Lucknow vs Delhi: లఖ్‌నవూ.. హ్యాట్రిక్‌

52/0.. తొలి ఆరు ఓవర్లకు దిల్లీ స్కోరిది. పృథ్వీ షా దూకుడు మీదున్నాడు.. మరో ఎండ్‌లో వార్నర్‌ ఉన్నాడు.. బ్యాటింగ్‌ లోతు చాలా ఉంది.. ఆ జట్టు భారీ స్కోరు చేయడం ఖాయమనిపించింది. కానీ చివరకు చూస్తే 149/3. టెస్టుల్లోనే టీ20 ఆట ఆడే పంత్‌.. పొట్టి ఫార్మాట్లో టెస్టు బ్యాటింగ్‌ చేసిన వేళ.. వికెట్లు

Updated : 08 Apr 2022 10:03 IST

దిల్లీపై విజయం
మెరిసిన డికాక్‌
పృథ్వీ అర్ధసెంచరీ వృథా

52/0.. తొలి ఆరు ఓవర్లకు దిల్లీ స్కోరిది. పృథ్వీ షా దూకుడు మీదున్నాడు.. మరో ఎండ్‌లో వార్నర్‌ ఉన్నాడు.. బ్యాటింగ్‌ లోతు చాలా ఉంది.. ఆ జట్టు భారీ స్కోరు చేయడం ఖాయమనిపించింది. కానీ చివరకు చూస్తే 149/3. టెస్టుల్లోనే టీ20 ఆట ఆడే పంత్‌.. పొట్టి ఫార్మాట్లో టెస్టు బ్యాటింగ్‌ చేసిన వేళ.. వికెట్లు చేతిలో ఉన్నా ఆ జట్టు తడబడింది. ప్రత్యర్థి బౌలర్ల ధాటికి పరుగుల వేటలో వెనకబడింది. ఆనక డికాక్‌ ఇన్నింగ్స్‌కు ఇరుసులా మారడంతో చివరి ఓవర్లో లక్ష్యాన్ని ఛేదించిన లఖ్‌నవూ హ్యాట్రిక్‌ విజయాన్ని ఖాతాలో వేసుకుంది. దిల్లీకిది వరుసగా రెండో ఓటమి.

నవీ ముంబయి: సీజన్‌ను ఓటమితో మొదలెట్టిన లఖ్‌నవూ వరుసగా మూడో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. గురువారం దిల్లీపై ఆ జట్టు 6 వికెట్ల తేడాతో గెలిచింది. మొదట దిల్లీ 20 ఓవర్లలో 3 వికెట్లకు 149 పరుగులు చేసింది. ఓపెనర్‌ పృథ్వీ షా (61; 34 బంతుల్లో 9×4, 2×6) ధనాధన్‌ అర్ధశతకంతో చెలరేగాడు. కెప్టెన్‌ పంత్‌ (39 నాటౌట్‌, 36 బంతుల్లో 3×4, 2×6), సర్ఫరాజ్‌ ఖాన్‌ (36 నాటౌట్‌; 28 బంతుల్లో 3×4) క్రీజులో ఉన్నా వేగంగా ఆడలేకపోయారు. ప్రత్యర్థి బౌలర్లు అద్భుతంగా పుంజుకుని దిల్లీని దెబ్బకొట్టారు. స్పిన్నర్లు రవి బిష్ణోయ్‌ (2/22), కృష్ణప్ప గౌతమ్‌ (1/23) గొప్పగా బౌలింగ్‌ చేశారు. లఖ్‌నవూ 4 వికెట్లు కోల్పోయి మరో రెండు బంతులు మిగిలి ఉండగా లక్ష్యాన్ని అందుకుంది. డికాక్‌ (80; 52 బంతుల్లో 9×4, 2×6) ఇన్నింగ్స్‌కు వెన్నెముకలా నిలిచాడు. కుల్‌దీప్‌ (2/31), లలిత్‌ (1/21) ఆకట్టుకున్నారు.

డికాక్‌ నిలబడి..: ఛేదనలో లఖ్‌నవూకు బలమైన పునాది పడింది. ఓపెనర్లు డికాక్‌, రాహుల్‌ (24) తొలి వికెట్‌కు 73 పరుగులు జోడించారు. ప్రధాన స్పిన్నర్లు కుల్‌దీప్‌, అక్షర్‌ (0/11)ను కాదని డికాక్‌కు గాలం వేసేందుకు లలిత్‌కు ఇన్నింగ్స్‌ రెండో ఓవర్లోనే పంత్‌ బంతినిచ్చాడు. కానీ డికాక్‌ బౌండరీల వేటలో ఆగలేదు. ఈ సీజన్‌లో తొలి మ్యాచ్‌ ఆడుతున్న దిల్లీ స్టార్‌ పేసర్‌ నార్జ్‌ (0/35)కు అతను హ్యాట్రిక్‌ ఫోర్లతో స్వాగతం పలికాడు. అదే ఓవర్లో ఓ సిక్సరూ బాదాడు. కచ్చితమైన టైమింగ్‌తో బంతిని బౌండరీలు దాటించాడు. బ్యాక్‌ఫుట్‌పై బలంగా నిలబడి షాట్లు ఆడాడు. దీంతో జట్టు తొలి ఆరు ఓవర్లలో 48/0తో నిలిచింది. ఇన్నింగ్స్‌ సాఫీగా సాగుతున్న సమయంలో రాహుల్‌ను ఔట్‌ చేసిన కుల్‌దీప్‌ జట్టును పోటీలోకి తెచ్చే ప్రయత్నం చేశాడు. స్పిన్నర్లు కట్టుదిట్టంగా బంతులేయడంతో పరుగులు అంత సులభంగా రాలేదు. మరోవైపు ఫోర్‌తో డికాక్‌ అర్ధశతకం చేరుకున్నాడు. లూయిస్‌ (5)ను లలిత్‌ పెవిలియన్‌ చేర్చాడు. నార్జ్‌ రెండు బీమర్లు  వేయడంతో మధ్యలోనే బౌలింగ్‌ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఆ ఓవర్‌ భర్తీ చేసేందుకు వచ్చిన కుల్‌దీప్‌..  వరుసగా రెండు ఫోర్లు ఇచ్చినప్పటికీ తర్వాతి బంతికే డికాక్‌ ఇన్నింగ్స్‌కు ముగింపు పలికాడు. చివర్లో ముస్తాఫిజుర్‌, శార్దూల్‌ కట్టడి చేయడంతో లఖ్‌నవూకు 12 బంతుల్లో 19 పరుగులు అవసరమయ్యాయి. 19వ ఓవర్లో తొలి రెండు బంతులకు సింగిల్స్‌ రాగా.. మూడో బంతిని సిక్సర్‌గా మలచిన కృనాల్‌ (19 నాటౌట్‌) తమ జట్టు ఆశలు నిలిపాడు. ఆ తర్వాత మూడు బంతులకు ఆరు పరుగులు రావడంతో చివరి ఓవర్లో 5 పరుగులు కావాల్సి వచ్చింది. కానీ తొలి బంతికే దీపక్‌ (11)ను శార్దూల్‌ (1/29) ఔట్‌ చేయడంతో ఉత్కంఠ రేగింది. రెండో బంతికి పరుగు రాలేదు. కానీ ఆయూష్‌ బదోని (10 నాటౌట్‌) వరుసగా 4, 6 కొట్టి మ్యాచ్‌ ముగించాడు.

ఆరంభం అదిరినా..: పృథ్వీ షా ధనాధన్‌ అర్ధశతకంతో దిల్లీకి అదిరే ఆరంభం దక్కినా.. ఆ తర్వాత లఖ్‌నవూ బౌలర్లు గొప్పగా పుంజుకుని ప్రత్యర్థికి కళ్లెం వేశారు. ఓ దశలో 200 పరుగులు చేసేలా కనిపించిన ఆ జట్టు.. చివరకు ఆపసోపాలు పడి 150 కూడా చేయలేకపోయింది. ఈ సీజన్‌లో తొలి మ్యాచ్‌ ఆడుతున్న వార్నర్‌ (4) ఓ ఎండ్‌లో తడబడ్డప్పటికీ.. మరోవైపు షా మాత్రం రెచ్చిపోయాడు. చూడముచ్చటైన డ్రైవ్‌లతో అలరించాడు. కట్‌ షాట్లతో బౌండరీలు రాబట్టాడు. దీంతో తొలి పవర్‌ప్లే ముగిసేసరికి దిల్లీ 52/0తో భారీ స్కోరు సాధించేలా కనిపించింది. ఆ వెంటనే షా అర్ధశతకం అందుకున్నాడు.  ఆ దశలో 8 పరుగుల వ్యవధిలో స్పిన్నర్లు మూడు వికెట్లు పడగొట్టడంతో కథ అడ్డం తిరిగింది. మొదట జోరుమీదున్న పృథ్వీని గౌతమ్‌ ఔట్‌ చేసి జట్టుకు అత్యవసరమైన వికెట్‌ అందించాడు. ఆ తర్వాత గూగ్లీలతో బిష్ణోయ్‌ తన వరుస ఓవర్లలో వార్నర్‌, పావెల్‌ (3)ను వెనక్కిపంపాడు. దీంతో స్కోరు వేగం మందగించింది. ఆరంభంలో పృథ్వీ బౌండరీలతో చెలరేగిన అదే పిచ్‌పై.. పంత్‌ లాంటి హిట్టర్‌ను కట్టడి చేస్తూ గౌతమ్‌ తన చివరి ఓవర్‌ మెయిడెన్‌ వేయడం విశేషం. 9 నుంచి 14 మధ్య 6 ఓవర్లలో దిల్లీ కేవలం 22 పరుగులే చేయగలిగింది. స్పిన్నర్లు, పేసర్లు అనే తేడా లేకుండా బౌండరీలు బాదే పంత్‌.. షాట్లు ఆడేందుకు తీవ్రంగా కష్టపడ్డాడు. రనౌటయ్యే ప్రమాదాన్ని తప్పించుకున్న అతను తొలి 19 బంతుల్లో 8 పరుగులే చేశాడు. టై (0/28) ఓవర్లో రెండు సిక్సర్లు, ఓ ఫోర్‌ బాది ఇన్నింగ్స్‌ వేగం పెంచే ప్రయత్నం చేశాడు. సర్ఫ్‌రాజ్‌ కూడా వరుసగా రెండు ఫోర్లు కొట్టాడు. ఇక ఈ జోడీ చెలరేగుతుందని ఆశించిన దిల్లీ అభిమానులకు నిరాశే మిగిలింది. వైవిధ్యమైన బౌలింగ్‌తో హోల్డర్‌, మంచి పేస్‌తో అవేశ్‌ (0/32) చివర్లో గొప్పగా బౌలింగ్‌ చేశారు. ముఖ్యంగా హోల్డర్‌ 18, 20వ ఓవర్లలో ఒక్క బౌండరీ కూడా ఇవ్వలేదు. వికెట్లు చేతిలో ఉన్నా వేగంగా పరుగులు చేయలేక పంత్‌, సర్ఫ్‌రాజ్‌ నిస్సహాయంగా మైదానం వీడారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని