Hyderabad: రయ్‌ రయ్‌.. హైదరాబాద్‌

వరుసగా రెండు ఓటములతో సీజన్‌ను మొదలెట్టిన హైదరాబాద్‌.. ఇప్పుడు విజయాల బాటలో రయ్‌మంటూ దూసుకెళ్తోంది. ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో ప్రత్యర్థులను మట్టికరిపిస్తోంది. మరోసారి బ్యాటింగ్‌, బౌలింగ్‌లో సమష్టిగా రాణించిన ఆ జట్టు పంజాబ్‌ను చిత్తుచేసి, వరుసగా నాలుగో విజయాన్ని అందుకుంది. మొదట భారీ స్కోరు దిశగా సాగుతున్న పంజాబ్‌కు భువనేశ్వర్‌, ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ ఉమ్రాన్‌ కళ్లెం వేయగా.. ఛేదనలో మార్‌క్రమ్‌, పూరన్‌ జోడీ మరోసారి అజేయంగా నిలిచి జట్టును గెలిపించింది.

Updated : 18 Apr 2022 06:48 IST

వరుసగా నాలుగో గెలుపు
పంజాబ్‌పై విజయం
విజృంభించిన ఉమ్రాన్‌, భువనేశ్వర్‌

వరుసగా రెండు ఓటములతో సీజన్‌ను మొదలెట్టిన హైదరాబాద్‌.. ఇప్పుడు విజయాల బాటలో రయ్‌మంటూ దూసుకెళ్తోంది. ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో ప్రత్యర్థులను మట్టికరిపిస్తోంది. మరోసారి బ్యాటింగ్‌, బౌలింగ్‌లో సమష్టిగా రాణించిన ఆ జట్టు పంజాబ్‌ను చిత్తుచేసి, వరుసగా నాలుగో విజయాన్ని అందుకుంది. మొదట భారీ స్కోరు దిశగా సాగుతున్న పంజాబ్‌కు భువనేశ్వర్‌, ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ ఉమ్రాన్‌ కళ్లెం వేయగా.. ఛేదనలో మార్‌క్రమ్‌, పూరన్‌ జోడీ మరోసారి అజేయంగా నిలిచి జట్టును గెలిపించింది.

నవీ ముంబయి

హైదరాబాద్‌ ఖాతాలో మరో విజయం. ఆదివారం మ్యాచ్‌లో ఆ జట్టు 7 వికెట్ల తేడాతో పంజాబ్‌పై గెలిచింది. మొదట పంజాబ్‌ 20 ఓవర్లలో 151 పరుగులకు ఆలౌటైంది. లివింగ్‌స్టోన్‌ (60; 33 బంతుల్లో 5×4, 4×6) అర్ధశతకంతో రాణించాడు. హైదరాబాద్‌ బౌలర్లలో ఉమ్రాన్‌ మాలిక్‌ (4/28), భువనేశ్వర్‌ (3/22) చెలరేగారు. చివరి ఏడు బంతుల్లో ఒక్క పరుగూ చేయని పంజాబ్‌.. ఏకంగా అయిదు వికెట్లు కోల్పోయింది. అనంతరం ఛేదనలో హైదరాబాద్‌ 3 వికెట్లు కోల్పోయి 18.5 ఓవర్లలో లక్ష్యాన్ని చేరుకుంది. మార్‌క్రమ్‌ (41 నాటౌట్‌; 27 బంతుల్లో 4×4, 1×6), పూరన్‌ (35 నాటౌట్‌; 30 బంతుల్లో 1×4, 1×6) నాలుగో వికెట్‌కు అజేయంగా 75 పరుగులు జోడించారు. రాహుల్‌ చాహర్‌ (2/28) ఆకట్టుకున్నాడు.

ఇబ్బంది లేకుండా..: ఛేదనలో హైదరాబాద్‌కు ఆశించిన ఆరంభం దక్కకపోయినప్పటికీ ఏ దశలోనూ ఇబ్బంది మాత్రం ఎదురవలేదు. నెమ్మదిగా బ్యాటింగ్‌ ఆరంభించిన విలియమ్సన్‌ (3)ను త్వరగానే రబాడ (1/29) పెవిలియన్‌ చేర్చాడు. అభిషేక్‌ (31) మొదట్లో వేగంగా ఆడలేకపోయాడు. ఆ దశలో రాహుల్‌ త్రిపాఠి (34) బౌండరీలతో స్కోరుబోర్డు పరుగందుకుంది. అభిషేక్‌ కూడా గేరు మార్చడంతో ఇన్నింగ్స్‌ సాఫీగా సాగినట్లే కనిపించింది. కానీ చాహర్‌ వరుస ఓవర్లలో త్రిపాఠి (34), అభిషేక్‌ (31)ను ఔట్‌ చేసి ప్రత్యర్థిని దెబ్బకొట్టాడు. ఊరిస్తూ వచ్చిన బంతులను భారీ షాట్లు ఆడబోయి వీళ్లిద్దరూ వెనుదిరిగారు. దీంతో 11 ఓవర్లకు ఆ జట్టు 80/3తో నిలిచింది. అక్కడి నుంచి బౌండరీల కోసం హైదరాబాద్‌ బ్యాటర్లు.. వికెట్ల కోసం పంజాబ్‌ బౌలర్లు ప్రయత్నాలు కొనసాగించారు. ఆ దశలో మార్‌క్రమ్‌ను రనౌట్‌ చేసే మంచి అవకాశాన్ని పంజాబ్‌ చేజార్చుకుంది. సాధించాల్సిన రన్‌రేట్‌ అదుపులోనే ఉండడంతో మార్‌క్రమ్‌, పూరన్‌ పరిస్థితులకు తగ్గట్లుగా బ్యాటింగ్‌ కొనసాగించారు. విజయానికి చివరి అయిదు ఓవర్లలో 41 పరుగులు కావాల్సిన దశలో గేరు మార్చారు. 16వ ఓవర్లో 10 పరుగులు రాబట్టి ఒత్తిడి తగ్గించుకున్నారు. ఎక్కువ ఆందోళన చెందకుండా.. సింగిల్స్‌, డబుల్స్‌ సాధిస్తూనే వీలు చిక్కినపుడల్లా బౌండరీలు బాది జట్టును లక్ష్యం దిశగా నడిపించారు. చివర్లో కాస్త ఉత్కంఠ రేగినా.. మార్‌క్రమ్‌ వరుసగా ఫోర్‌, సిక్సర్‌తో మరో ఓవర్‌ మిగిలి ఉండగానే మ్యాచ్‌ ముగించాడు.

బౌలర్లు భళా..: ఆరంభంలో.. ఆఖర్లో హైదరాబాద్‌ బౌలర్ల జోరు.. మధ్యలో లివింగ్‌స్టోన్‌ మెరుపులు.. ఇదీ పంజాబ్‌ ఇన్నింగ్స్‌ సాగిన తీరు. సాధనలో గాయం కారణంగా ఈ మ్యాచ్‌కు మయాంక్‌ దూరమవడంతో.. తాత్కాలిక సారథి ధావన్‌ (8)తో కలిసి ప్రభ్‌సిమ్రాన్‌ (14) ఇన్నింగ్స్‌ ఆరంభించాడు. వీళ్లిద్దరితో పాటు బెయిర్‌స్టో (12), జితేశ్‌ (11) ఎక్కువ సేపు నిలబడకపోవడంతో 8 ఓవర్లకు ఆ జట్టు 61/4తో కష్టాల్లో పడింది. వికెట్లు పడుతున్నా మరో ఎండ్‌లో సూపర్‌ ఫామ్‌ కొనసాగిస్తూ లివింగ్‌స్టోన్‌ మొదటి నుంచే బౌండరీల వేటలో సాగాడు. జాన్సన్‌ బౌలింగ్‌లో ఫోర్‌తో ఖాతా తెరిచిన అతను.. అదే ఓవర్లో మరో ఫోర్‌, సిక్సర్‌ బాదేశాడు. షారుక్‌ (26) కూడా కొన్ని షాట్లతో అలరించాడు. లివింగ్‌స్టోన్‌ ఫోర్‌తో అర్ధశతకాన్ని అందుకున్నాడు. దీంతో 15 ఓవర్లకు స్కోరు.. 122/4. ఆ దశలో జట్టు 180కి పైగా పరుగులు చేస్తుందనిపించింది. కానీ చివరి ఓవర్లలో కట్టుదిట్టమైన బౌలింగ్‌తో, సూపర్‌ ఫీల్డింగ్‌తో హైదరాబాద్‌ బలంగా పుంజుకుంది. భువనేశ్వర్‌ తన వరుస ఓవర్లలో షారుక్‌, లివింగ్‌స్టోన్‌ను వెనక్కిపంపి ప్రత్యర్థికి షాకిచ్చాడు. కవర్స్‌లో ముందుకు డైవ్‌ చేస్తూ విలియమ్సన్‌ పట్టిన అద్భుత క్యాచ్‌కు లివింగ్‌స్టోన్‌ నిష్క్రమించాడు. ఇక ఆఖరి ఓవర్లో ఉమ్రాన్‌ హడలెత్తించాడు. మంచి వేగంతో, కచ్చితమైన లైన్‌, లెంగ్త్‌తో మూడు వికెట్లు పడగొట్టాడు. చివరి బంతికి హ్యాట్రిక్‌ సాధించేలా కనిపించాడు కానీ.. అతని ప్రయత్నాన్ని అడ్డుకున్న అర్షదీప్‌ (0) రనౌటయ్యాడు. దీంతో ఆ ఓవర్లో ఒక్క పరుగూ రాబట్టని పంజాబ్‌.. నాలుగు వికెట్లు కోల్పోయింది.


3

ఓ టీ20 మ్యాచ్‌లో ఒక్క పరుగూ జత చేయకుండా ఓ జట్టు చివరి నాలుగు వికెట్లు కోల్పోవడం ఇది మూడోసారి మాత్రమే.


4

మెగా టోర్నీలో చివరి ఓవర్‌ మెయిడిన్‌ వేసిన నాలుగో బౌలర్‌గా ఉమ్రాన్‌ మాలిక్‌ నిలిచాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని