David Miller: మిల్లర్‌.. మెరుపు దాడి

వారెవా మిల్లర్‌! ఏం బ్యాటింగ్‌ అది. ఏం విధ్వంసం అది. దిగినప్పటి నుంచీ బాదుతూనే పోయాడు. దంచుడే దంచుడు! ప్రతికూల పరిస్థితుల్లో సంచలన ఇన్నింగ్స్‌తో దాదాపు ఒంటి చేత్తో గుజరాత్‌ను గెలిపించాడు.

Updated : 18 Apr 2022 06:51 IST

రషీద్‌ సంచలన ఇన్నింగ్స్‌
చెన్నైకి గుజరాత్‌ షాక్‌

వారెవా మిల్లర్‌! ఏం బ్యాటింగ్‌ అది. ఏం విధ్వంసం అది. దిగినప్పటి నుంచీ బాదుతూనే పోయాడు. దంచుడే దంచుడు! ప్రతికూల పరిస్థితుల్లో సంచలన ఇన్నింగ్స్‌తో దాదాపు ఒంటి చేత్తో గుజరాత్‌ను గెలిపించాడు. సిక్స్‌లు, ఫోర్ల మోత మోగిస్తూ చెన్నైకి దిమ్మతిరిగే షాకిచ్చాడు. రషీద్‌ ఖాన్‌ కూడా సంచలన బ్యాటింగ్‌తో అదరగొట్టిన వేళ.. క్లిష్ట పరిస్థితుల నుంచి కోలుకుని గుజరాత్‌ అనూహ్య విజయాన్నందుకుంది. ఆరు మ్యాచ్‌ల్లో గుజరాత్‌కు ఇది అయిదో విజయం కాగా.. అన్ని మ్యాచ్‌లే ఆడిన చెన్నై అయిదో పరాజయాన్ని చవిచూసింది.

పుణె

గుజరాత్‌ ఖాతాలో అద్భుత విజయం. మిల్లర్‌ (94 నాటౌట్‌; 51 బంతుల్లో 8×4, 6×6) పోరాటపటిమతో ఆదివారం ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో ఆ జట్టు 3 వికెట్ల తేడాతో చెన్నైని ఓడించింది. రుతురాజ్‌ గైక్వాడ్‌ (73; 48 బంతుల్లో 5×4, 5×6) చెలరేగడంతో మొదట చెన్నై 5 వికెట్లకు 169 పరుగులు చేసింది. రాయుడు (46; 31 బంతుల్లో 4×4, 2×6) రాణించాడు. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ మిల్లర్‌తో పాటు రషీద్‌ ఖాన్‌ (40; 21 బంతుల్లో 2×4, 3×6) మెరవడంతో లక్ష్యాన్ని గుజరాత్‌ 19.5 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది.

పోరాడిన మిల్లర్‌: ఛేదన ఆరంభంలోనే గుజరాత్‌కు గట్టి దెబ్బ తగిలింది. 16 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో చిక్కుకుంది. గిల్‌ (0), విజయ్‌ శంకర్‌ (0), అభినవ్‌ మనోహర్‌ (12) పెవిలియన్‌ చేరారు. అయితే మరోవైపు సాహా నిలవగా ధాటిగా బ్యాటింగ్‌ చేసిన మిల్లర్‌ పరిస్థితిని కాస్త చక్కదిద్దాడు. ఏడు ఓవర్లకు స్కోరు 45/3. తర్వాతి ఓవర్లో సాహాను జడేజా వెనక్కి పంపినా.. మిల్లర్‌ అదిరే బ్యాటింగ్‌ను కొనసాగించాడు. అలీ ఓవర్లో సిక్స్‌, జడేజా ఓవర్లో వరుసగా 6, 6, 4తో గుజరాత్‌ను గట్టిగా పోటీలో నిలిపాడు. మిల్లర్‌ 28 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. అయితే రాహుల్‌ తెవాతియా (6)ను బ్రావో త్వరగా వెనక్కి పంపాడు. మరోవైపు రషీద్‌ ఖాన్‌ నిలిచినా వేగం తగ్గడంతో గుజరాత్‌ 17 ఓవర్లలో 122/5తో నిలిచింది. చివరి 3 ఓవర్లలో 48 పరుగులు చేయాల్సిన స్థితిలో ఆ జట్టు విజయం కష్టమే అనిపించింది. కానీ అక్కడి నుంచే సునామీ మొదలైంది. గేర్‌ మార్చిన రషీద్‌ పెను విధ్వంసంతో మ్యాచ్‌ గమనాన్ని మార్చేశాడు. అతడు తన విలక్షణ బ్యాటింగ్‌తో మూడు సిక్స్‌లు, ఫోర్‌ బాదడంతో జోర్డాన్‌ ఒక్క ఓవర్లోనే 25 పరుగులు సమర్పించుకున్నాడు. కానీ తర్వాతి ఓవర్లో అతడితో పాటు జోసెఫ్‌ను ఔట్‌ చేసి 10 పరుగులు ఇచ్చిన బ్రావో మ్యాచ్‌ను ఉత్కంఠభరితంగా మార్చేశాడు. నెగ్గాలంటే చివరి ఓవర్లో గుజరాత్‌ 13 పరుగులు చేయాల్సిన పరిస్థితి. తొలి రెండు బంతులకు పరుగులేమీ రాకపోవడంతో ఉత్కంఠ పెరిగింది. కానీ మూడో బంతికి మిల్లర్‌ కళ్లు చెదిరే సిక్స్‌ కొట్టాడు. తర్వాతి బంతికి మిల్లర్‌ క్యాచ్‌ ఔట్‌ కావడంతో చెన్నై సంబరపడింది. కానీ బంతి నడుం కంటే ఎక్కువ ఎత్తులో రావడంతో అది నోబాల్‌ అయింది. తర్వాతి బంతికి ఫోర్‌ కొట్టిన మిల్లర్‌.. వెంటనే 2 పరుగులు తీసి గుజరాత్‌కు విజయాన్నందించాడు.

రాణించిన రుతురాజ్‌: ఎట్టకేలకు ఫామ్‌ను అందుకున్న ఓపెనర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ చెలరేగడంతో అంతకుముందు చెన్నై మెరుగైన స్కోరు సాధించింది. చెన్నై ఆరంభం మాత్రం పేలవం. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆ జట్టు ఆరంభంలో పరుగుల కోసం కష్టపడింది. మూడో ఓవర్లో ఓపెనర్‌ ఉతప్ప (3)ను షమి ఎల్బీగా వెనక్కి పంపేటప్పటికి స్కోరు 7 పరుగులే. నిలదొక్కుకోవడానికి సమయం తీసుకున్న రుతురాజ్‌ కొన్ని చక్కని బౌండరీలు సాదించాడు. అయితే ఆరో ఓవర్లో మొయిన్‌ అలీ (1) నిష్క్రమించేటప్పటికి స్కోరు 32 మాత్రమే. చక్కని బ్యాటింగ్‌ను కొనసాగించిన రుతురాజ్‌ వెంటనే వికెట్‌ పడినవ్వలేదు. అంబటి రాయుడుతో కలిసి ఇన్నింగ్స్‌ను నడిపించాడు. అప్పుడప్పుడు బౌండరీలు వచ్చాయి. కానీ 11వ ఓవర్‌ నుంచి ఇన్నింగ్స్‌ స్వరూపమే మారిపోయింది. స్కోరు వేగం పెరిగింది. జోసెఫ్‌ బౌలింగ్‌లో రుతురాజ్‌ డీప్‌ స్క్వేర్‌ లెగ్‌లో, రాయుడు లాంగాఫ్‌లో సిక్స్‌లు దంచడంతో స్కోరు బోర్డుకు ఊపొచ్చింది. మరింత రెచ్చిపోయిన రాయుడు రెండు ఫోర్లు, సిక్స్‌లు దంచడంతో యశ్‌ దయాల్‌ వేసిన తర్వాతి ఓవర్లో ఏకంగా 19 పరుగులొచ్చాయి. రుతురాజ్‌ కూడా తగ్గలేదు. ఫెర్గూసన్‌ బౌలింగ్‌లో వరుసగా 6 ,4 కొట్టేశాడు. 14 ఓవర్లకు స్కోరు 124/2. చెన్నై భారీ స్కోరుపై కన్నేసిన దశ. కానీ  జోరుమీదున్న భాగస్వామ్యాన్ని జోసెఫ్‌ విడదీయడంతో ఆ జట్టు దూకుడుకు కళ్లె పడ్డట్లయింది. రషీద్‌ బౌలింగ్‌లో సిక్స్‌తో జోరు మీద కనిపించి రాయుడు... జోసెఫ్‌ బౌలింగ్‌లో బ్యాట ఝుళిపించే ప్రయత్నంలో క్యాచ్‌ ఔటయ్యాడు. తర్వాతి ఓవర్లోనే రుతురాజ్‌ను యశ్‌ వెనక్కి పంపాడు. 15 నంచి 19 ఓవర్ల మధ్య చెన్నైకి 27 పరుగులే వచ్చాయి. అయితే ఫెర్గూసన్‌ వేసిన ఇన్నింగ్స్‌ చివరి ఓవర్లో జడేజా రెండు సిక్స్‌లు, దూబె ఓ ఫోర్‌ బాదడంతో చెన్నై కాస్త మెరుగైన స్కోరుతో ఇన్నింగ్స్‌ను మగించింది. ఆఖరి బంతికి దూబె రనౌటయ్యాడు. గజ్జల్లో గాయంతో కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్య మ్యాచ్‌కు దూరం కావడంతో రషీద్‌ ఖాన్‌.. గుజరాత్‌కు నాయకత్వం వహించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు