Updated : 19 Apr 2022 07:34 IST

Corona: దిల్లీ శిబిరంలో నలుగురికి కొవిడ్‌.. ఆసుపత్రిలో చేరిన మార్ష్‌

షెడ్యూల్‌  ప్రకారమే దిల్లీ, పంజాబ్‌ మ్యాచ్‌

(Photo: Mitchell Marsh Instagram)

ఇక కరోనా భయాలేమీ లేవని, టోర్నీకి అడ్డంకులేమీ ఉండవని అనుకుంటున్న తరుణంలో లీగ్‌కు మళ్లీ మహమ్మారి ముప్పు తప్పలేదు. దిల్లీ  జట్టులో ఏకంగా నాలుగు పాజిటివ్‌ కేసులు బయటపడటం కలకలం రేపుతోంది. ఇటీవలే ఆ జట్టుతో చేరిన ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ మిచెల్‌ మార్ష్‌ కొవిడ్‌ బారిన పడి ఆసుపత్రి పాలయ్యాడు. దిల్లీ తర్వాతి మ్యాచ్‌ షెడ్యూల్‌ ప్రకారమే నిర్వహించాలని నిర్వహించినప్పటికీ.. మున్ముందు లీగ్‌లో మరిన్ని కేసులు నమోదైతే ఏంటి పరిస్థితి అన్నది ప్రశ్నార్థకంగా మారింది.

ముంబయి:  టోర్నీలో మరోసారి కరోనా కలకలం మొదలైంది. ఇప్పటికే దిల్లీ ఫిజియో ప్యాట్రిక్‌ ఫార్‌హర్ట్‌ పాజిటివ్‌గా తేలడంతో ఈ సీజన్‌లో తొలి కేసు వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా దిల్లీ బృందంలో మరో మూడు పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అందులో ఒకరు ఆస్ట్రేలియా ఆటగాడు మిచెల్‌ మార్ష్‌. సోమవారం నాటకీయ పరిణామాల మధ్య అతను ఆసుపత్రి పాలయ్యాడు. ముందుగా యాంటిజెన్‌ పరీక్షలో అతను పాజిటివ్‌గా తేలాడు. దీంతో షెడ్యూల్‌ ప్రకారం సోమవారం దిల్లీ జట్టు పుణె ప్రయాణం రద్దయింది. ఆటగాళ్లందరినీ హోటల్‌ గదుల్లో క్వారంటైన్‌లో ఉంచారు. కానీ తర్వాత నిర్వహించిన ఆర్టీపీసీఆర్‌ తొలి పరీక్షలో మార్ష్‌తో సహా అందరి ఫలితాలు నెగెటివ్‌గా రావడంతో దిల్లీ జట్టుతో పాటు టోర్నీ నిర్వాహకులు ఊపిరి పీల్చుకున్నారు. కొన్ని గంటల తర్వాత మళ్లీ కలవరం తప్పలేదు. రెండో ఆర్టీపీసీఆర్‌ పరీక్షలో మార్ష్‌కు పాజిటివ్‌ రావడంతో అతణ్ని ఐసొలేషన్‌లో ఉంచారు. కొవిడ్‌ లక్షణాలు కొంచెం ఎక్కువగానే ఉండటంతో మార్ష్‌ను ఆసుపత్రికి పంపాల్సి వచ్చింది. ‘‘మార్ష్‌ కొవిడ్‌ పాజిటివ్‌గా తేలాడు. అతణ్ని ఆసుపత్రిలో చేర్చాం. మా వైద్య బృందం అతడి పరిస్థితిని సమీక్షిస్తోంది’’ అని దిల్లీ ఓ ప్రకటనలో తెలిపింది. మార్ష్‌ కనీసం పది రోజుల పాటు మ్యాచ్‌లకు అందుబాటులో ఉండడు. మొత్తంగా దిల్లీ శిబిరంలో నాలుగు పాజిటివ్‌ కేసులు వెలుగులోకి వచ్చాయి. ప్యాట్రిక్‌, మార్ష్‌ కాకుండా జట్టు డాక్టర్‌ అభిజిత్‌ సాల్వి, మసాజర్‌ కూడా పాజిటివ్‌గా తేలినట్లు సమాచారం. మార్ష్‌ కాకుండా మిగతా ఆటగాళ్లందరికీ రెండు ఆర్టీపీసీఆర్‌ పరీక్షల్లోనూ నెగెటివ్‌యే వచ్చింది. దీంతో బుధవారం పంజాబ్‌తో దిల్లీ మ్యాచ్‌ను యధావిధిగా నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. ‘‘మార్ష్‌కు తొలి ఆర్టీపీసీఆర్‌ పరీక్షలో నెగెటివ్‌ వచ్చింది. కానీ రెండో పరీక్షలో పాజిటివ్‌ వచ్చింది. మిగతా ఆటగాళ్లందరూ రెండు పరీక్షల్లోనూ నెగెటివ్‌గా తేలారు. దిల్లీ-పంజాబ్‌ మ్యాచ్‌కు ఎలాంటి ఇబ్బంది లేదు’’ అని ఓ సీనియర్‌ బీసీసీఐ అధికారి తెలిపాడు.

ఫిజియోతో సాధన వల్లే..: గాయం నుంచి పూర్తిగా కోలుకోకుండానే మార్ష్‌ టోర్నీకోసం భారత్‌కు వచ్చిన విషయం విదితమే. ఇక్కడ ఫిజియో ప్యాట్రిక్స్‌ ఆధ్వర్యంలో అతను తిరిగి ఫిట్‌నెస్‌ సాధించేందుకు శ్రమించాడు. ప్యాట్రిక్స్‌కు వైరస్‌ సోకడం.. మార్ష్‌కు కూడా స్వల్ప లక్షణాలు కనిపించడం ఆందోళన రేకెత్తించింది. మరోవైపు టీమ్‌ మసాజర్‌కు కూడా కొన్ని వైరస్‌ లక్షణాలు కనిపించాయి. ఆర్టీపీసీఆర్‌ పరీక్షలో వీళ్లిద్దరూ పాజిటివ్‌గా తేలారు. ప్యాట్రిక్స్‌ పాజిటివ్‌ వచ్చినప్పటి నుంచి ఐసోలేషన్‌లోనే ఉన్నాడు. బీసీసీఐ నిబంధనల ప్రకారం ప్రతి అయిదు రోజులకోసారి అన్ని బృందాల్లోని సభ్యులకు వైరస్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ‘‘సోమవారం దిల్లీ జట్టు పుణెకు వెళ్లాల్సింది. కానీ ఆటగాళ్లందరినీ హోటల్‌ గదుల్లోనే క్వారంటైన్‌లో ఉండమన్నారు. మరోవైపు పుణెలోని హోటల్లో బీసీసీఐ బయో బబుల్‌ ఏర్పాటు చేసింది. పాజిటివ్‌గా తేలిన మార్ష్‌ ఐసొలేషన్‌కు వెళ్లనున్నాడు. మిగతా ఆటగాళ్లందరూ మంగళవారం పుణెకు వెళ్తారు’’ అని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. వివిధ జట్లలోని ఆటగాళ్లకు కరోనా సోకడంతో గతేడాది భారత్‌లో టోర్నీని అర్ధంతరంగా వాయిదా వేసి.. ఆ తర్వాత సెప్టెంబర్‌- అక్టోబర్‌ మధ్యలో యూఏఈలో నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సారి కూడా కొవిడ్‌ భయం మరోసారి మొదలైంది. మరోవైపు దేశవ్యాప్తంగా కొత్త పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఈ పరిణామం టోర్నీ నిర్వాహకులకు ఆందోళన కలిగించేదే.

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts