PV Sindhu: క్వార్టర్‌ఫైనల్లో సింధు, శ్రీకాంత్‌

కొరియా ఓపెన్‌ సూపర్‌ 500 టోర్నీలో భారత అగ్రశ్రేణి క్రీడాకారులకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. పి.వి.సింధు, కిదాంబి శ్రీకాంత్‌ క్వార్టర్‌ఫైనల్లోకి ప్రవేశించగా.. లక్ష్యసేన్‌ టోర్నీ నుంచి నిష్క్రమించాడు. గురువారం జరిగిన మహిళల సింగిల్స్‌ ప్రిక్వార్టర్స్‌లో

Updated : 08 Apr 2022 06:50 IST

లక్ష్యసేన్‌ పరాజయం

సాత్విక్‌ జోడీ ముందంజ

కొరియా ఓపెన్‌ బ్యాడ్మింటన్‌

సన్‌చెయాన్‌

కొరియా ఓపెన్‌ సూపర్‌ 500 టోర్నీలో భారత అగ్రశ్రేణి క్రీడాకారులకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. పి.వి.సింధు, కిదాంబి శ్రీకాంత్‌ క్వార్టర్‌ఫైనల్లోకి ప్రవేశించగా.. లక్ష్యసేన్‌ టోర్నీ నుంచి నిష్క్రమించాడు. గురువారం జరిగిన మహిళల సింగిల్స్‌ ప్రిక్వార్టర్స్‌లో మూడో సీడ్‌ సింధు 21-15, 21-10తో అయా ఒహొరి (జపాన్‌)పై విజయం సాధించింది. మాళవిక బాన్సోద్‌ 8-21, 14-21తో పోర్న్‌పావీ (థాయ్‌లాండ్‌) చేతిలో ఓడింది. పురుషుల సింగిల్స్‌ ప్రిక్వార్టర్స్‌లో అయిదో సీడ్‌ శ్రీకాంత్‌ 21-18, 21-6తో మిషా జిల్బర్‌మన్‌ (ఇజ్రాయెల్‌)పై నెగ్గాడు. ఆరో సీడ్‌ లక్ష్యసేన్‌ 20-22, 9-21తో షెసర్‌ హిరెన్‌ (ఇండోనేసియా) చేతిలో పరాజయం చవిచూశాడు. భారత నంబర్‌వన్‌ జోడీ సాత్విక్‌ సాయిరాజు- చిరాగ్‌శెట్టి క్వార్టర్‌ఫైనల్లోకి దూసుకెళ్లింది. పురుషుల డబుల్స్‌ ప్రిక్వార్టర్స్‌లో సాత్విక్‌- చిరాగ్‌ జోడీ 21-15, 21-19తో యాంగ్‌ టెర్రీ- కీన్‌ హీన్‌ (సింగపూర్‌) జంటపై గెలిచింది. మిక్స్‌డ్‌ డబుల్స్‌ ప్రిక్వార్టర్స్‌లో సుమీత్‌రెడ్డి- అశ్విని పొన్నప్ప జంట 20-22, 21-18, 14-21తో షువాన్‌ యి- హువాంగ్‌ యా (చైనా) జోడీ చేతిలో పోరాడి ఓడింది. శుక్రవారం జరిగే క్వార్టర్స్‌లో బుసానన్‌ (థాయ్‌లాండ్‌)తో సింధు, సన్‌ వాన్‌హో (కొరియా)తో శ్రీకాంత్‌, మిన్యుక్‌- సూంగ్‌జే (కొరియా)తో సాత్విక్‌- చిరాగ్‌ తలపడతారు. సింధుకు 16-1తో బుసానన్‌పై మెరుగైన గెలుపోటముల రికార్డు ఉంది. శ్రీకాంత్‌, వాన్‌హోలు 11 మ్యాచ్‌లాడగా.. నాల్గింట్లో భారత ఆటగాడు, ఏడింట్లో ప్రత్యర్థి పైచేయి సాధించారు.

వరుసగా రెండో మ్యాచ్‌లోనూ సింధు సంపూర్ణ ఆధిపత్యం కనబరిచింది. షటిల్‌పై పూర్తి నియంత్రణతో ఆడిన సింధుకు ప్రత్యర్థి నుంచి పోటీ ఎదురవలేదు. ఒహొరిపై 11-0 విజయాల రికార్డుతో బరిలో దిగిన సింధు కేవలం 37 నిమిషాల్లో మ్యాచ్‌ను ముగించింది. 5-2తో తొలి గేమ్‌ను ప్రారంభించిన సింధును 6 పాయింట్ల వద్ద ప్రత్యర్థి అందుకుంది. 12-10 పాయింట్ల వరకు ప్రత్యర్థి సమీపంలోనే ఉంది. అయితే అక్కడ్నుంచి సింధు జోరు పెంచింది. స్మాష్‌లు, క్రాస్‌కోర్ట్‌ షాట్‌లతో పాయింట్లు రాబట్టింది. 18-14తో ముందంజ వేసిన సింధు.. చూస్తుండగానే 21-15తో తొలి గేమ్‌ను సొంతం చేసుకుంది. రెండో గేమ్‌ ఆరంభంలో ఒహొరి దూకుడుగా ఆడింది. సింధుపై ఆధిపత్యం కోసం గట్టిగా ప్రయత్నించింది. ఒకదశలో 8-4తో ఒహొరి ఆధిక్యం సంపాదించింది. అయితే పరిస్థితి చేజారకముందే సింధు గేరు మార్చింది. వరుసగా 4 పాయింట్లు రాబట్టి 8-8తో స్కోరును సమం చేసింది. ఒహొరి ఒక పాయింటు నెగ్గి మళ్లీ ఆధిక్యంలోకి వెళ్లింది. ఒక్కసారిగా చెలరేగిన సింధు వరుసగా 10 పాయింట్లతో ప్రత్యర్థిని పోటీలోనే లేకుండా చేసింది. 18-9తో ఆధిక్యం సంపాదించిన సింధు.. 21-10తో రెండో గేమ్‌ను దక్కించుకుంది.

ఇక శ్రీకాంత్‌ 33 నిమిషాల్లోనే ప్రత్యర్థి ఆటకట్టించాడు. ఆరంభంలో ప్రత్యర్థి నుంచి పోటీ ఎదురవడంతో 8 పాయింట్ల వరకు ఇరువురు హోరాహోరీగా తలపడ్డారు. జిల్బర్‌మన్‌ ఒక పాయింటు గెలిచి 9-8తో ఆధిక్యం సంపాదించాడు. వెంటనే పుంజుకున్న శ్రీకాంత్‌ వరుసగా  4 పాయింట్లు గెలిచి 12-9తో ముందంజ వేశాడు. అక్కడ్నుంచి శ్రీకాంత్‌ వెనుదిరిగి చూడలేదు. 21-18తో తొలి గేమ్‌ను ముగించిన శ్రీకాంత్‌.. రెండో గేమ్‌ను మరింత దూకుడుగా ప్రారంభించాడు. వరుసగా 12 పాయింట్లతో శ్రీకాంత్‌ చెలరేగాడు. 12 పాయింట్ల వరకు జిల్బర్‌మన్‌కు శ్రీకాంత్‌ అవకాశమే ఇవ్వలేదు. ఎట్టకేలకు 2 పాయింట్లతో జిల్బర్‌మన్‌ ఖాతా తెరిచాడు. మరోసారి చెలరేగిన శ్రీకాంత్‌ 17-5తో గేమ్‌కు చేరువయ్యాడు. అదే జోరులో 21-6తో రెండో గేమ్‌ను ముగించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని