T20 League : ఇటు ఉమేశ్‌.. అటు రసెల్‌

కోల్‌కతా మళ్లీ గాడిన పడింది. గత మ్యాచ్‌లో బెంగళూరు చేతిలో ఓటమి పాలైన ఆ జట్టు.. శుక్రవారం పంజాబ్‌పై సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించింది.

Updated : 02 Apr 2022 07:06 IST

బంతితో, బ్యాటుతో కోల్‌కతా జోరు
పంజాబ్‌పై ఘనవిజయం

కోల్‌కతా మళ్లీ గాడిన పడింది. గత మ్యాచ్‌లో బెంగళూరు చేతిలో ఓటమి పాలైన ఆ జట్టు.. శుక్రవారం పంజాబ్‌పై సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించింది. ఈ సీజన్లో అద్భుత బౌలింగ్‌తో ఆశ్చర్యపరుస్తున్న సీనియర్‌ పేసర్‌ ఉమేశ్‌ యాదవ్‌ బంతితో పంజాబ్‌ పని పడితే.. ఆ తర్వాత ఆండ్రి రసెల్‌ బ్యాటుతో విరుచుకుపడ్డాడు. దీంతో 33 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించి ఘన విజయాన్ని ఖాతాలో వేసుకుంది కోల్‌కతా.

ముంబయి: ‘కోల్‌కతా’ ఆల్‌రౌండ్‌ సత్తా ముందు పంజాబ్‌ నిలవలేకపోయింది. శుక్రవారం వాంఖడెలో ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో కోల్‌కతా 6 వికెట్ల తేడాతో పంజాబ్‌ను చిత్తు చేసింది. మొదట ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ ఉమేశ్‌ యాదవ్‌ (4/23), టిమ్‌ సౌథీ (2/36)ల ధాటికి పంజాబ్‌ 18.2 ఓవర్లలో 137 పరుగులకే ఆలౌటైంది. భానుక రాజపక్స (31; 9 బంతుల్లో 3×4, 3×6) టాప్‌స్కోరర్‌. అనంతరం ఛేదనలో కోల్‌కతా కూడా ఆరంభంలో తడబడ్డప్పటికీ.. ఆండ్రి రసెల్‌ (70 నాటౌట్‌; 31 బంతుల్లో 2×4, 8×6) అసాధారణ రీతిలో చెలరేగి పంజాబ్‌కు అవకాశం లేకుండా చేశాడు. పంజాబ్‌ బౌలర్లలో రాహుల్‌ చాహర్‌ (2/13) ఆకట్టుకున్నాడు.

అతనొచ్చే వరకే..: 51/4.. ఏడు ఓవర్లకు కోల్‌కతా స్కోరిది. అప్పటికే రహానె (12), వెంకటేశ్‌ అయ్యర్‌ (3), శ్రేయస్‌ అయ్యర్‌ (26), నితీశ్‌ రాణా (0) పెవియలిన్‌ చేరిపోయారు. రాహుల్‌ చాహర్‌ ఒకే ఓవర్లో శ్రేయస్‌, నితీశ్‌లను ఔట్‌ చేసి పంజాబ్‌ను పోటీలోకి తెచ్చాడు. మ్యాచ్‌ అప్పటికి కాస్త ఆ జట్టు వైపే మొగ్గింది కూడా. అయితే రసెల్‌ క్రీజులోకి అడుగు పెట్టిన కాసేపటికి కథ మారిపోయింది. ఒక రెండు ఓవర్లు ఆచితూచి ఆడిన అతను.. హర్‌ప్రీత్‌ వేసిన పదో ఓవర్లో తన సిక్సర్ల మోతను మొదలుపెట్టాడు. అతడి బౌలింగ్‌లో రెండుసార్లు బంతిని స్టాండ్స్‌లోకి పంపిన రసెల్‌.. ఇక ఆగనే లేదు. బిల్లింగ్స్‌ (24 నాటౌట్‌; 23 బంతుల్లో 1×4, 1×6) సహకారంతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. వికెట్ల మధ్య పరుగెత్తడానికి అసలు ఇష్టపడని అతను.. బౌండరీల మీదే దృష్టిపెట్టాడు. ఒడియన్‌ స్మిత్‌ వేసిన 12వ ఓవర్లో రసెల్‌ ధాటికి ఏకంగా 30 పరుగులు వచ్చాయి. అతను ఒక ఫోర్‌, మూడు సిక్సర్లు బాదితే.. బిల్లింగ్స్‌ ఓ సిక్సర్‌ అందుకున్నాడు. ఈ ఓవర్‌తో మ్యాచ్‌ గమనమే మారిపోయింది. ఫలితం తేలడానికి ఇంకెంతో సమయం పట్టలేదు.

ఉమేశ్‌ విజృంభణ: బౌలర్ల ఆధిపత్యం సాగుతున్న వాంఖడెలో మొదట టాస్‌ గెలిచి కోల్‌కతా బౌలింగ్‌ ఎంచుకోగా.. ఆ నిర్ణయం సరైందేనని రుజువు చేస్తూ ఆ జట్టు బౌలర్లు చెలరేగిపోయారు. తమ తొలి మ్యాచ్‌లో 200 పైచిలుకు లక్ష్యాన్ని ఛేదించిన పంజాబ్‌.. ఈసారి బ్యాటింగ్‌లో బాగా తడబడింది. వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ భానుక రాజపక్స క్రీజులో ఉన్న కాసేపు మినహాయిస్తే పూర్తిగా కోల్‌కతా బౌలర్లదే ఆధిపత్యం. ముఖ్యంగా ఈ సీజన్లో అద్భుత ప్రదర్శన చేస్తున్న ఉమేశ్‌ యాదవ్‌.. పంజాబ్‌ను మామూలు దెబ్బ కొట్టలేదు. తొలి ఓవర్లోనే కెప్టెన్‌ మయాంక్‌ (1) వికెట్ల ముందు దొరకబుచ్చుకున్న అతను.. ఆ తర్వాత ప్రమాదకర లివింగ్‌స్టోన్‌ (19)ను పెవిలియన్‌ చేర్చాడు. అయితే మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన భానుక రాజపక్స ఉన్నంతసేపూ భారీ షాట్లతో విరుచుకుపడటంతో కాసేపు కోల్‌కతా శిబిరంలో అలజడి నెలకొంది. అతను శివమ్‌ మావి వేసిన ఇన్నింగ్స్‌ 4వ ఓవర్లో వరుసగా 4, 6, 6, 6 బాదాడు. అదే ఊపులో అయిదో బంతికి మరో షాట్‌కు ప్రయత్నించి సౌథీ చేతికి చిక్కడంతో మావి ఊపిరి పీల్చుకున్నాడు. ఈ వికెట్‌ పడటంతో పంజాబ్‌ జోరుకు తెరపడింది. ఆ తర్వాత ఏ దశలోనూ వికెట్ల పతనం ఆగలేదు. పరుగుల కోసం ఆపసోపాలు తప్పలేదు. ధావన్‌ (16), రాజ్‌బవా (11) ఎక్కువసేపు క్రీజులో నిలవలేదు. మధ్య ఓవర్లలో నరైన్‌ (1/23), వరుణ్‌ చక్రవర్తి (0/14) పంజాబ్‌ బ్యాట్స్‌మెన్‌ను కట్టి పడేశారు. రెండో స్పెల్‌ కోసం బౌలింగ్‌కు వచ్చిన సౌథీ.. షారుఖ్‌ (0)ను, ఉమేశ్‌.. హర్‌ప్రీత్‌ (14), రాహుల్‌ చాహర్‌ (0)లను పెవిలియన్‌ చేర్చడంతో 15 ఓవర్లకు పంజాబ్‌ 102/8తో నిలిచింది. ఈ దశలో రబాడ (25; 16 బంతుల్లో 4×4, 1×6) కొన్ని షాట్లు ఆడి పంజాబ్‌కు గౌరవప్రదమైన స్కోరు అందించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని