Yuzvendra Chahal: నోటికి టేపేసి కాళ్లు చేతులు కట్టేసి..

టీ20 మెగా టోర్నీ తన ఆరంభ రోజుల్లో బెంగళూరులో ఓ ఆటగాడు మ్యాచ్‌ అనంతర పార్టీలో తనను 15వ అంతస్తు నుంచి వేలాడదీశాడని స్పిన్నర్‌ యుజ్వేంద్ర చాహల్‌ చేసిన ఆరోపణలు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో

Updated : 12 Apr 2022 09:52 IST

ముంబయి: టీ20 మెగా టోర్నీ తన ఆరంభ రోజుల్లో బెంగళూరులో ఓ ఆటగాడు మ్యాచ్‌ అనంతర పార్టీలో తనను 15వ అంతస్తు నుంచి వేలాడదీశాడని స్పిన్నర్‌ యుజ్వేంద్ర చాహల్‌ చేసిన ఆరోపణలు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అతడు ఇంతకుముందు చేసిన ఆరోపణలపైనా చర్చ మొదలైంది. 2011లో తాను ముంబయి జట్టుకు ఆడుతున్న రోజుల్లో.. అప్పటి సహచరులు జేమ్స్‌ ఫ్రాంక్లిన్‌, ఆల్‌రౌండర్‌ ఆండ్రూ సైమండ్స్‌ తనను కట్టివేశారని చెప్పాడు. వాళ్లిద్దరు తన నోటికి టేపు అతికించి.. గదిలో వదిలేసి రాత్రంతా తనను మరిచిపోయారని అన్నాడు. ‘‘అది 2011లో ముంబయి ఛాంపియన్స్‌ లీగ్‌ గెలిచినప్పుడు జరిగింది. మేమప్పుడు చెన్నైలో ఉన్నాం. సైమండ్స్‌ చాలా ‘ఫ్రూట్‌ జూస్‌’ తాగాడు. అతడేమనుకున్నాడో నాకు తెలియదు. సైమండ్స్‌, జేమ్స్‌ ఫ్రాంక్లిన్‌ కలిసి నా చేతులు, కాళ్లు కట్టేశారు. నువ్వే ఈ కట్లు విప్పుకోవాలి అన్నారు. నా నోటికి టేపు కూడా వేశారు. ఆ తర్వాత పార్టీలో పడి నన్ను పూర్తిగా మరిచిపోయారు. ఉదయం గదిని శుభ్రం చేయడానికి వచ్చిన వ్యక్తి నన్ను చూశాడు. మరికొందరిని పిలిచి నా కట్లు విప్పాడు’’ అని చాహల్‌ చెప్పాడు. ఆ ఆటగాళ్లెప్పుడూ తనకు క్షమాపణలు చెప్పలేదని తెలిపాడు. 2011 నుంచి 2013 వరకు ముంబయి జట్టుకు ఆడిన ఫ్రాంక్లిన్‌ ప్రస్తుతం డర్హమ్‌ కౌంటీ ప్రధాన కోచ్‌. చాహల్‌ ఆరోపణల నేపథ్యంలో కౌంటీ స్పందించింది. ఈ విషయంపై ఫ్రాంక్లిన్‌తో ప్రైవేటుగా మాట్లాడతామని తెలిపింది. ‘‘2011లో జరిగిన ఘటనకు సంబంధించిన వార్తలు మా దృష్టికి వచ్చాయి. మా ఉద్యోగి పేరు కూడా అక్కడ ప్రస్తావనకు వచ్చింది. నిజాన్ని తెలుసుకోవడం కోసం అతడితో ప్రైవేటుగా మాట్లాడతాం’’ అని డర్హమ్‌ ఓ ప్రకటనలో చెప్పింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని