Mike Tyson: విమానంలో ప్రయాణికుడిపై టైసన్‌ పంచ్‌లు

రింగ్‌లో ప్రత్యర్థులపై పంచ్‌లు విసిరి దిగ్గజ బాక్సర్‌గా ఎదిగిన మైక్‌ టైసన్‌ తాజాగా విమానంలో తోటి ప్రయాణికుడికి తన దెబ్బ రుచి చూపాడు. అతని ముఖంపై పంచ్‌లతో విరుచుకుపడ్డాడు.

Updated : 23 Apr 2022 09:32 IST

శాన్‌ఫ్రాన్సిస్కో: రింగ్‌లో ప్రత్యర్థులపై పంచ్‌లు విసిరి దిగ్గజ బాక్సర్‌గా ఎదిగిన మైక్‌ టైసన్‌ తాజాగా విమానంలో తోటి ప్రయాణికుడికి తన దెబ్బ రుచి చూపాడు. అతని ముఖంపై పంచ్‌లతో విరుచుకుపడ్డాడు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు అంతర్జాలంలో చక్కర్లు కొడుతోంది. శాన్‌ఫ్రాన్సిస్కో అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఫ్లోరిడా వెళ్లే విమానంలో ఈ ఘటన జరిగింది. తన వెనకాల సీట్లో కుర్చున్న ఓ వ్యక్తి.. టైసన్‌ను మాటలతో వేధించడంతో పాటు నీళ్ల సీసాను అతనిపైకి విసిరినట్లు సమాచారం. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన టైసన్‌ పిడిగుద్దులు కురిపించినట్లు ఆ వీడియోలో కనిపించింది. ఆ పంచ్‌ల ధాటికి అతని ముఖం నుంచి రక్తం వచ్చింది. ‘‘దురదృష్టవశాత్తూ.. టైసన్‌ వెనక సీట్లోని గుర్తు తెలియని వ్యక్తి అతణ్ని వేధించాడు. అతనిపై నీళ్లసీసాను విసిరాడు’’ అని టైసన్‌ ప్రతినిధులు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనపై దర్యాప్తు జరుపుతున్నారు. ఆ ఇద్దరినీ అదుపులోకి తీసుకుని విచారించి తర్వాత విడిచిపెట్టారు. ఆ సమయంలో విమానంలో ఉన్న సారా బుర్చ్‌ఫీల్డ్‌.. టైసన్‌ చేతిలో దెబ్బలు తిన్న వ్యక్తిని ముందుగా విమానాశ్రయంలోని బార్‌లో చూశానని చెప్పింది. అతను తాగి ఉన్నాడని, బిగ్గరగా అరుస్తూ గోల చేశాడని తెలిపింది. విమానంలో మొదట టైసన్‌, ఆ వ్యక్తి మాట్లాడుకున్నారని.. ఆ తర్వాత కాసేపటికే ఇద్దరి మధ్య గొడవ జరిగిందని వెల్లడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు