Virat Kohli: కోహ్లి నా వైపు వస్తున్నప్పుడు భయంతో చచ్చిపోయా: సూర్యకుమార్‌

బెంగళూరు మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి స్లెడ్జింగ్‌ వేరే స్థాయిలో ఉంటుందని ముంబయి బ్యాటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ తెలిపాడు. 2020 టోర్నీలో ముంబయి, బెంగళూరు మధ్య మ్యాచ్‌లో కోహ్లి

Updated : 20 Apr 2022 07:29 IST

(Photo: Surya Kumar Yadav Instagram)

ముంబయి: బెంగళూరు మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి స్లెడ్జింగ్‌ వేరే స్థాయిలో ఉంటుందని ముంబయి బ్యాటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ తెలిపాడు. 2020 టోర్నీలో ముంబయి, బెంగళూరు మధ్య మ్యాచ్‌లో కోహ్లి తన వైపు నడుస్తున్నప్పుడు పైకి ప్రశాంతంగా కనిపించినా.. లోలోపల చాలా భయపడ్డానని సూర్య గుర్తుచేసుకున్నాడు. ఆ మ్యాచ్‌లో డేల్‌ స్టెయిన్‌ విసిరిన బంతిని సూర్య ఆడాడు. బంతిని పట్టుకున్న కోహ్లి నేరుగా సూర్య వైపు నడుచుకుంటూ వెళ్లాడు. సూర్య సైతం కోహ్లి వైపు చూశాడు. స్లెడ్జింగ్‌ అక్కడితో ముగియలేదు. మొదటి స్లిప్‌లో నిల్చున్న కోహ్లి పదే పదే మాటలతో రెచ్చగొట్టాడు. 43 బంతుల్లోనే 79 పరుగులు చేసిన సూర్య.. మ్యాచ్‌లో ముంబయిని గెలిపించాడు. ‘‘కోహ్లీది ప్రత్యేకమైన శైలి. మైదానంలో అతని శక్తిసామర్థ్యాలు మరో స్థాయిలో ఉంటాయి. ఆ పోరు ఇరుజట్లకు అత్యంత కీలకం. ఆ మ్యాచ్‌లో కోహ్లి స్లెడ్జింగ్‌ వేరే స్థాయిలో ఉండింది. అయినా నేను ఏకాగ్రత కోల్పోలేదు. ఏం మాట్లాడకుండా జట్టును గెలిపించాలని అనుకున్నా. కోహ్లి నా వైపు నడుస్తున్నప్పుడు లోలోపల భయంతో చచ్చిపోయా. ‘ఏం జరిగినా ఒక్క మాట కూడా మాట్లాడొద్దు.. 10 సెకన్ల విషయమిది. తర్వాత ఓవర్‌ మొదలవుతుంది’ అంటూ నా లోపలి నుంచి ఒక స్వరం వినిపించింది. ఆ సమయంలో బ్యాటు కిందపడటం నాకు సహాయపడింది. మ్యాచ్‌ ముగిసే వరకు కోహ్లీని చూడలేదు. కిందకి చూస్తూనే బ్యాటింగ్‌ చేశా. మైదానం వెలుపుల ఆ సంఘటన గురించి మేమిద్దరం ఎప్పుడూ చర్చించుకోలేదు’’ అని సూర్య వివరించాడు.


ఐస్‌క్రీమ్‌లో బ్రెడ్‌ ముంచుకుని..

ముంబయి: సాధారణంగా బర్గర్‌ ఎలా తింటారు! కూరగాయలతోనూ లేదా మాంసాహారంతోనూ లాగిస్తారు. కానీ భారత యువ ఆటగాళ్లు ఇషాన్‌ కిషన్‌, రిషబ్‌ పంత్‌ తీరే వేరట. ఐస్‌ క్రీమ్‌లో బ్రెడ్‌ ముంచుకోవడం.. బ్రెడ్‌ మీద చాక్లెట్‌ వేసి ఆ తర్వాత సాస్‌తో టాపప్‌ చేసి తినడం లాంటి చాలా విచిత్రమైన చర్యలు చేస్తారని అంటున్నాడు సహచరుడు సూర్యకుమార్‌ యాదవ్‌. ‘‘పంత్‌, ఇషాన్‌ కలిశారంటే ఇక తిండి దోపిడీ షురూ అయినట్లే. వాళ్లిద్దరూ ఏదైనా లాగించేస్తారు. అలా ఇలా కాదు. ఐస్‌క్రీమ్‌లో బన్ను అద్దుకుని తినడ[ంతో మొదలుపెట్టి బ్రెడ్‌ మీద చాక్లెట్‌ ఐస్‌క్రీమ్‌ వేయడం.. సాస్‌ చల్లడం.. ఆపై చికెన్‌ ముక్కలు వేయడం.. ఇలా వారి తిండే చాలా భిన్నంగా ఉంటుంది. ‘నువ్వు కూడా ఇలా బర్గర్‌ తిను.. పరుగులు బాగా చేస్తావ్‌’ అని కూడా చెబుతుంటారు వాళ్లు’’ అని పంత్‌, కిషన్‌ విచిత్రమైన ఆహార అలవాట్ల గురించి ఒక యూట్యూబ్‌ ఛానెల్‌తో పంచుకున్నాడు సూర్య.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని