హైదరాబాద్‌.. ఢమాల్‌

గత సీజన్‌ పీడకలల్ని చెరిపివేస్తూ.. ఈ ఏడాది సరికొత్తగా ఆరంభించాలని, ఆశావహ దృక్పథంతో ముందడుగు వేయాలని అనుకున్న హైదరాబాద్‌కు షాక్‌! తొలి మ్యాచ్‌ ఆ జట్టుకు చేదు అనుభవాన్ని మిగిల్చింది

Updated : 30 Mar 2022 07:16 IST

61 పరుగుల తేడాతో రాజస్థాన్‌ విజయం
తొలి మ్యాచ్‌లో హైదరాబాద్‌ చిత్తు
తేలిపోయిన బౌలింగ్‌.. తుస్సుమన్న బ్యాటింగ్‌

పుణె

గత సీజన్‌ పీడకలల్ని చెరిపివేస్తూ.. ఈ ఏడాది సరికొత్తగా ఆరంభించాలని, ఆశావహ దృక్పథంతో ముందడుగు వేయాలని అనుకున్న హైదరాబాద్‌కు షాక్‌! తొలి మ్యాచ్‌ ఆ జట్టుకు చేదు అనుభవాన్ని మిగిల్చింది. బంతితో, బ్యాటుతో తేలిపోయిన హైదరాబాద్‌.. 61 పరుగుల తేడాతో రాజస్థాన్‌ చేతిలో ఓడి సీజన్‌ను పేలవ రీతిలో ఆరంభించింది. తొలి ఓవర్‌లో భువనేశ్వర్‌ వేసిన నోబాల్‌తో తిరగబడ్డ హైదరాబాద్‌ కథలో.. ఆఖరు వరకు ఎలాంటి మార్పు లేదు.

కొత్త సీజన్‌ను రాజస్థాన్‌ గొప్పగా ఆరంభించింది. బ్యాటింగ్‌లో, బౌలింగ్‌లో రెచ్చిపోయిన ఆ జట్టు.. తొలి మ్యాచ్‌లో 61 పరుగుల తేడాతో హైదరాబాద్‌ను ఓడించింది. మొదట  ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ సంజు శాంసన్‌ (55; 27 బంతుల్లో 3×4, 5×6), దేవ్‌దత్‌ పడిక్కల్‌ (41; 29 బంతుల్లో 4×4, 2×6),  బట్లర్‌ (35; 28 బంతుల్లో 3×4, 3×6), హెట్‌మయర్‌ (32; 13 బంతుల్లో 2×4, 3×6) చెలరేగడంతో రాజస్థాన్‌ 6 వికెట్లకు 210 పరుగుల భారీ స్కోరు సాధించింది. చాహల్‌ (3/22), ప్రసిద్ధ్‌ (2/16), బౌల్ట్‌ (2/23)ల ధాటికి హైదరాబాద్‌ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 149 పరుగులే చేసింది. మార్‌క్రమ్‌ (57 నాటౌట్‌; 41 బంతుల్లో 5×4, 2×6), సుందర్‌ (40; 14 బంతుల్లో 5×4, 2×6) మాత్రమే రాణించారు.
ముందే తేలిపోయింది..:  హైదరాబాద్‌ ఓటమి అధికారికంగా తేలింది 20వ ఓవర్‌ చివరి బంతి పడ్డాకే కానీ.. ఆ జట్టు పరాభవం మాత్రం చాలా ముందే ఖరారైపోయింది. రాజస్థాన్‌ అంత స్కోరు చేసిన నేపథ్యంలో విలియమ్సన్‌ లాంటి నిలకడైన బ్యాట్స్‌మన్‌.. పూరన్‌, మార్‌క్రమ్‌ లాంటి విధ్వంసక ఆటగాళ్లు.. షెఫర్డ్‌, సుందర్‌ లాంటి ఆల్‌రౌండర్లు ఉన్న హైదరాబాద్‌ ఛేదనలో గట్టిగానే పోరాడుతుందని అనుకున్నారు అభిమానులు. కానీ ఆ జట్టు ఛేదన ఘోరంగా ఆరంభమైంది. 37/5.. పదకొండో ఓవర్లో సమద్‌ (4) ఔటయ్యేసరికి హైదరాబాద్‌ స్కోరిది. ఓపెనర్‌ అవతారమెత్తిన విలియమ్సన్‌ (2)తో పాటు రాహుల్‌ త్రిపాఠి (0)ను వరుస ఓవర్లలో ఔట్‌ చేసి హైదరాబాద్‌ను ప్రసిద్ధ్‌ కృష్ణ గట్టి దెబ్బ తీయగా.. పూరన్‌ (0)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకుని ఆ జట్టును మరింత ఇబ్బందుల్లోకి నెట్టాడు బౌల్ట్‌. ఆ తర్వాత చాహల్‌ మాయాజాలం మొదలైంది. అతను క్రీజులో ఆపసోపాలు పడుతున్న అభిషేక్‌ శర్మ (19 బంతుల్లో 9)తో పాటు సమద్‌, షెఫర్డ్‌ (24; 18 బంతుల్లో 2×6)లను పెవిలియన్‌ చేర్చడంతో స్కోరు 78/6కు చేరుకుంది. అయితే జరగాల్సిన నష్టమంతా జరిగాక.. ఆఖరి ఓవర్లలో మార్‌క్రమ్‌, సుందర్‌ చెలరేగిపోయారు. ముఖ్యంగా సుందర్‌ విధ్వంసం సృష్టించాడు. దీంతో అంతరం తగ్గి, కాస్త గౌరవప్రదంగా ఓడింది హైదరాబాద్‌..

ఆ నోబాల్‌తో మొదలై..: ఈ మ్యాచ్‌లో హైదరాబాద్‌ టాస్‌ గెలవడం మినహా సాధించిందేమీ లేదు. అసలు టాస్‌ ఎందుకు గెలిచామా అన్నట్లు తయారైంది కాసేపటికే పరిస్థితి. మ్యాచ్‌ ఆరంభంలో ఆ జట్టును దురదృష్టం నోబాల్‌ రూపంలో వెంటాడింది. ఇన్నింగ్స్‌ అయిదో బంతికే బట్లర్‌ ఖాతా తెరవకుండానే భువనేశ్వర్‌ బౌలింగ్‌లో వికెట్‌ కీపర్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరగడంతో హైదరాబాద్‌.. సంబరాల్లో మునిగిపోయింది. కానీ ఆ బంతి నోబాల్‌ అని తేలడంతో అందరూ ఉస్సూరుమన్నారు. ఈ అవకాశాన్ని బట్లర్‌ ఉపయోగించుకున్నాడు. ఉమ్రాన్‌ మాలిక్‌ వేసిన నాలుగో ఓవర్లో అతను 2 ఫోర్లు, 2 సిక్సర్లు బాదేయడంతో హైదరాబాద్‌ ఒక్కసారిగా ఆత్మరక్షణలో పడింది. ఇక్కడి నుంచి క్రీజులోకి అడుగు పెట్టిన ప్రతి బ్యాటర్‌ బంతిని బాదడమే లక్ష్యంగా పెట్టుకోవడంతో హైదరాబాద్‌ బౌలింగ్‌ పూర్తిగా లయ తప్పింది. బట్లర్‌కు తోడు యశస్వి (20; 16 బంతుల్లో 2×4, 1×6) కూడా ధాటిగా ఆడటంతో రాజస్థాన్‌ పవర్‌ప్లే ముగిసేసరికి 58/0తో తిరుగులేని స్థితిలో నిలిచింది. తర్వాతి ఓవర్లో యశస్వి, కాసేపటికి బట్లర్‌ వెనుదిరిగినా..  హైదరాబాద్‌ పరిస్థితి మెరుగు పడలేదు సరికదా ఇంకా ఇబ్బందికరంగా తయారైంది. సంజు శాంసన్‌ వచ్చీ రాగానే భారీ షాట్లతో విరుచుకుపడగా.. ఆచితూచి ఆడే దేవ్‌దత్‌ పడిక్కల్‌ ఈసారి తనలోని విధ్వంసక కోణాన్ని బయటపెట్టాడు. 15వ ఓవర్‌ చివరి బంతికి పడిక్కల్‌ ఔటయ్యేసరికి స్కోరు 148/3 కావడం విశేషం. సుందర్‌ వేసిన తర్వాతి ఓవర్లో వరుసగా రెండు సిక్సర్లు బాది అర్ధశతకం పూర్తి చేసుకున్న శాంసన్‌ను.. తర్వాతి ఓవర్లో భువనేశ్వర్‌ (1/29) ఔట్‌ చేసినా.. ఉపశమనం లేదు. హెట్‌మయర్‌ చివరి ఓవర్లలో విధ్వంసం సృష్టించి స్కోరును 200 దాటించేశాడు. చివరి ఓవర్లో నటరాజన్‌ 7 పరుగులే ఇచ్చి 2 వికెట్లు తీయబట్టి సరిపోయింది కానీ.. లేదంటే రాజస్థాన్‌  స్కోరు 225 దాటిపోయేదే.

 


ఆ క్యాచ్‌ భలే..

మంగళవారం మ్యాచ్‌లో ఓ క్యాచ్‌ అందరి దృష్టినీ ఆకర్షించింది. రాజస్థాన్‌ పేసర్‌ ప్రసిద్ధ్‌ బౌలింగ్‌లో హైదరాబాద్‌ కెప్టెన్‌ విలియమ్సన్‌ బ్యాట్‌ అంచును తాకిన బంతిని వికెట్‌ కీపర్‌ సంజు శాంసన్‌ కుడి వైపు డైవ్‌ చేస్తూ క్యాచ్‌ అందుకోవడానికి ప్రయత్నించగా.. అది అతడి గ్లోవ్‌ను తాకి ఎగిరి పడింది. ఫస్ట్‌ స్లిప్‌లో ఉన్న దేవ్‌దత్‌ చురుగ్గా స్పందించి, ముందుకు దూకుతూ బంతిని ఒడిసిపట్టేశాడు. రీప్లేలో క్యాచ్‌ కాస్త అనుమానాస్పదంగా అనిపించినప్పటికీ.. థర్డ్‌ అంపైర్‌ ఔట్‌గా ప్రకటించడంతో విలియమ్సన్‌ వెనుదిరగక తప్పలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని