Updated : 16 Apr 2022 07:00 IST

Tilak Varma: అరంగేట్రంలో అదరహో...

మెగా టీ20 లీగ్‌లో సత్తాచాటుతున్న యువ ఆటగాళ్లు

(Photo: Tilak Varma, Abhinav Manohar Instagram)

ప్రపంచ ఫ్రాంఛైజీ క్రికెట్లో అత్యుత్తమ లీగ్‌! ఎంతోమంది ప్రతిభావంతులను వెలుగులోకి తెచ్చిన వేదిక. ప్రపంచ స్థాయి క్రికెటర్లు బరిలో దిగే ఈ లీగ్‌లో తొలిసారి ఆడుతున్న కుర్రాళ్లపై ఒత్తిడి ఉండడం సహజమే. లీగ్‌లో ప్రాతినిథ్యం వహించే అవకాశం దక్కడంతో ఆనందం.. ఎలాంటి ప్రదర్శన చేస్తామోననే ఆందోళన.. ఇలా బుర్రలో ఎన్నో ఆలోచనలు! కానీ ఈ యువ ఆటగాళ్లు మాత్రం ఆ ఒత్తిడినంతా పక్కనపెట్టి.. అరంగేట్రంలోనే ఉత్తమ ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నారు. మరి వాళ్లెవరో చూసేద్దాం పదండి!

ఈనాడు క్రీడావిభాగం

ఈ సీజన్లో ఇంకా బోణీ కొట్టని ముంబయికు జట్టులోని ఇద్దరి టీనేజర్ల ప్రదర్శన మాత్రం ఆనందాన్ని కలిగించేదే. వాళ్లే తిలక్‌ వర్మ, డెవాల్డ్‌ బ్రెవిస్‌. ముఖ్యంగా 19 ఏళ్ల తెలంగాణ కుర్రాడు తిలక్‌ నిలకడగా రాణిస్తున్నాడు. ఇప్పటివరకూ ఆడిన అయిదు మ్యాచ్‌ల్లో ఓ అర్ధశతకం సహా 157 పరుగులు చేశాడు. ప్రశాంతంగా క్రీజులో అడుగుపెట్టి.. అలవోకగా భారీ సిక్సర్లు బాదుతూ.. అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాడు. భవిష్యత్‌లో టీమ్‌ఇండియాకు ప్రాతినిథ్యం వహించే సామర్థ్యం ఉందంటూ మాజీల నుంచి ప్రశంసలు అందుకుంటున్నాడు. ఇక బేబీ ఏబీ (డివిలియర్స్‌)గా పేరు తెచ్చుకున్న 18 ఏళ్ల దక్షిణాఫ్రికా సంచలనం బ్రెవిస్‌ దాన్ని నిలబెడుతూ పంజాబ్‌తో మ్యాచ్‌లో (25 బంతుల్లోనే 49) విధ్వంసం సృష్టించాడు. అండర్‌-19 ప్రపంచకప్‌లో మెరుపులతో వెలుగులోకి వచ్చిన అతను.. మెగా టీ20లోనూ జోరు కొనసాగిస్తున్నాడు. ముఖ్యంగా రాహుల్‌ చాహర్‌ లాంటి ప్రధాన స్పిన్నర్‌ బౌలింగ్‌లో అతను వరుసగా నాలుగు సిక్సర్లు కొట్టడం తన నైపుణ్యాలకు నిదర్శనం.

ధనాధన్‌ ముగింపు..: యువ క్రికెటర్లు ఆయూష్‌ బదోని, జితేశ్‌ శర్మ, అభినవ్‌ మనోహర్‌ ఫినిషర్‌ పాత్రను సమర్థంగా పోషిస్తున్నారు. ఆడిన అయిదు మ్యాచ్‌ల్లో 148.61 స్ట్రైక్‌రేట్‌తో 107 పరుగులు చేసిన 22 ఏళ్ల బదోని.. లఖ్‌నవూలో కీలకంగా మారాడు. గుజరాత్‌పై అర్ధశతకంతో తన ఆగమనాన్ని ఘనంగా చాటిన అతను.. చెన్నై, దిల్లీతో మ్యాచ్‌ల్లో ఆఖరి ఓవర్లో బౌండరీలు బాది జట్టును గెలిపించాడు. ఇక పంజాబ్‌ తరపున జితేశ్‌ (3 మ్యాచ్‌ల్లో 79) ధనాధన్‌ బ్యాటింగ్‌తో క్షణాల్లో మ్యాచ్‌ స్వరూపాన్ని మార్చేస్తున్నాడు. ముంబయితో మ్యాచ్‌లో జైదేవ్‌ ఓవర్లో రెండేసి సిక్సర్లు, ఫోర్లు బాది జట్టుకు అనూహ్య స్కోరు అందించాడు. అంతకుముందు చెన్నై, గుజరాత్‌తో మ్యాచ్‌ల్లోనూ ఇలాగే చెలరేగిన ఈ ఆటగాడి స్ట్రైక్‌రేట్‌ 183.72గా ఉండడం విశేషం. మరో కొత్త జట్టు గుజరాత్‌లో అభినవ్‌ (5 మ్యాచ్‌ల్లో 94) అవకాశం వచ్చినపుడల్లా తన మెరుపు బ్యాటింగ్‌తో అదరగొడుతున్నాడు. తాజాగా రాజస్థాన్‌తో మ్యాచ్‌లో ఓ ఎండ్‌లో హార్దిక్‌ నిలబడగా.. మరోవైపు అభినవ్‌ (28 బంతుల్లో 43) భారీ షాట్లు ఆడి ఇన్నింగ్స్‌కు జెట్‌ వేగాన్ని అందించాడు. తన అరంగేట్ర మ్యాచ్‌లో చెన్నైపై చివరి ఓవర్లో రెండు ఫోర్లతో జట్టు విజయాన్ని ఖాయం చేశాడు.

వీళ్లూ ఉన్నారు..: అరంగేట్ర బౌలర్లు వికెట్ల వేటలోనూ దూసుకెళ్తున్నారు. బెంగళూరు పేసర్‌ ఆకాశ్‌దీప్‌ (5 మ్యాచ్‌ల్లో 5 వికెట్లు) మంచి వేగంతో ప్రత్యర్థి బ్యాటర్లను హడలెత్తిస్తున్నాడు. కోల్‌కతాతో మ్యాచ్‌లో మూడు వికెట్లతో రాణించిన అతను.. పరుగుల కట్టడిపై మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఇక తన తొలి మెగా టోర్నీ మ్యాచ్‌లో చెన్నైపై మంచి ప్రదర్శనతో మెరిసిన పంజాబ్‌ పేసర్‌ వైభవ్‌ అరోరా (3 మ్యాచ్‌ల్లో 3 వికెట్లు) రెండు వైపులా బంతిని స్వింగ్‌ చేయగలడు. వీళ్లే కాకుండా ముకేశ్‌ చౌదరీ (సీఎస్కే), దర్శన్‌ నాల్కండే, సాయి సుదర్శన్‌ (గుజరాత్‌), సుయాశ్‌ ప్రభుదేశాయ్‌ (బెంగళూరు) లాంటి ఆటగాళ్లూ తమ తొలి సీజన్‌లో ఆకట్టుకుంటున్నారు.

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts