Dhoni: ధోని ఆట చూస్తూ అరుస్తూనే ఉన్నా

ఒకప్పటి ధోనీని గుర్తుకు తెస్తూ.. తనలోని ఫినిషర్‌ను మరోసారి బయటకు తీస్తూ.. ముంబయిపై మహీ చెలరేగి ఆఖరి బంతికి ఫోర్‌తో విజయాన్ని అందించడంతో సామాజిక మాధ్యమాల్లో అతని

Updated : 23 Apr 2022 09:33 IST

ముంబయి: ఒకప్పటి ధోనీని గుర్తుకు తెస్తూ.. తనలోని ఫినిషర్‌ను మరోసారి బయటకు తీస్తూ.. ముంబయిపై మహీ చెలరేగి ఆఖరి బంతికి ఫోర్‌తో విజయాన్ని అందించడంతో సామాజిక మాధ్యమాల్లో అతని గురించి పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే చెన్నై మాజీ ఆటగాడు షేన్‌ వాట్సన్‌.. ధోనీపై ప్రశంసలు కురిపించాడు. ‘‘జైదేవ్‌ వేసిన చివరి ఓవర్లో ధోని చెలరేగుతుంటే మజా వచ్చింది. నా మంచంపై నుంచి టీవీలో మ్యాచ్‌ చూస్తూ అతను బౌండరీలు కొడుతుంటే అరుస్తూనే ఉన్నా. అదో ప్రత్యేకమైన మ్యాచ్‌. తీవ్ర ఒత్తిడిలోనూ మహీ ప్రశాంతంగా ఉన్నాడు. కానీ నేను అలా ఉండలేకపోయా’’ అని ప్రస్తుతం దిల్లీ సహాయక కోచ్‌గా ఉన్న వాట్సన్‌ తెలిపాడు. అంతే కాకుండా చెన్నైకు ఆడుతున్న సమయంలో ధోని అసహనానికి గురి కావడం ఒకసారి చూశానని అతను వెల్లడించాడు.  ‘‘ధోనీకి కోపం వస్తుందా? చిరాకు వేస్తుందా? లాంటి విషయాల గురించి అందరూ మాట్లాడుకుంటారు. అయితే ఒకసారి అతను అసహనానికి గురి కావడం చూశా. 2019 ఫైనల్లో ముంబయి చేతిలో చెన్నై ఓటమితో తనకు కోపం వచ్చింది. తన కిట్‌ బ్యాగ్‌ను తన్నాడు. అది కూడా కాసేపే’’ అని వాట్సన్‌ పేర్కొన్నాడు.

ధోని దాహం తీరలేదు: జడేజా
ధోని ఇంకా పరుగుల దాహంతో ఉన్నాడని చెన్నై కెప్టెన్‌ రవీంద్ర జడేజా తెలిపాడు. గురువారం ముంబయిపై మెరుపు ఇన్నింగ్స్‌తో చెన్నైకి విజయాన్ని అందించిన ధోనీపై జడేజా ప్రశంసల వర్షం కురిపించాడు. ‘‘ధోనిలో ఇప్పటికీ పరుగులు, విజయాల దాహం తీరకపోవడం గొప్ప విషయం. అతనిలో వాడి ఏమాత్రం తగ్గలేదు. డగౌట్‌లో మేమంతా ప్రశాంతంగా ఉన్నాం. ఆఖరి ఓవర్‌ వరకు ధోని క్రీజులో ఉంటే తప్పకుండా మ్యాచ్‌ గెలిపిస్తాడని తెలుసు. కొంచెం ఒత్తిడి అనిపించినా ధోనీపై నమ్మకంతో ఉన్నాం. అతను మ్యాచ్‌ను ముగించే వస్తాడని అనుకున్నాం’’ అని జడేజా వివరించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని