Virat Kohli: దినేశ్‌ కార్తీక్‌ తన లక్ష్యాన్ని చేరుకుంటాడు: విరాట్‌ కోహ్లి

మరోసారి భారత జట్టులో చోటు దక్కించుకోవాలన్న అతడి లక్ష్యం దిశగా దినేశ్‌ కార్తీక్‌ ఆట సాగుతోందని బెంగళూరు సహచరుడు విరాట్‌ కోహ్లి అన్నాడు.

Published : 18 Apr 2022 08:00 IST

ముంబయి: మరోసారి భారత జట్టులో చోటు దక్కించుకోవాలన్న అతడి లక్ష్యం దిశగా దినేశ్‌ కార్తీక్‌ ఆట సాగుతోందని బెంగళూరు సహచరుడు విరాట్‌ కోహ్లి అన్నాడు. దిల్లీపై 34 బంతుల్లోనే 66 పరుగులు చేసి జట్టును గెలిపించిన నేపథ్యంలో కార్తీక్‌తో కలిసి మాట్లాడుతూ విరాట్‌ ఇలా అన్నాడు. ‘‘ప్రస్తుత మెగా టోర్నీలో దినేశ్‌ చెలరేగుతున్నాడు. అతడి జోరు ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నా అని నేను చెప్పను. ఎందుకంటే అతను అదే చేయబోతున్నాడు. బెంగళూరు తరఫున సత్తా చాటుతున్నందుకు కృతజ్ఞతలు. డీకే తన లక్ష్యాల దిశగా అడుగులేస్తున్నందుకు సంతోషంగా ఉంది. కేవలం బెంగళూరు వరకే కాదు.. అత్యున్నత స్థాయిలో ఆడేందుకు అతను తనను తాను బలమైన పోటీదారుగా మార్చుకుంటున్నాడు’’ అని కోహ్లి పేర్కొన్నాడు. బెంగళూరు మాజీ స్టార్‌ ఏబీ డివిలియర్స్‌ కూడా డీకే ఆట పట్ల గర్విస్తున్నట్లు విరాట్‌ తెలిపాడు. కార్తీక్‌ ఆడుతున్న తీరు పట్ల చాలా సంతోషంగా ఉన్నట్లు... తాను వదిలిన బాధ్యతను స్వీకరించి బెంగళూరుకి డీకే ఫినిషిర్‌గా మారడాన్ని టీవీలో చూస్తూ ఆస్వాదిస్తున్నట్లు ఏబీ తనతో చెప్పినట్లు విరాట్‌ తెలిపాడు. ఈ సీజన్‌లో ఇప్పటిదాకా 6 ఇన్నింగ్స్‌ల్లో 209.57 స్ట్రయిక్‌రేట్‌తో 197 పరుగులు చేసిన 36 ఏళ్ల కార్తీక్‌.. టాప్‌ స్కోరర్లలో ఒకడిగా ఉన్నాడు. 2019 వన్డే ప్రపంచకప్‌లో చివరిగా భారత్‌ తరఫున కార్తీక్‌ ఆడాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని