Glenn Maxwell: ప్రత్యర్థులకు ఇక ‘కంగారే’

పది జట్లతో సరికొత్తగా సీజన్‌ మొదలైంది.. మెగా వేలంతో జట్ల రూపురేఖలు మారిపోయాయి.. మ్యాచ్‌లు సాగుతున్నాయి.. కానీ అభిమానుల్లో ఏదో ఒక వెలితి. ‘‘ఒకటి తగ్గింది’’..

Updated : 08 Apr 2022 06:56 IST

ముంబయి: పది జట్లతో సరికొత్తగా సీజన్‌ మొదలైంది.. మెగా వేలంతో జట్ల రూపురేఖలు మారిపోయాయి.. మ్యాచ్‌లు సాగుతున్నాయి.. కానీ అభిమానుల్లో ఏదో ఒక వెలితి. ‘‘ఒకటి తగ్గింది’’.. అంటూ ఆస్ట్రేలియా ఆటగాళ్ల కోసం ఎదురు చూశారు. ఇప్పుడా నిరీక్షణ ముగిసింది. పాకిస్థాన్‌తో సిరీస్‌ ముగించుకున్న కంగారూ ఆటగాళ్లు ఐపీఎల్‌ మ్యాచ్‌లకు సై అంటున్నారు. ఇప్పటికే ఆసీస్‌ సారథి కమిన్స్‌.. కోల్‌కతా చేరి ముంబయిపై ఎలాంటి విధ్వంసం సృష్టించాడో చూశాం. ఆసీస్‌ ఆటగాళ్లు అడుగుపెడితే ఎలా ఉంటుందో అతని ఇన్నింగ్స్‌ చాటింది. ఇక చరిత్రలోనే అత్యధిక పరుగులు చేసిన విదేశీ ఆటగాళ్లలో అగ్రస్థానంలో ఉన్న వార్నర్‌.. తొమ్మిదేళ్ల తర్వాత తిరిగి దిల్లీ తరపున బరిలో దిగాడు. తొలి మ్యాచ్‌లో విఫలమైనా వార్నర్‌ తనదైన శైలిలో చెలరేగుతాడని అభిమానులు ఆశతో ఉన్నారు. పెళ్లి కారణంగా ఆలస్యంగా బెంగళూరుతో చేరిన మ్యాక్స్‌వెల్‌ శనివారం ముంబయితో మ్యాచ్‌తో ఈ సీజన్‌ మొదలెట్టే అవకాశం ఉంది. ఇక వేలానికి ముందే జట్టులోకి తీసుకున్న స్టాయినిస్‌.. ఆదివారం నుంచి లఖ్‌నవూకు అందుబాటులోకి రానున్నాడు. హేజిల్‌వుడ్‌, బెరెన్‌డార్ఫ్‌ (బెంగళూరు), మిచెల్‌ మార్ష్‌ (దిల్లీ), ఆరోన్‌ ఫించ్‌ (కోల్‌కతా), నాథన్‌ ఎలిస్‌ (పంజాబ్‌), సీన్‌ అబాట్‌ (హైదరాబాద్‌)లు కూడా త్వరలోనే ఆయా జట్ల తరపున ఆడేందుకు సిద్ధమవుతున్నారు. ప్రపంచ టీ20 ఛాంపియన్లయిన ఆస్ట్రేలియా ఆటగాళ్లు.. లీగ్‌లో తమదైన ముద్ర వేయడం ఖాయమనిపిస్తోంది. వీళ్ల చేరికతో ఆయా జట్లు మరింత బలంగా మారతాయనడంలో సందేహం లేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని