Rajasthan vs Lucknow: టాప్‌లేపిన రాజస్థాన్
రాజస్థాన్ సత్తా చాటింది. మూడో విజయంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. 67 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ స్థితిలో హెట్మయర్ ధనాధన్ ఇన్నింగ్స్‌తో
హెట్మయర్ సంచలన ఇన్నింగ్స్
చాహల్ విజృంభణ
లఖ్‌నవూ ఓటమి
రాజస్థాన్ సత్తా చాటింది. మూడో విజయంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. 67 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ స్థితిలో హెట్మయర్ ధనాధన్ ఇన్నింగ్స్‌తో కోలుకుని మెరుగైన లక్ష్యాన్ని నిర్దేశించిన రాజస్థాన్.. చక్కని బౌలింగ్‌తో లఖ్‌నవూకు కళ్లెం వేసింది. ఆశల్లేని స్థితిలో స్టాయినిస్ గొప్పగా పోరాడినా.. లఖ్‌నవూను గెలిపించలేకపోయాడు.
ముంబయి
రాజస్థాన్ మెరిసింది. ఆదివారం 3 పరుగుల తేడాతో లఖ్‌నవూపై విజయం సాధించింది. హెట్మయర్ (59 నాటౌట్; 36 బంతుల్లో 1×4, 6×6) ఆదుకోవడంతో మొదట రాజస్థాన్ 6 వికెట్లకు 165 పరుగులు చేసింది. ఛేదనలో లఖ్‌నవూ 8 వికెట్లకు 162 పరుగులే చేయగలిగింది. ఆఖర్లో స్టాయినిస్ (38 నాటౌట్; 17 బంతుల్లో 2×4, 4×6) గట్టిగా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ‘మ్యాన్ ఆప్ ద మ్యాచ్’ చాహల్ (4/41), బౌల్ట్ (2/30), కుల్దీప్ సేన్ (1/35) బంతితో రాణించారు.
స్టాయినిస్ పోరాడినా..: పెద్దదేమీ కాని లక్ష్య ఛేదనలో ఇన్నింగ్స్‌ను అత్యంత పేలవంగా ఆరంభించింది లఖ్‌నవూ. బౌల్ట్ తొలి ఓవర్లో రెండు వికెట్లు పడగొట్టి ఆ జట్టును గట్టి దెబ్బతీశాడు. తొలి బంతికే రాహుల్‌ను బౌల్డ్ చేసిన అతడు. ఓ వైడ్ తర్వాత గౌతమ్‌ను ఎల్బీగా వెనక్కి పంపాడు. నాలుగో ఓవర్లో హోల్డర్ (8)ను ప్రసిద్ధ్ వెనక్కి పంపడంతో లఖ్‌నవూ 14/3తో తీవ్ర ఇబ్బందుల్లో పడింది. అయితే ఓపెనర్ డికాక్ (39; 32 బంతుల్లో 2×4, 1×6), దీపక్ హుడా (25; 24 బంతుల్లో 3×4) నిలబడ్డారు. పరిస్థితిని కాస్త మెరుగుపర్చారు. కానీ పరుగులు వేగంగా రాలేదు. జోరు పెంచాల్సిన దశలో కుల్దీప్ సేన్ బౌలింగ్‌లో హుడా బౌల్డయ్యాడు. పదో ఓవర్లో అతడు ఔటయ్యేటప్పటికి స్కోరు 52. కాసేపటి తర్వాత బదోని (5) చాహల్ బౌలింగ్‌లో నిష్క్రమించాడు. అప్పటికే సాధించాల్సిన రన్‌రేట్ బాగా పెరిగిపోయింది. చివరి 8 ఓవర్లలో 92 పరుగులు చేయాల్సిన పరిస్థితి. చాలా సేపటి నుంచి క్రీజులో ఉన్నా.. డికాక్ గేర్ మార్చలేకపోయాడు. 15 ఓవర్లకు జట్టు స్కోరు 97 పరుగులే. అయినా డికాక్‌కు తోడు కృనాల్ (22; 15 బంతుల్లో 2×4) క్రీజులో ఉండడంతో లఖ్‌నవూలో ఏదో ఆశ. అతడు కాస్త ధాటిగా బ్యాటింగ్ చేశాడు కూడా. కానీ 16వ ఓవర్లో డికాక్, కృనాల్‌లను చాహల్ ఔట్ చేయడంతో లఖ్‌నవూ అవకాశాలు బాగా సన్నగిల్లాయి. కానీ స్టాయినిస్ అదిరే బ్యాటింగ్‌తో ఆ జట్టును రేసులో నిలిపాడు. మ్యాచ్‌ను ఆసక్తికరంగా మర్చాడు. 18వ ఓవర్లో (చాహల్) స్టాయినిస్ ఓ సిక్స్ కొట్టగా.. ఔటైన చమీర స్థానంలో వచ్చిన అవేష్ ఖాన్ కూడా ఓ సిక్స్ కొట్టాడు. చివరి రెండు ఓవర్లలో లఖ్‌నవూకు 34 పరుగులు అవసరం కాగా.. స్టాయినిస్ రెండు సిక్స్‌లు, ఓ ఫోర్ బాదడంతో 19వ ఓవర్లో ప్రసిద్ధ్ 19 పరుగులు సమర్పించుకున్నాడు. మ్యాచ్‌లో ఉత్కంఠ పెరిగింది. కానీ ఆఖరి ఓవర్లో అద్భుతంగా బౌలింగ్ చేసిన కుల్దీప్ సేన్.. తొలి నాలుగు బంతుల్లో ఒక్క పరుగే ఇచ్చి మ్యాచ్‌ను రాజస్థాన్‌వైపు తిప్పాడు.
హెట్మయర్ ధనాధన్: అంతకుముందు రాజస్థాన్ మెరుగైన స్కోరు సాధించింది అంటే అది హెట్మయర్ విధ్వంస ఫలితమే. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆ జట్టు పడిక్కల్ (29) కాస్త బ్యాట్ ఝుళిపించడంతో 5 ఓవర్లకు 42/0తో నిలిచింది. కానీ ఆ తర్వాత తడబడింది. తర్వాతి 5 ఓవర్లలో 25 పరుగులే చేసిన రాజస్థాన్ నాలుగు కీలక వికెట్లు కోల్పోయి చిక్కుల్లో పడింది. బ్యాట్ ఝుళిపించలేకపోయిన బట్లర్ (13)ను ఆరో ఓవర్లో ఔట్ చేయడం ద్వారా రాజస్థాన్ పతనాన్ని అవేష్ ఖాన్ ఆరంభించాడు. సంజు శాంసన్ (13)ను హోల్డర్ వికెట్ల ముందు దొరకబుచ్చుకోగా.. గౌతమ్ ఒకే ఓవర్లో పడిక్కల్, డసెన్ (4)ను ఔట్ చేసి ప్రత్యర్థిని గట్టి గెబ్బతీశాడు. 10 ఓవర్లు ముగిసే సరికి స్కోరు 67/4. ఇబ్బందుల్లో ఉన్న రాజస్థాన్‌ను హెట్మయర్, అశ్విన్ ఆదుకున్నారు. అయితే చాలా సేపు ఇద్దరూ ఎక్కువగా సింగిల్స్‌కే పరిమితమయ్యారు. 11 నుంచి 15 ఓవర్ల మధ్య రాజస్థాన్‌కు 25 పరుగులు మాత్రమే వచ్చాయి. అయితే గౌతమ్ బౌలింగ్‌లో అశ్విన్ వరుసగా రెండు సిక్స్‌లు బాదడంతో ఇన్నింగ్స్‌కు ఊపొచ్చింది. ఆ తర్వాత హెట్మయర్ పెను విధ్వంసం సృష్టించాడు. హోల్డర్ వేసిన ఇన్నింగ్స్ 18వ ఓవర్లో రెండు సిక్స్‌లు, ఫోర్.. 19వ ఓవర్లో (అవేష్ ఖాన్) బౌలింగ్‌లో రెండు సిక్స్‌లు, ఆఖరి ఓవర్లో ఓ సిక్స్ దంచాడు. 33 బంతుల్లో అర్ధశతకం సాధించిన హెట్మయర్.. అశ్విన్ (28)తో అయిదో వికెట్‌కు 68 పరుగులు జోడించాడు. అశ్విన్ 19వ ఓవర్లో రిటైర్డ్ ఔట్‌గా వెనుదిరిగాడు. ఆఖరి మూడు ఓవర్లలో రాజస్థాన్ 50 పరుగులు రాబట్టింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కేజ్రీవాల్‌పై వ్యాఖ్యలు.. మరోసారి అమెరికాకు భారత్ కౌంటర్
-
ఆ మాజీ సీఎం తనయుడి ఆస్తి ₹700 కోట్లు.. సొంత వాహనం లేదు!
-
రిటైల్ బ్రాండ్ల చూపు.. ఆలయ నగరాల వైపు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
పరిశ్రమలు తేవడం తెదేపా బ్రాండ్.. తరిమికొట్టడం జగన్ బ్రాండ్: చంద్రబాబు