Rajasthan: రాజస్థాన్‌కు తీపి.. ముంబయికి చేదు

ఈ సీజన్‌లో తొలి శతకంతో బట్లర్‌.. రాజస్థాన్‌కు తీపి అందించగా.. మిడిలార్డర్‌ వైఫల్యం ముంబయికి చేదు మిగిల్చింది. కీలక సమయాల్లో వికెట్లు పడగొట్టి మ్యాచ్‌ను మలుపు తిప్పిన చాహల్‌..

Updated : 03 Apr 2022 06:58 IST

శతకంతో చెలరేగిన బట్లర్‌
తిలక్‌, ఇషాన్‌ పోరాటం వృథా

ఈ సీజన్‌లో తొలి శతకంతో బట్లర్‌.. రాజస్థాన్‌కు తీపి అందించగా.. మిడిలార్డర్‌ వైఫల్యం ముంబయికి చేదు మిగిల్చింది. కీలక సమయాల్లో వికెట్లు పడగొట్టి మ్యాచ్‌ను మలుపు తిప్పిన చాహల్‌.. రోహిత్‌ సేనకు వగరు రుచి చూపాడు. తెలంగాణ కుర్రాడు తిలక్‌వర్మతో పాటు ఇషాన్‌ కిషాన్‌ అర్ధసెంచరీలు జట్టు విజయానికి ఉప్పులా సాయపడతాయనుకుంటే.. చివరకు ఆ జట్టుకు కారం లాంటి ఓటమి మంట తగిలింది. మొత్తానికి ఉగాది రోజు.. ఈ మ్యాచ్‌ అభిమానులకు పరుగుల పండగ తెచ్చింది. రాజస్థాన్‌ వరుసగా రెండో విజయాన్ని అందుకోగా.. ముంబయి రెండో పరాజయాన్ని ఖాతాలో వేసుకుంది.

నవీ ముంబయి

ముంబయికి వరుసగా రెండో షాక్‌. శనివారం ఆ జట్టు 23 పరుగుల తేడాతో రాజస్థాన్‌ చేతిలో ఓడింది. మొదట ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ బట్లర్‌ (100; 68 బంతుల్లో 11×4, 5×6) సెంచరీతో చెలరేగడంతో రాజస్థాన్‌ 20 ఓవర్లకు 8 వికెట్లు కోల్పోయి 193 పరుగులు చేసింది. ముంబయి అంటేనే చెలరేగిపోయే అతను మరోసారి రెచ్చిపోయాడు. శాంసన్‌ (30; 21 బంతుల్లో 1×4, 3×6), హెట్‌మయర్‌ (35; 14 బంతుల్లో 3×4, 3×6) సత్తాచాటారు. ముంబయి బౌలర్లలో బుమ్రా (3/17) గొప్పగా బౌలింగ్‌ చేశాడు. టైమల్‌ మిల్స్‌ (3/35) కూడా రాణించాడు. ఛేదనలో ముంబయి 20 ఓవర్లలో 8 వికెట్లకు 170 పరుగులే చేయగలిగింది. తిలక్‌ వర్మ (61; 33 బంతుల్లో 3×4, 5×6), ఇషాన్‌ కిషాన్‌ (54; 43 బంతుల్లో 5×4, 1×6) పోరాటం వృథా అయింది. చాహల్‌ (2/26), సైని (2/36) ఆకట్టుకున్నారు.

ఆఖర్లో తడబడి..: 121/2.. ఛేదనలో 12.5 ఓవర్లలో ముంబయి స్కోరు ఇది. ఇషాన్‌, తిలక్‌ జోరు చూస్తుంటే ముంబయిదే విజయమనిపించింది. కానీ అద్భుతంగా పుంజుకున్న రాజస్థాన్‌ బౌలర్లు 15 పరుగుల తేడాతో నాలుగు కీలక వికెట్లు పడగొట్టి మ్యాచ్‌ మలుపు తిప్పారు. అంతకుముందు ముంబయికి ఆరంభంలోనే దెబ్బ తగిలింది. రోహిత్‌ (10), అన్మోల్‌ప్రీత్‌ (5) త్వరగానే పెవిలియన్‌ చేరారు. కానీ సూపర్‌ ఫామ్‌ కొనసాగించిన ఇషాన్‌కు తిలక్‌ జత కలవడంతో ఇన్నింగ్స్‌ గాడిన పడింది. ఈ ఇద్దరూ బౌండరీల వేటలో పోటీపడ్డారు. ముఖ్యంగా తిలక్‌ భారీ షాట్లతో చెలరేగాడు. ఈ ఇద్దరు లెఫ్టార్మ్‌ బ్యాటర్ల జోరుతో 12 ఓవర్లకు ఆ జట్టు 112/2తో లక్ష్యం దిశగా సాగింది. తిరిగి బంతి అందుకున్న బౌల్ట్‌ (1/29) అర్ధసెంచరీ పూర్తిచేసుకున్న ఇషాన్‌ను ఔట్‌ చేసి రాజస్థాన్‌ను పోటీలోకి తెచ్చాడు. ఐపీఎల్‌లో తన తొలి అర్ధసెంచరీ అందుకున్న తిలక్‌ అద్భుత ఇన్నింగ్స్‌కు అశ్విన్‌ (1/30) ముగింపు పలకడంతో ముంబయికి గట్టిదెబ్బ పడింది. ఆ తర్వాతి ఓవర్లోనే చాహల్‌ మ్యాచ్‌ను రాజస్థాన్‌ వైపు తిప్పేశాడు. వరుస బంతుల్లో టిమ్‌ డేవిడ్‌ (1), సామ్స్‌ (0)ను ఔట్‌ చేసిన అతనికి హ్యాట్రిక్‌ దక్కేదే. కానీ మురుగన్‌ అశ్విన్‌ (6) క్యాచ్‌ను స్లిప్‌లో కరుణ్‌ నాయర్‌ వదిలేశాడు. అంతకుముందు సామ్స్‌ క్యాచ్‌ను కళ్లుచెదిరే రీతిలో బట్లర్‌ అందుకున్నాడు. చివరి మూడు ఓవర్లలో 50 పరుగులతో ముంబయి విజయ సమీకరణం క్లిష్టంగా మారింది. పొలార్డ్‌ (22) క్రీజులో ఉండడంతో ముంబయి ఆశలు వదులుకోలేదు. పైగా ప్రసిద్ధ్‌ (1/37) బౌలింగ్‌లో సులువైన పొలార్డ్‌ క్యాచ్‌ను యశస్వి పట్టలేకపోయాడు. కానీ చివర్లో కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేసిన రాజస్థాన్‌ బౌలర్లు పొలార్డ్‌కు షాట్లు ఆడే అవకాశం ఇవ్వలేదు.

అతను నిలబడి..: చరిత్రలో రెండో శతకాన్ని అందుకున్న బట్లర్‌ రాజస్థాన్‌ ఇన్నింగ్స్‌కు వెన్నెముకలా నిలిచాడు. కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేసిన బుమ్రా.. యశస్వి (1)ని త్వరగానే వెనక్కిపంపాడు. కానీ ఇన్నింగ్స్‌ నాలుగో ఓవర్లో బంతి అందుకోవడమే థంపి తప్పుగా మారింది. తొలి బంతిని మినహాయించి బట్లర్‌ వరుసగా 4, 6, 6, 4, 6 రాబట్టాడు. ఆఫ్‌స్టంప్‌పై పడ్డ బంతులను బ్యాక్‌ఫుట్‌పై నిలబడి అమాంతం ఎత్తి స్టాండ్స్‌లో పడేశాడు. దేవ్‌దత్‌ (7) ఔటయ్యాక బట్లర్‌కు శాంసన్‌ జత కలిశాడు. అర్ధశతకం చేరుకున్న బట్లర్‌ ఊపు చూసి శాంసన్‌ కూడా సిక్సర్ల దాడి మొదలెట్టాడు. బట్లర్‌ చూస్తుండగానే 80లో అడుగుపెట్టాడు. లెగ్‌సైడ్‌ జరిగి ఆఫ్‌సైడ్‌ బౌండరీలు రాబట్టాడు. 14 ఓవర్లకు ఆ జట్టు స్కోరు 129/2. ఇక విధ్వంసం మరో స్థాయికి చేరుతుందనే సమయంలో పొలార్డ్‌ (1/46) ఓ స్లో డెలివరీతో శాంసన్‌ను బోల్తా కొట్టించాడు. కానీ ఆ వికెట్‌ తీసిన ఆనందం పొలార్డ్‌కు దక్కకుండా.. అతని తర్వాతి ఓవర్లోనే హెట్‌మయర్‌ వరుసగా 6, 6, 4, 4తో చెలరేగాడు. వీళ్ల దూకుడుతో జట్టు 220 పరుగులు చేస్తుందనిపించింది. కానీ చివరి రెండు ఓవర్లలో బుమ్రా, మిల్స్‌ అద్భుత బౌలింగ్‌తో ముంబయి పుంజుకుంది. 10 పరుగుల వ్యవధిలో అయిదు వికెట్లు పడగొట్టి ప్రత్యర్థిని కట్టడి చేసింది. 66 బంతుల్లో శతకం అందుకున్న బట్లర్‌తో పాటు హెట్‌మయర్‌ను బుమ్రా ఔట్‌ చేశాడు. చివరి ఓవర్లో మిల్స్‌ రెండు వికెట్లు పడగొట్టాడు. 


ధనాధన్‌ తిలక్‌

ముంబయితో మ్యాచ్‌లో ఓ వికెట్‌ పడగొట్టినందుకు సీనియర్‌ స్పిన్నర్‌ అశ్విన్‌ గొప్పగా సంబరాలు చేసుకున్నాడు. కానీ అతను తీసింది. రెండో మ్యాచ్‌ మాత్రమే ఆడుతున్న ఓ కుర్రాడి వికెట్‌. ‘‘ఆ ప్రశాంతత.. క్రికెట్‌పై అవగాహన.. షాట్ల ఎంపిక.. ఆత్మవిశ్వాసం.. ఇలా అతని ఆటలో నచ్చే అంశాలెన్నో ఉన్నాయి’’ ఇదీ టీమ్‌ఇండియా మాజీ ఓపెనర్‌ వసీం జాఫర్‌ ఆ కుర్రాడి గురించి చేసిన ట్వీట్‌! ఈ సీజన్‌లోనే అరంగేట్రం చేసి అదరగొడుతున్న ఆ కుర్రాడి పేరు తిలక్‌ వర్మ. 19 ఏళ్ల ఈ హైదరాబాదీ యువ ఆటగాడు అందివచ్చిన అవకాశాన్ని అద్భుతంగా ఉపయోగించుకుంటున్నాడు. తన తొలి మ్యాచ్‌లో దిల్లీపై 22 పరుగులు చేసిన అతను.. ఇప్పుడు రాజస్థాన్‌పై ధనాధన్‌ అర్ధసెంచరీతో చెలరేగాడు. ముఖ్యంగా ఈ ఎడమ చేతి వాటం బ్యాటర్‌ బంతిని కచ్చితంగా అంచనా వేసి కొలిచినట్లు కొట్టిన షాట్లు ఆకట్టుకున్నాయి. సీనియర్‌ స్పిన్నర్లు అశ్విన్‌, చాహల్‌ బౌలింగ్‌లో అతను కొట్టిన సిక్సర్లు చూడాల్సిందే. క్రీజు వదిలి బయటకు వచ్చి బంతిని స్టాండ్స్‌లో పడేయడం.. స్వీప్‌తో బౌండరీ దాటించడం.. ఇలా ప్రతి షాట్‌ కళాత్మకంగా ఆడాడు. ఇక పరాగ్‌ బౌలింగ్‌లో ఫ్రంట్‌ఫుట్‌పై అందమైన షాట్‌తో బంతిని నేరుగా కెమెరామెన్‌ తలకు గురి పెట్టిన సిక్సర్‌ హైలైట్‌గా నిలిచింది. సింగిల్‌తో తన తొలి    అర్ధసెంచరీ అందుకున్న అతను అశ్విన్‌ బౌలింగ్‌లో రివర్స్‌ స్వీప్‌తో కొట్టిన సిక్సర్‌ చూసేందుకు రెండు కళ్లు సరిపోవంటే అతిశయోక్తి కాదు. ఆ తర్వాతి బంతికే స్వీప్‌ ఆడదామని ప్రయత్నించి పెవిలియన్‌ చేరాడు. అయితే అతను ఉన్నంతసేపు జట్టుదే విజయం అనిపించిందనడంలో సందేహం లేదు. అతని వికెట్‌తోనే మ్యాచ్‌ మలుపు తిరిగింది. మరోవైపు ఫీల్డింగ్‌లోనూ అతను ఆకట్టుకున్నాడు. రెండు క్యాచ్‌లు అందుకున్న అతను.. ఓ రనౌట్‌లో భాగమయ్యాడు. తిలక్‌ ఇదే జోరుతో కొనసాగితే టీమ్‌ఇండియాకు ఆడాలనే కలకు చేరువయ్యే అవకాశం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని