Updated : 13 May 2022 16:02 IST

ICC Womens World CUP: కొంపముంచిన నోబాల్‌

ప్రపంచకప్‌ నుంచి భారత్‌ ఔట్‌
ఆఖరి బంతికి దక్షిణాఫ్రికా చేతిలో ఓటమి

క్రైస్ట్‌చర్చ్‌

ప్రపంచకప్‌లో భారత్‌ భవిష్యత్తును  నిర్ణయించే పోరు. గెలిస్తే ముందుకు.. ఓడితే ఇంటికి. ఇదీ భారత్‌ పరిస్థితి. 275 పరుగుల లక్ష్య ఛేదనలో ఆఖరి ఓవర్‌. దక్షిణాఫ్రికా విజయానికి 6 బంతుల్లో 7 పరుగులు కావాలి. చేతిలో 4 వికెట్లు ఉన్నాయి. క్రీజులో డుప్రీజ్‌, త్రిష చెట్టి. ఆఫ్‌ స్పిన్నర్‌ దీప్తిశర్మ చేతిలో బంతి. నరాలు తెగే ఉత్కంఠ. మొదటి బంతికి సింగిల్‌. రెండో బంతికి ఒక పరుగు, త్రిష రనౌట్‌. తర్వాతి రెండు బంతుల్లోనూ సింగిల్స్‌. 2 బంతుల్లో   3 పరుగులు కావాలి. ఉత్కంఠ పతాక స్థాయికి చేరుకుంది. అయిదో బంతికి డుప్రీజ్‌ భారీ షాట్‌ ఆడింది. లాంగాన్‌లో హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ క్యాచ్‌ అందుకోగానే మ్యాచ్‌ గెలిచేశామనే ఆనందం అందరిలోనూ. ఒక బంతికి 3 పరుగులు చేయాల్సిన దక్షిణాఫ్రికాకు కష్టమే అన్న అంచనా. డుప్రీజ్‌ నిరాశగా పెవిలియన్‌ వైపు నడుస్తోంది. అంతలోనే పిడుగు లాంటి నిర్ణయం! అంపైర్‌ ఆ బంతిని నోబాల్‌గా ప్రకటించడంతో షాక్‌! తర్వాతి రెండు బంతులకు రెండు పరుగులు చేసిన దక్షిణాఫ్రికా.. ప్రపంచకప్‌లో భారత్‌ కథ ముగించి వెస్టిండీస్‌ను సెమీస్‌కు తీసుకెళ్లింది.

సీసీ మహిళల ప్రపంచకప్‌లో భారత జట్టు పోరాటం ముగిసింది. సెమీస్‌ చేరాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో మిథాలీ రాజ్‌ సేనకు చుక్కెదురైంది. ఆదివారం నరాలు తెగే ఉత్కంఠభరిత పోరులో దక్షిణాఫ్రికా 3 వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించింది. ఆఖరి బంతికి ఫలితం తేలిన ఈ మ్యాచ్‌లో భారత అమ్మాయిలు అసమానంగా పోరాడినా ఫలితం దక్కలేదు. మొదట బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 50 ఓవర్లలో   7 వికెట్లకు 274 పరుగుల భారీస్కోరు సాధించింది. స్మృతి మంధాన (71; 84 బంతుల్లో 6×4, 1×6), షెఫాలీవర్మ (53; 46 బంతుల్లో 8×4), మిథాలీ (68; 84 బంతుల్లో 8×4), హర్మన్‌ప్రీత్‌ (48; 57 బంతుల్లో 4×4) అద్భుతంగా రాణించారు. అనంతరం దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి విజయాన్నందుకుంది. లారా వోల్వార్ట్‌ (80; 79 బంతుల్లో 11×4), లారా గుడ్‌ఆల్‌ (49; 69 బంతుల్లో 4×4), ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ డుప్రీజ్‌ (52 నాటౌట్‌; 63 బంతుల్లో 2×4) సత్తాచాటారు. స్పిన్నర్లు రాజేశ్వరి గైక్వాడ్‌ (2/61), హర్మన్‌ప్రీత్‌ (2/42) రాణించినా.. మిగతా బౌలర్లు వికెట్లు పడగొట్టలేకపోవడం భారత్‌ను దెబ్బతీసింది. ఏడు మ్యాచ్‌ల్లో మూడింట్లో నెగ్గి.. నాల్గింట్లో ఓడిన భారత్‌ మొత్తం 6 పాయింట్లతో టోర్నీ నుంచి నిష్క్రమించింది. పట్టికలో తొలి 4 స్థానాల్లో నిలిచిన ఆస్ట్రేలియా (14 పాయింట్లు), దక్షిణాఫ్రికా (11), ఇంగ్లాండ్‌ (8), వెస్టిండీస్‌ (7) సెమీస్‌ చేరుకున్నాయి. నాకౌట్‌ విండీస్‌తో ఆసీస్‌, దక్షిణాఫ్రికాతో ఇంగ్లాండ్‌ తలపడనున్నాయి.

ఆఖర్లో తడబడి..: ఫ్లాట్‌ వికెట్‌పై టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్‌కు ఓపెనర్లు స్మృతి, షెఫాలీ శుభారంభాన్ని అందించారు. స్మృతి నిదానంగా ఆడగా.. ఫెషాలీ దూకుడుగా ఆడుతూ సఫారీ బౌలర్ల పనిపట్టింది. 40 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తిచేసుకుంది. అయితే స్మృతితో సమన్వయ లోపంతో షెఫాలీ రనౌటైంది. లేని పరుగు కోసం స్మృతి ప్రయత్నించగా.. తొలుత నిరాకరించిన ఫెషాలీ తర్వాత ముందుకెళ్లి బలయ్యింది. వీరిద్దరు తొలి వికెట్‌కు 91 పరుగులు జోడించారు. ఆ వెంటనే యాస్తిక భాటియా (2)ను ట్రయాన్‌ ఔట్‌ చేసింది. అక్కడ్నుంచి స్మృతి, మిథాలీ భారత ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లారు. బాధ్యతాయుతంగా ఆడుతూ పరుగులు రాబట్టారు. అర్ధ సెంచరీ తర్వాత గేరు మార్చిన స్మృతికి క్లాస్‌ (2/38) కళ్లెం వేసింది. స్మృతి, మిథాలీ మూడో వికెట్‌కు 80 పరుగులు జోడించారు. అనంతరం మిథాలీకి హర్మన్‌ప్రీత్‌ జతకలిసింది. హర్మన్‌ ధాటిగా పరుగులు రాబట్టింది. ట్రయాన్‌ బౌలింగ్‌లో సింగిల్‌తో మిథాలీ వన్డేల్లో 64వ అర్ధ సెంచరీ పూర్తిచేసుకుంది. ప్రపంచకప్‌లో 13 అర్ధ సెంచరీలు సాధించిన తొలి క్రికెటర్‌గా రికార్డు సృష్టించింది. వేగంగా పరుగులు రాబట్టే క్రమంలో భారీషాట్‌కు ప్రయత్నించిన మిథాలీ క్యాచౌట్‌ అయింది. మిథాలీ, హర్మన్‌ నాలుగో వికెట్‌కు 58 పరుగులు జతచేశారు. అప్పుడు జట్టు స్కోరు 42.3 ఓవర్లలో 234/4. ఆ సమయంలో 300 స్కోరు సాధ్యమే అనిపించింది. అయితే పూజ (3), రిచా (8) విఫలమవడంతో చివరి 7.3 ఓవర్లలో భారత్‌ 40 పరుగులే వచ్చాయి.

భారత్‌ ఇన్నింగ్స్‌: స్మృతి (సి) ట్రయాన్‌ (బి) క్లాస్‌ 71; షెఫాలీ రనౌట్‌ 53; యాస్తిక (బి) ట్రయాన్‌ 2; మిథాలీ (సి) ట్రయాన్‌ (బి) క్లాస్‌ 68; హర్మన్‌ప్రీత్‌ (బి) ఖాకా 48; పూజ (సి) లుజ్‌ (బి) షబ్నిమ్‌ 3; రిచా (సి) లూస్‌ (బి) షబ్నిమ్‌ 8; స్నేహ్‌ నాటౌట్‌ 1; దీప్తిశర్మ నాటౌట్‌ 2; ఎక్స్‌ట్రాలు 18; మొత్తం: (50 ఓవర్లలో 7 వికెట్లకు) 274; వికెట్ల పతనం: 1-91, 2-96, 3-176, 4-234, 5-240, 6-268, 7-271; బౌలింగ్‌: షబ్నిమ్‌ ఇస్మాయిల్‌ 10-1-42-2; మరిజాన్‌ కాప్‌ 9-0-56-0; అయబొంగ ఖాకా 9-0-58-1; ట్రయాన్‌ 10-0-51-1; మసబత క్లాస్‌ 8-0-38-2; లుజ్‌ 4-0-26-0

దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌: లిజెలీ లీ రనౌట్‌ 6; లారా వోల్వార్ట్‌ (బి) హర్మన్‌ప్రీత్‌ 80; లారా గుడ్‌ఆల్‌ (స్టంప్ట్‌) రిచా (బి) రాజేశ్వరి 49; లుజ్‌ (ఎల్బీ) (బి) హర్మన్‌ప్రీత్‌ 22; డుప్రీజ్‌ నాటౌట్‌ 52; కాప్‌ రనౌట్‌ 32; ట్రయాన్‌ (సి) అండ్‌ (బి) రాజేశ్వరి 17; త్రిష చెట్టి రనౌట్‌ 7; షబ్నిమ్‌ నాటౌట్‌ 2; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం: (50 ఓవర్లలో 7 వికెట్లకు) 275; వికెట్ల పతనం: 1-14, 2-139, 3-145, 4-182, 5-229, 6-255, 7-270; బౌలింగ్‌: మేఘన సింగ్‌ 6-0-37-0; దీప్తిశర్మ 10-0-41-0; స్నేహ్‌ రాణా 10-0-54-0; రాజేశ్వరి గైక్వాడ్‌ 10-0-61-2; పూజ వస్త్రాకర్‌ 6-1-37-0; హర్మన్‌ప్రీత్‌ 8-0-42-2


భవిష్యత్తు గురించి ఆలోచించలేదు

తన భవిష్యత్తు గురించి ఆలోచించలేదని భారత జట్టు కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ తెలిపింది. ప్రపంచకప్‌ నుంచి భారత్‌ నిష్క్రమణ బాధిస్తున్న వేళ భవిష్యత్తు గురించి నిర్ణయానికి సరైన సమయం కాదని చెప్పింది. ‘‘మ్యాచ్‌ తర్వాత నా భవిష్యత్తు గురించి ఆలోచించడానికి సమయం దొరకలేదు. ప్రపంచకప్‌లో ఇలాంటి నిరాశపూరిత నిష్క్రమణను అంగీకరించి ముందుకెళ్లడానికి సమయం పడుతుంది. మిగతా క్రీడాకారుల భవిష్యత్తు ఎలా ఉంటుందో కానీ నా గురించి ఆలోచించలేదు. ప్రస్తుత భావోద్వేగ పరిస్థితుల్లో నా భవిష్యత్తుపై వ్యాఖ్యానించడం సరికాదు’’ అని మిథాలీ అంది.

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని