Bangalore: ఇటు ఫాఫ్‌.. అటు జోష్‌

గత సీజన్ల చేదు అనుభవాలను చెరిపేస్తూ  బెంగళూరు ఈ టోర్నీలో దూసుకెళ్తోంది. మ్యాచ్‌ ఆరంభంలో ఎదురు దెబ్బలు తగిలినా తట్టుకుని నిలబడి విజయాలు సాధిస్తున్న ఆ జట్టు.. మరోసారి అదే

Updated : 20 Apr 2022 06:44 IST

డుప్లెసిస్‌ అద్భుత ఇన్నింగ్స్‌

విజృంభించిన హేజిల్‌వుడ్‌

లఖ్‌నవూపై బెంగళూరు గెలుపు

గత సీజన్ల చేదు అనుభవాలను చెరిపేస్తూ బెంగళూరు ఈ టోర్నీలో దూసుకెళ్తోంది. మ్యాచ్‌ ఆరంభంలో ఎదురు దెబ్బలు తగిలినా తట్టుకుని నిలబడి విజయాలు సాధిస్తున్న ఆ జట్టు.. మరోసారి అదే ప్రదర్శనను పునరావృతం చేసింది. తొలి ఓవర్లోనే రెండు వికెట్లు కోల్పోయి, 8 ఓవర్లకు 65/4తో నిలిచిన ఆ జట్టు.. కెప్టెన్‌ డుప్లెసిస్‌ అద్భుత ఇన్నింగ్స్‌తో పుంజుకుని ప్రత్యర్థి ముందు 182 పరుగుల లక్ష్యాన్ని నిలిపింది. అనంతరం ఫాస్ట్‌బౌలర్‌ హేజిల్‌వుడ్‌ విజృంభించడంతో బలమైన బ్యాటింగ్‌ ఉన్న లఖ్‌నవూను కట్టడి చేసి విజయాన్నందుకుంది.

ముంబయి

టీ20లో బెంగళూరు జోరు కొనసాగుతోంది. ఏడు మ్యాచ్‌ల్లో అయిదో విజయం సాధించిన ఆ జట్టు.. పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి దూసుకెళ్లింది. మంగళవారం బెంగళూరు 18 పరుగుల తేడాతో లఖ్‌నవూను ఓడించింది. మొదట ఫాఫ్‌ డుప్లెసిస్‌ (96; 64 బంతుల్లో 11×4, 2×6) మేటి ఇన్నింగ్స్‌ ఆడడంతో బెంగళూరు 6 వికెట్లకు 181 పరుగులు చేసింది. లఖ్‌నవూ బౌలర్లలో హోల్డర్‌ (2/25), చమీర (2/31) రాణించారు. అనంతరం జోష్‌ హేజిల్‌వుడ్‌ (4/25), హర్షల్‌ పటేల్‌ (2/47) లఖ్‌నవూను కట్టడి చేశారు. ఆ జట్టు 8 వికెట్లకు 163 పరుగులే చేయగలిగింది. కృనాల్‌ పాండ్య (42; 28 బంతుల్లో 5×4, 2×6) టాప్‌స్కోరర్‌. ఏడు మ్యాచ్‌ల్లో లఖ్‌నవూకిది మూడో ఓటమి.

భాగస్వామ్యాల్లేక..: 182 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి అవసరమైన పెద్ద ఇన్నింగ్స్‌, భాగస్వామ్యాలు లఖ్‌నవూ జట్టులో నమోదు కాలేదు. ఆరంభం నుంచి ఆ జట్టు క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోతూనే సాగింది. ముఖ్యంగా హేజిల్‌వుడ్‌ కీలక సమయాల్లో వికెట్లు పడగొట్టి లఖ్‌నవూకు అవకాశం లేకుండా చేశాడు. అతను తన తొలి ఓవర్లోనే ప్రమాదకర డికాక్‌ (3)ను ఔట్‌ చేసి లఖ్‌నవూను తొలి దెబ్బ కొట్టాడు. తర్వాతి ఓవర్లో మనీష్‌ పాండే (6)ను పెవిలియన్‌ చేర్చాడు. ఈ దశలో రాహుల్‌ (30; 24 బంతుల్లో 3×4, 1×6).. బ్యాటింగ్‌ ఆర్డర్లో ముందు వచ్చిన కృనాల్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. భాగస్వామ్యం బలపడుతున్న దశలో హర్షల్‌ వేసిన వైడ్‌ బంతికి తాకీ తాకనట్లుగా రాహుల్‌ బ్యాట్‌ తాకడం, కార్తీక్‌ క్యాచ్‌ అందుకోవడంతో అతను పెవిలియన్‌ చేరాల్సి వచ్చింది. ఆర్‌సీబీ సమీక్షలో ఈ వికెట్‌ సాధించింది. కృనాల్‌ భారీ షాట్లతో స్కోరు బోర్డును ముందుకు నడిపించే ప్రయత్నం చేసినా.. దీపక్‌ హుడా (13), బదోని (13) వేగంగా ఆడలేకపోవడంతో సాధించాల్సిన రన్‌రేట్‌ పెరిగిపోయింది. కృనాల్‌ ఔటయ్యాక స్టాయినిస్‌ మీదే లఖ్‌నవూ ఆశలు నిలిచాయి. చివరి 5 ఓవర్లలో 65 పరుగులు చేయాల్సిన పరిస్థితి. ఈ దశలో స్టాయినిస్‌ (24; 15 బంతుల్లో 2×4, 1×6) కొన్ని షాట్లు ఆడి బెంగళూరును కాస్త భయపెట్టాడు. సమీకరణం 2 ఓవర్లలో 34గా మారింది. కానీ 19వ ఓవర్లో హేజిల్‌వుడ్‌ అతడి పోరాటానికి తెరదించడంతో ఆర్‌సీబీ విజయం ఖాయమైపోయింది. చివరి ఓవర్లో హోల్డర్‌ (16) రెండు సిక్సర్లు బాదినా.. అప్పటికే లఖ్‌నవూకు దారులు మూసుకపోయాయి.

ఒకే ఒక్కడు..: అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌ చేసిన బెంగళూరు.. ఇన్నింగ్స్‌ను పేలవంగా ఆరంభించినప్పటికీ, గొప్పగానే ముగించింది. అందుక్కారణం.. ఇన్నింగ్స్‌కు వెన్నెముకలా నిలిచిన కెప్టెన్‌ డుప్లెసిస్‌. చమీర (2/31) తొలి ఓవర్లో వరుస బంతుల్లో అనుజ్‌ రావత్‌ (4), కోహ్లి (0)లను ఔట్‌ చేసి బెంగళూరుకు గట్టి దెబ్బ తీశాడు. ఈ దశలో ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే బాధ్యతను డుప్లెసిస్‌ తీసుకున్నాడు. మరోవైపు మ్యాక్స్‌వెల్‌ (23; 11 బంతుల్లో 3×4, 1×6) వచ్చీ రాగానే భారీ షాట్లు ఆడి లఖ్‌నవూ బౌలర్ల లయను దెబ్బ తీయాలని చూశాడు. చమీర వేసిన మూడో ఓవర్లో అతను 4, 4, 6 బాదగా మొత్తం ఈ ఓవర్లో 19 పరుగులొచ్చాయి. ఇదే ఊపులో కృనాల్‌ పాండ్య బౌలింగ్‌లో స్విచ్‌ షాట్‌ ఆడిన మ్యాక్సీ.. హోల్డర్‌ పట్టిన అద్భుత క్యాచ్‌కు వెనుదిరిగాడు. ఫ్రీ హిట్‌ను సిక్సర్‌గా మలిచి ఊపుమీద కనిపించిన సుయాశ్‌ (10) ఎంతోసేపు నిలవకపోవడంతో బెంగళూరు 8 ఓవర్లకు 65/4తో మరింత ఇబ్బందుల్లో పడింది. ఈ దశలో 150 అయినా చేస్తుందా అనుకున్న జట్టు ఇంకో 31 పరుగులు ఎక్కువే చేసిందంటే.. ఒత్తిడిలో డుప్లెసిస్‌ సాగించిన అద్భుత పోరాటమే. ఓ ఎండ్‌లో షాబాజ్‌ (26) సహకారం అందిస్తుంటే.. మరో ఎండ్‌లో మెరుపు షాట్లు ఆడుతూ ఆర్సీబీ కెప్టెన్‌ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. 40 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకున్న డుప్లెసిస్‌.. ఆ తర్వాత మరింత చెలరేగాడు. ఇంకో 18 బంతుల్లోనే 90కి చేరుకున్నాడు. ఇంకో ఓవర్‌ మిగిలుండగా 94 పరుగులపై నిలిచిన అతను.. సెంచరీ అందుకునేలాగే కనిపించాడు. కానీ 20వ ఓవర్‌ను హోల్డర్‌ కట్టుదిట్టంగా వేశాడు. అయిదో బంతికి షాట్‌ ఆడబోయి డుప్లెసిస్‌ ఔటయ్యాడు. ఈ ఓవర్లో 4 పరుగులే వచ్చాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని