Prithvi Shaw - David Warner: దిల్లీ దంచెన్‌

పృథ్వీ షా, డేవిడ్‌ వార్నర్‌.. ఈ టోర్నీలో అత్యుత్తమ ఓపెనింగ్‌ జోడీ. వేలం నుంచి ఈ మాట వినడమే గానీ వీరి జోరు చూసే అవకాశం లేకపోయింది. ఆదివారం ఆ ముచ్చట తీరిపోయింది. వికెట్‌కు రెండు

Updated : 11 Apr 2022 09:09 IST

సీజన్లో అత్యధిక స్కోరు నమోదు

కుల్‌దీప్‌, ఖలీల్‌ విజృంభణ

కోల్‌కతాపై ఘనవిజయం

పృథ్వీ, వార్నర్‌ వీరవిహారం

పృథ్వీ షా, డేవిడ్‌ వార్నర్‌.. ఈ టోర్నీలో అత్యుత్తమ ఓపెనింగ్‌ జోడీ. వేలం నుంచి ఈ మాట వినడమే గానీ వీరి జోరు చూసే అవకాశం లేకపోయింది. ఆదివారం ఆ ముచ్చట తీరిపోయింది. వికెట్‌కు రెండు వైపుల నుంచి బ్యాట్ల మోత మోగితే ఎలా ఉంటుందో తెలిసిపోయింది. ఫలితమే ఈ సీజన్‌లో అత్యధిక స్కోరు. బ్యాటుతో పృథ్వీ, వార్నర్‌ విధ్వంసం.. బంతితో కుల్‌దీప్‌ యాదవ్‌, ఖలీల్‌ అహ్మద్‌ విజృంభణతో దిల్లీ సీజన్‌లో రెండో విజయాన్ని నమోదు చేసింది. సీజన్లో నిలకడగా ఆడుతున్న కోల్‌కతా రెండో ఓటమిని ఖాతాలో వేసుకుంది.

ముంబయి

వరుసగా రెండు ఓటములతో ఇబ్బంది పడ్డ దిల్లీలో ఒక్కసారిగా జోష్‌ వచ్చింది. మొదట బ్యాటుతో, తర్వాత బంతితో సంపూర్ణ ఆధిపత్యం కనబరిచిన దిల్లీ.. కోల్‌కతా జోరుకు అడ్డుకట్ట వేసింది. ఆదివారం దిల్లీ 44 పరుగుల తేడాతో కోల్‌కతాపై విజయం సాధించింది. ఓపెనర్లు పృథ్వీ (51; 29 బంతుల్లో 7×4, 2×6), వార్నర్‌ (61; 45 బంతుల్లో 6×4, 2×6) చెలరేగడంతో మొదట బ్యాటింగ్‌ చేసిన దిల్లీ 20 ఓవర్లలో 5 వికెట్లకు 215 పరుగుల భారీ స్కోరు చేసింది. ఈ సీజన్లో ఇదే అత్యధిక స్కోరు. అనంతరం కోల్‌కతా 19.4 ఓవర్లలో 171 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ (54; 33 బంతుల్లో 5×4, 2×6) పోరాటం వృథా అయింది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ కుల్‌దీప్‌ యాదవ్‌ (4/35), ఖలీల్‌ అహ్మద్‌ (3/25)లు విజృంభించి కోల్‌కతా బ్యాటర్ల పనిపట్టారు.

ఆ భాగస్వామ్యం మినహా..: భారీ లక్ష్య ఛేదనలో కోల్‌కతాకు సరైన ఆరంభం లభించలేదు. శార్దూల్‌ ఓవర్లో వరుసగా రెండు సిక్సర్లు బాదిన వెంకటేశ్‌ అయ్యర్‌ (18; 8 బంతుల్లో 1×4, 2×6).. ఖలీల్‌ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి ఔటయ్యాడు. తొలి బంతి నుంచే క్రీజులో అసౌకర్యంగా కదిలిన ఆజింక్య రహానె (8).. ఖలీల్‌ బౌలింగ్‌లోనే వెనుదిరిగాడు. దీంతో 38 పరుగులకే కోల్‌కతా ఓపెనర్లను కోల్పోయింది. ఈ సమయంలో శ్రేయస్‌.. నితీశ్‌ రాణా (30; 20 బంతుల్లో 3×6)లు బౌండరీలు, సిక్సర్లతో దిల్లీ బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. దీంతో చూస్తుండగానే కోల్‌కతా స్కోరు 100 పరుగులు దాటింది. ఈ భాగస్వామ్యం ప్రమాదకరంగా మారుతున్న సమయంలో నితీశ్‌కు లలిత్‌ యాదవ్‌ (1/8) కళ్లెం వేయడంతో దిల్లీ ఊపిరి పీల్చుకుంది. అనంతరం కుల్‌దీప్‌ బౌలింగ్‌లో సిక్సర్‌తో శ్రేయస్‌ అర్ధ సెంచరీ (32 బంతుల్లో) సాధించాడు. ఐపీఎల్‌లో అతనికి ఇది 17వ అర్ధశకతం. అక్కడ్నుంచి కుల్‌దీప్‌ మాయాజాలం మొదలైంది. 13వ ఓవర్లో శ్రేయస్‌ను స్టంపౌట్‌తో వెనక్కి పంపిన కుల్‌దీప్‌.. 16వ ఓవర్లో మరింతగా విజృంభించాడు. 4 బంతుల వ్యవధిలో కమిన్స్‌ (4), సునీల్‌ నరైన్‌ (4), ఉమేశ్‌యాదవ్‌ (0)లను ఔట్‌ చేసి కోల్‌కతాకు మ్యాచ్‌ను దూరం చేశాడు. ఆ సమయంలో కోల్‌కతాకు 24 బంతుల్లో 73 పరుగులు కావాలి. ఆండ్రి రసెల్‌ (24; 21 బంతుల్లో 3×4) క్రీజులో ఉండటంతో ఏమైనా అద్భుతం చేస్తాడా అని చూశారు కోల్‌కతా అభిమానులు. అయితే ముస్తాఫిజుర్‌, ఖలీల్‌ కట్టుదిట్టంగా బంతులేయడంతో రసెల్‌ నిస్సహాయంగా మారిపోయాడు. శార్దూల్‌ బౌలింగ్‌ రసెల్‌, సలామ్‌ (7) ఔటవడంతో కోల్‌కతా ఇన్నింగ్స్‌కు తెరపడింది.

ఓపెనర్ల వీరబాదుడు: మొదట టాస్‌ ఓడి బ్యాటింగ్‌ చేసిన దిల్లీకి ఓపెనర్లు పృథ్వీ, వార్నర్‌ అదిరే ఆరంభాన్నిచ్చారు. బంతి నేరుగా బ్యాటు మీదకి వస్తుండటంతో ఓపెనర్లు చెలరేగారు. పృథ్వీ తనదైన శైలిలో బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ముంబయిపై 14 బంతుల్లోనే అర్ధ సెంచరీతో చెలరేగిన పేసర్‌ ప్యాట్‌ కమిన్స్‌కు వరుసగా రెండు బౌండరీలతో స్వాగతం పలికాడు వార్నర్‌. వీరిద్దరి జోరుతో పవర్‌ ప్లేలో దిల్లీ 68 పరుగులు రాబట్టింది. వెంకటేశ్‌ అయ్యర్‌ బౌలింగ్‌లో సిక్సర్‌, బౌండరీతో చెలరేగిన పృథ్వీ.. 27 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. టోర్నీలో అతనికిది 12వ అర్ధ శతకం. అయితే జోరుమీదున్న పృథ్వీని వరుణ్‌ చక్కటి గూగ్లీతో క్లీన్‌బౌల్డ్‌ చేశాడు. పృథ్వీ, వార్నర్‌ తొలి వికెట్‌కు 93 పరుగులు జోడించారు. అనంతరం పంత్‌ (27; 14 బంతుల్లో 2×4, 2×6).. వికెట్‌ పడ్డ ప్రభావాన్ని కనబడనీయలేదు. వరుణ్‌ బౌలింగ్‌లో డీప్‌ మిడ్‌ వికెట్‌లో సిక్సర్‌తో అలరించిన పంత్‌.. తర్వాతి బంతిని రివర్స్‌ స్వీప్‌తో బౌండరీ రాబట్టాడు. రెండు నోబాల్స్‌ వేసిన వరుణ్‌ పూర్తిగా లైన్‌ తప్పడంతో 11వ ఓవర్లో దిల్లీకి 24 పరుగులు వచ్చాయి. రసెల్‌ బౌలింగ్‌లో లాంగాన్‌లో సిక్సర్‌తో వార్నర్‌ అర్ధ శతకం (35 బంతుల్లో) పూర్తయింది. ఐపీఎల్‌లో అతనికి ఇది 51వ అర్ధసెంచరీ. అదే ఓవర్లో స్లో బౌన్సర్‌కు భారీ షాట్‌ ఆడబోయిన పంత్‌.. థర్డ్‌మన్‌లో ఉమేశ్‌ చేతికి చిక్కాడు. కొద్దిసేపటికే లలిత్‌యాదవ్‌ (1), రోమన్‌ పావెల్‌ (8), వార్నర్‌ వెంటవెంటనే ఔటయ్యారు. అప్పటికి స్కోరు 16.4 ఓవర్లలో 166/5. స్కోరు 200 చేరడం కష్టమే అనుకుంటే.. ఆఖర్లో అక్షర్‌ పటేల్‌ (22 నాటౌట్‌; 14 బంతుల్లో 2×4, 1×6), శార్దూల్‌ ఠాకూర్‌ (29 నాటౌట్‌; 11 బంతుల్లో 1×4, 3×6) విధ్వంసం సృష్టించారు. ఉమేశ్‌ 19వ ఓవర్లో శార్దూల్‌ రెండు, అక్షర్‌ ఒక భారీ సిక్సర్‌ సాధించారు. చివరి ఓవర్లో (కమిన్స్‌) బౌండరీతో శార్దూల్‌ జట్టు స్కోరును 200 పరుగులు దాటించాడు. ఆఖరి బంతికి సిక్సర్‌తో ఇన్నింగ్స్‌ను ముగించాడు. దిల్లీ చివరి 2 ఓవర్లలో 39 పరుగులు రాబట్టింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని