Updated : 16 Apr 2022 07:02 IST

Hyderabad vs Kolkata: ధనాధన్‌ హైదరాబాద్‌

రెచ్చిపోయిన త్రిపాఠి, మార్‌క్రమ్‌

హైదరాబాద్‌ హ్యాట్రిక్‌ విజయం

రసెల్‌, నితీశ్‌ పోరాటం వృథా

గత సీజన్లో పేలవ ప్రదర్శన.. ఈ సీజన్‌ తొలి రెండు మ్యాచ్‌ల్లో పరాజయాలు.. దీంతో హైదరాబాద్‌ను అందరూ తీసి పడేశారు. మరోసారి ఆ జట్టు అట్టడుగు స్థానానికి పరిమితం కావడం ఖాయమని తేల్చేశారు. కానీ ఇప్పుడా జట్టు వరుస విజయాలతో పట్టికలో పైపైకి దూసుకెళ్తోంది. మ్యాచ్‌ మ్యాచ్‌కూ మెరుగుపడుతున్న హైదరాబాద్‌ హ్యాట్రిక్‌ విజయాన్ని ఖాతాలో వేసుకుంది. రాహుల్‌ త్రిపాఠి (71; 37 బంతుల్లో 4×4, 6×6), మార్‌క్రమ్‌ (68 నాటౌట్‌; 36 బంతుల్లో 6×4, 4×6) మెరుపులు మెరిపించడంతో కోల్‌కతా నిర్దేశించిన 176 పరుగుల లక్ష్యాన్ని హైదరాబాద్‌ అలవోకగా ఛేదించింది.

ముంబయి

గెలుపు రుచి చూశాక హైదరాబాద్‌ ఆగట్లేదు. ఆ జట్టు వరుసగా మూడో విజయం సాధించింది. శుక్రవారం కోల్‌కతాను 7 వికెట్ల తేడాతో మట్టికరిపించింది. రాహుల్‌ త్రిపాఠి, మార్‌క్రమ్‌ చెలరేగడంతో 176 పరుగుల లక్ష్యాన్ని హైదరాబాద్‌ 13 బంతులుండగానే 3 వికెట్లు మాత్రమే కోల్పోయి అలవోకగా ఛేదించింది. మొదట కోల్‌కతా 8 వికెట్లకు 175 పరుగులు చేసింది. నటరాజన్‌ (3/37) దెబ్బకు కష్టాల్లో పడ్డ కోల్‌కతాను నితీశ్‌ రాణా (54; 36 బంతుల్లో 6×4, 2×6), ఆండ్రి రసెల్‌ (49 నాటౌట్‌; 25 బంతుల్లో 4×4, 4×6) ఆదుకుని మంచి స్కోరే సాధించిపెట్టినా బౌలర్ల వైఫల్యంతో ఆ జట్టుకు వరుసగా రెండో ఓటమి తప్పలేదు.

ఒకరి తర్వాత ఒకరు: ఛేదనలో హైదరాబాద్‌కు ఆశించిన ఆరంభం దక్కలేదు. ఫామ్‌లో ఉన్న ఓపెనర్లు ఎంతోసేపు క్రీజులో నిలవలేదు. అభిషేక్‌ శర్మ (3)ను కమిన్స్‌, విలియమ్సన్‌(17)ను రసెల్‌ (2/20) బౌల్డ్‌ చేయడంతో ఆ జట్టు 39/2తో నిలిచింది. కానీ హైదరాబాద్‌ ఎంతమాత్రం ఆత్మరక్షణలో పడలేదు. అందుక్కారణం.. రాహుల్‌ త్రిపాఠి. క్రీజులోకి వచ్చీ రాగానే బాదుడు మొదలుపెట్టేసిన అతను.. ఏ బౌలర్‌నూ లెక్కచేయలేదు. ఫోర్లు, సిక్సర్లు బాదడం ఇంత సులువా అన్నట్లుగా బంతిని పదే పదే బౌండరీ దాటించాడు. వరుణ్‌ వేసిన 8వ ఓవర్లో వరుసగా 4, 6, 6 బాది 40లోకి అడుగు పెట్టిన త్రిపాఠి.. పదో ఓవర్లోనే అర్ధశతకం (21 బంతుల్లో) పూర్తి చేశాడు. త్రిపాఠి చెలరేగుతుంటే.. మరో ఎండ్‌లో సహాయ పాత్ర పోషించిన మార్‌క్రమ్‌.. తర్వాత బాదే బాధ్యత తాను తీసుకున్నాడు. అతను కూడా వరుణ్‌నే లక్ష్యంగా చేసుకుని వరుసగా 6, 4 బాదాడు. 11 ఓవర్లకు 105/2తో హైదరాబాద్‌ పటిష్ట స్థితికి చేరుకుంది. ఈ దశలో రెండు ఓవర్లలో 8 పరుగులే రావడంతో కోల్‌కతా పోటీలోకి వచ్చింది. కానీ ఉమేశ్‌ వేసిన 14వ ఓవర్లో మార్‌క్రమ్‌ హ్యాట్రిక్‌ ఫోర్లు కొట్టడం, రసెల్‌ బంతిని త్రిపాఠి సిక్సర్‌గా మలచడంతో సమీకరణం 35 బంతుల్లో 43 పరుగులతో తేలిగ్గా మారింది. ఈ దశలో త్రిపాఠి ఔటైనా.. మార్‌క్రమ్‌ ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చి ఉత్కంఠకు అవకాశం లేకుండా చేశాడు. కమిన్స్‌ వేసిన 18వ ఓవర్లో అతను వరుసగా 4, 6, 6 బాది మ్యాచ్‌ను ముగించాడు.

తడబడి.. నిలబడి..: మొదట టాస్‌ ఓడి బ్యాటింగ్‌ చేసిన కోల్‌కతా.. సగం ఇన్నింగ్స్‌ ఆడిన తీరు చూస్తే ఆ జట్టు 150 చేయడం కూడా సందేహంగానే కనిపించింది. 10 ఓవర్లకు కోల్‌కతా చేసింది 70 పరుగులే. అప్పటికే కీలకమైన 4 వికెట్లు కోల్పోయింది. బిల్లింగ్స్‌ స్థానంలో జట్టులోకి వచ్చిన ఓపెనర్‌ ఫించ్‌ (7) తన మెరుపులను ఒక సిక్సర్‌కు పరిమితం చేస్తూ జాన్సన్‌ (1/26) వేసిన ఇన్నింగ్స్‌ రెండో ఓవర్లోనే వెనుదిరిగాడు. మరో ఓపెనర్‌ వెంకటేశ్‌ అయ్యర్‌ (6)ను తన తొలి బంతికే బౌల్డ్‌ చేశాడు నటరాజన్‌. అదే ఓవర్‌ రెండో బంతికి సిక్సర్‌ బాదిన నరైన్‌ (6) మూడో బంతికి ఔటైపోయాడు. 5 ఓవర్లకు 33/3తో పీకల్లోతు కష్టాల్లో పడింది కోల్‌కతా. ఈ దశలో నితీశ్‌ రాణాతో కలిసి కెప్టెన్‌ శ్రేయస్‌ (28; 25 బంతుల్లో 3×4) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. అయితే రన్‌ రేట్‌ 7 లోపే ఉండటంతో వేగం పెంచాలని చూసిన శ్రేయస్‌కు ఉమ్రాన్‌ మాలిక్‌ అవకాశం ఇవ్వలేదు. దీంతో అసహనంతో అడ్డదిడ్డంగా ఆడి ఉమ్రాన్‌ బౌలింగ్‌లోనే బౌల్డయిపోయాడు శ్రేయస్‌. అయితే అప్పటికే క్రీజులో కుదురుకున్న నితీశ్‌ ధాటిగా ఆడి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. దీంతో స్కోరు వంద దాటింది. జాక్సన్‌ (7) ఎంతోసేపు క్రీజులో నిలవకపోయినా.. నితీశ్‌కు రసెల్‌ తోడవడంతో ఇన్నింగ్స్‌ స్వరూపమే మారిపోయింది. రసెల్‌ తనదైన శైలిలో భారీ షాట్లు ఆడుతూ చివరి ఓవర్లలో స్కోరు బోర్డుకు ఎక్స్‌ప్రెస్‌ వేగాన్నందించాడు. నితీశ్‌, కమిన్స్‌ (3) స్వల్ప వ్యవధిలో వెనుదిరిగినా.. రసెల్‌ దూకుడు కొనసాగించడంతో కోల్‌కతా అనూహ్యమైన స్కోరు సాధించింది. చివరి 10 ఓవర్లలో ఆ జట్టు 105 పరుగులు రాబట్టింది.

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని