ఆసీస్‌ ఏడోసారి

ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌లో  ఆస్ట్రేలియా అదరగొట్టింది. ప్రపంచ క్రికెట్లో మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకుంది. అద్వితీయ ఆటతీరు.. అద్భుత ప్రదర్శనలతో తిరుగులేని ఆసీస్‌ ఏడోసారి ప్రపంచకప్‌ను

Updated : 04 Apr 2022 07:13 IST

కంగారూలదే ట్రోఫీ

ఫైనల్లో ఇంగ్లాండ్‌పై విజయం

ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌

క్రైస్ట్‌చర్చ్‌

ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌లో  ఆస్ట్రేలియా అదరగొట్టింది. ప్రపంచ క్రికెట్లో మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకుంది. అద్వితీయ ఆటతీరు.. అద్భుత ప్రదర్శనలతో తిరుగులేని ఆసీస్‌ ఏడోసారి ప్రపంచకప్‌ను ముద్దాడింది. ఆదివారం ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద టోర్నీ’, ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అలీసా హీలీ (170; 138 బంతుల్లో 26×4) ప్రపంచకప్‌ ఫైనల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు రికార్డుతో చెలరేగిన వేళ.. ఆసీస్‌ 71 పరుగులతో ఇంగ్లాండ్‌పై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన ఆసీస్‌ 50 ఓవర్లలో 5 వికెట్లకు 356  పరుగుల భారీస్కోరు నమోదు చేసింది. హీలీ శతకంతో సత్తా చాటగా.. రాచెల్‌ హేన్స్‌ (68; 93 బంతుల్లో 7×4), బెత్‌ మూనీ (62; 47 బంతుల్లో 8×4) అర్ధసెంచరీలతో మెరిశారు. అనంతరం ఇంగ్లాండ్‌ 43.4 ఓవర్లలో 285 పరుగులకు ఆలౌటైంది. నాట్‌ సీవర్‌ (148 నాటౌట్‌; 121 బంతుల్లో 15×4, 1×6) గొప్పగా పోరాడినా ఫలితం లేకపోయింది. ఈ ప్రపంచకప్‌లో ఆడిన 9 మ్యాచ్‌ల్లోనూ (లీగ్‌ దశలో 7, సెమీస్‌, ఫైనల్‌) నెగ్గిన ఆసీస్‌ అజేయంగా టోర్నీని ముగించింది.
రెచ్చిపోయిన హీలీ, రేచల్‌: ఆదివారం ఉదయం టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకోవడం ఇంగ్లాండ్‌ కొంపముంచింది. సెమీఫైనల్లో వెస్టిండీస్‌పై సెంచరీ, అర్ధ సెంచరీలతో భీకరమైన ఫామ్‌లో ఉన్న ఆసీస్‌ ఓపెనర్లు హీలీ, రేచల్‌ హేన్స్‌ మరోసారి దుమ్ముదులిపారు. తమ ఫామ్‌ను కొనసాగిస్తూ ఇంగ్లాండ్‌ బౌలర్ల పనిపట్టారు. 41 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔటయ్యే ప్రమాదం నుంచి బయటపడిన హీలీ అక్కడ్నుంచి వెనుదిరిగి చూడలేదు. హేన్స్‌తో కలిసి తొలి వికెట్‌కు 160 పరుగులు జోడించిన హీలీ.. వన్డేల్లో అయిదో సెంచరీ సాధించింది. అనంతరం బెత్‌ మూనీతో కలిసి రెండో వికెట్‌కు 156 పరుగులు జతచేసి మహిళల ప్రపంచకప్‌ ఫైనల్లో జట్టుకు అత్యధిక స్కోరు అందించింది. 357 పరుగుల లక్ష్యం ముందు మరే జట్టైనా తేలిపోయేదే! కాని సివర్‌ అద్వితీయమైన ఇన్నింగ్స్‌తో మ్యాచ్‌ ఆసక్తికరంగా సాగింది. 38/2తో ఇంగ్లాండ్‌ కష్టాల్లో ఉన్న సమయంలో క్రీజులో అడుగుపెట్టిన సీవర్‌ ఆకాశమే హద్దుగా చెలరేగింది. సహచరుల నుంచి సరైన మద్దతు లభించకపోయినా 90 బంతుల్లోనే సెంచరీ సాధించింది. సీవర్‌, చార్లీ డీన్‌ (21) క్రీజులో ఉన్నపుడు మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌కు కాస్త అవకాశాలున్నట్లే అనిపించింది. అయితే చార్లీని గార్డ్‌నర్‌ (1/15).. ష్రబ్‌సోల్‌ (1)ను జెస్‌ జొనాసెన్‌ (3/57) ఔట్‌ చేయడంతో ఇంగ్లాండ్‌ ఇన్నింగ్స్‌కు తెరపడింది.
సంక్షిప్త స్కోర్లు: ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌: 356/5 (అలీసా హీలీ 170, రేచల్‌ హేన్స్‌ 68, బెత్‌ మూనీ 62, ష్రబ్‌సోల్‌ 3/46, సోఫీ ఎకెల్‌స్టోన్‌ 1/71), ఇంగ్లాండ్‌ ఇన్నింగ్స్‌: 285 (సీవర్‌ 148 నాటౌట్‌, మెగాన్‌ షట్‌ 2/42, అలానా కింగ్‌ 3/64, తాలియా మెక్‌గ్రాత్‌ 1/46, జొనాసెన్‌ 3/57, గార్డ్‌నర్‌ 1/15)


* ఆసీస్‌ చేసిన 356 పరుగులు మహిళల ప్రపంచకప్‌ ఫైనల్లో అత్యధిక స్కోరు. పురుషులతో కలిపితే రెండో అత్యధిక స్కోరు. 2003 పురుషుల ప్రపంచకప్‌ ఫైనల్లో భారత్‌పై ఆసీస్‌ సాధించిన 359 పరుగులే ఇప్పటికీ అత్యధిక స్కోరు.

* పురుషులు, మహిళల వన్డే ప్రపంచకప్‌ల్లో కలిపి ఫైనల్లో అలీసా హీలీ (170) ఇన్నింగ్సే అత్యధిక వ్యక్తిగత స్కోరు. ఆడమ్‌ గిల్‌క్రిస్ట్‌      (149- 2007), నాట్‌ సీవర్‌     (148- 2022), రికీ పాంటింగ్‌ (140- 2003), వివ్‌ రిచర్డ్స్‌ (138- 1979) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

* మహిళల ప్రపంచకప్‌లలో ఏడుసార్లు ఫైనల్స్‌ చేరుకున్న  ఆసీస్‌ విజేతగా నిలవడమిది    ఆరోసారి (1982, 1988, 1997, 2005, 2013, 2022). 1978లో పాయింట్ల ఆధారంగా ఆ జట్టు టైటిల్‌ గెలిచింది.

* వన్డేల్లో అత్యధికంగా 26 వరుస విజయాలతో ఆసీస్‌ మహిళల జట్టు సరికొత్త రికార్డు నెలకొల్పింది. గతంలో రికీ పాయింట్‌ సారథ్యంలోని ఆసీస్‌ వరుసగా 21 మ్యాచ్‌ల్లో గెలిచింది.

* భార్యాభర్తలుగా మిచెల్‌ స్టార్క్‌, అలీసా హీలీ అరుదైన ఘనత సాధించారు. 2015 ప్రపంచకప్‌లో స్టార్క్‌, 2022 ప్రపంచకప్‌లో హీలీ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ అవార్డులు సొంతం చేసుకున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని