెందిన అకానె యమగూచి మహిళల సింగిల్స్‌ టైటిల్‌ను గెలుచుకుంది. ఫైనల్లో ఆమె 21-15, 21-15తో ఆన్‌ సియంగ్‌ (దక్షిణ కొరియా)ను ఓడించింది. మరోవైపు సంచలన ప్రదర్శనతో మహిళల డబుల్స్‌లో సెమీస్‌ చేరిన గాయత్రి గోపీచంద్‌ పుల్లెల-ట్రీసా జాలీ జోడీ.. ఫైనల్‌ చేరలేకపోయింది. సెమీస్‌లో ఈ జోడీ 17-21, 16-21తో జాంగ్‌ షియాన్‌-జాంగ్‌ యు (చైనా)ల చేతుల్లో ఓడింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని