Virat Kohli: వదిలేయ్‌.. బుమ్రా ఏం చేస్తాడు?

జస్‌ప్రీత్‌ బుమ్రా.. ఇప్పుడు టీమ్‌ఇండియాకు మూడు ఫార్మాట్లలోనూ ప్రధాన పేసర్‌. టీ20 టోర్నీలో ముంబయి బౌలింగ్‌ అస్త్రం. వైవిధ్యమైన బౌలింగ్‌తో వికెట్లు కూల్చే అలాంటి పేసర్‌ ఉండాలని...

Updated : 29 Mar 2022 08:25 IST

దిల్లీ: జస్‌ప్రీత్‌ బుమ్రా.. ఇప్పుడు టీమ్‌ఇండియాకు మూడు ఫార్మాట్లలోనూ ప్రధాన పేసర్‌. టీ20 టోర్నీలో ముంబయి బౌలింగ్‌ అస్త్రం. వైవిధ్యమైన బౌలింగ్‌తో వికెట్లు కూల్చే అలాంటి పేసర్‌ ఉండాలని ఏ జట్టయినా కోరుకుంటుంది. కానీ అతని కెరీర్‌ ఆరంభంలో బుమ్రా గురించి చెప్తే కోహ్లి పట్టించుకోలేదని బెంగళూరు మాజీ ఆటగాడు పార్థివ్‌ పటేల్‌ వెల్లడించాడు. ‘‘2014లో నేను బెంగళూరు జట్టులో ఉన్నపుడు బుమ్రా గురించి కోహ్లీకి చెప్పా. అతనిపై ఓ కన్నేయమని సూచించా. కానీ విరాట్‌ మాత్రం.. ‘వదిలేయ్‌.. బుమ్రా- వుమ్రా లాంటి ఆటగాళ్లు ఏం చేస్తారు’ అని బదులిచ్చాడు. మొదట్లో బుమ్రా మూడేళ్ల పాటు రంజీల్లో ఆడాడు. ఆరంభ సీజన్‌ 2013 నుంచి 2015 వరకు రాణించలేదు. దీంతో అతణ్ని సీజన్‌ మధ్యలోనే ఇంటికి పంపిద్దామనే చర్చలు సాగాయి. కానీ బుమ్రా నెమ్మదిగా మెరుగయ్యాడు. ముంబయి అతనికి మద్దతుగా నిలిచింది. సొంత కష్టంతో పాటు ముంబయి మద్దతుతో తనలోని అత్యుత్తమ ప్రదర్శన బయటకు వచ్చింది’’ అని అతను తెలిపాడు. రంజీల్లో బుమ్రా ఆడిన గుజరాత్‌ జట్టుకు పార్థివ్‌ కెప్టెన్‌గా వ్యవహరించాడు. 2013 సీజన్‌లో ముంబయి తరపున అరంగేట్రం చేసిన బుమ్రా.. తన తొలి వికెట్‌గా కోహ్లీనే పెవిలియన్‌ చేర్చడం గమనార్హం. ఆ తర్వాత తన విభిన్న బౌలింగ్‌ శైలితో వికెట్ల వేటలో దూసుకెళ్లిన అతను.. ఇప్పుడు అగ్రశ్రేణి పేసర్‌గా ఎదిగాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని