Punjab: పంజాబ్‌ బల్లే బల్లే.. రాయుడు పోరాడినా చెన్నైకి తప్పని ఓటమి

రాయుడు పోరాటం సరిపోలేదు.. ఆఖర్లో ధోని మెరుపులు కనిపించలేదు.. ప్లేఆఫ్స్‌ రేసులో ఇప్పటికే వెనకున్న డిఫెండింగ్‌ ఛాంపియన్‌ చెన్నై మరో పరాజయంతో అవకాశాలను మరింత సంక్లిష్టం చేసుకుంది. అదే సమయంలో పంజాబ్‌ తన పరిస్థితిని మెరుగుపర్చుకుంది.

Updated : 26 Apr 2022 06:45 IST

మెరిసిన ధావన్‌, రబాడ

రాయుడు పోరాటం సరిపోలేదు.. ఆఖర్లో ధోని మెరుపులు కనిపించలేదు.. ప్లేఆఫ్స్‌ రేసులో ఇప్పటికే వెనకున్న డిఫెండింగ్‌ ఛాంపియన్‌ చెన్నై మరో పరాజయంతో అవకాశాలను మరింత సంక్లిష్టం చేసుకుంది. అదే సమయంలో పంజాబ్‌ తన పరిస్థితిని మెరుగుపర్చుకుంది. శిఖర్‌ ధావన్‌ సూపర్‌ ఇన్నింగ్స్‌కు రబాడ, అర్ష్‌దీప్‌ అద్భుతమైన బౌలింగ్‌ తోడవడంతో ఆసక్తికరంగా సాగిన మ్యాచ్‌లో చెన్నైను ఓడించింది. టోర్నీలో పంజాబ్‌కు ఇది నాలుగో విజయం.

ముంబయి

పంజాబ్‌ అదరహో. ఆల్‌రౌండ్‌ ఆధిపత్యాన్ని ప్రదర్శించిన ఆ జట్టు సోమవారం 11 పరుగుల తేడాతో చెన్నైపై గెలిచింది. శిఖర్‌ ధావన్‌ (88 నాటౌట్‌; 59 బంతుల్లో 9×4, 2×6) చెలరేగడంతో మొదట పంజాబ్‌ 4 వికెట్లకు 187 పరుగులు చేసింది. రబాడ (2/23), అర్ష్‌దీప్‌ సింగ్‌ (1/23) గొప్పగా బౌలింగ్‌ చేయడంతో ఛేదనలో చెన్నై 6 వికెట్లకు 176 పరుగులే చేయగలిగింది. రిషి ధావన్‌ (2/39) కూడా బంతితో రాణించాడు. రాయుడు (78; 39 బంతుల్లో 7×4, 6×6) మెరుపు బ్యాటింగ్‌తో అద్భుతంగా పోరాడినా ఫలితం లేకపోయింది.

రాయుడు పోరాడినా..: చెన్నై ఛేదన పేలవంగా ఆరంభమైంది. ఏడు ఓవర్లలో 40 పరుగులకే ఉతప్ప (1), శాంట్నర్‌ (9), దూబె (8) వికెట్లు కోల్పోయి చిక్కుల్లో పడింది. ఆ దశలో చెన్నైని రుతురాజ్‌ (30; 27 బంతుల్లో 4×4), రాయుడు ఆదుకున్నారు. రుతురాజ్‌ ధాటిగా ఆడలేకపోయినా.. రాయుడు బ్యాట్‌ ఝుళిపించాడు. రిషి బౌలింగ్‌లో ఫోర్‌, సిక్స్‌ కొట్టిన అతడు...లివింగ్‌స్టోన్‌ ఓవర్లోనూ ఓ ఫోర్‌, సిక్స్‌ దంచేశాడు. రుతురాజ్‌, రాయుడు కుదురుకున్న నేపథ్యంలో..12 ఓవర్లలో 84/3తో చెన్నై కాస్త పోటీలో నిలిచింది. కానీ సాధించాల్సిన రన్‌రేట్‌ ఎక్కువే. తర్వాతి ఓవర్లో రుతురాజ్‌ను ఔట్‌ చేసిన రబాడ 49 పరుగుల నాలుగో వికెట్‌ భాగస్వామ్యాన్ని విడదీశాడు. అయితే రాయుడు దూకుడు కొనసాగించాడు. చెన్నై ఆశలు చావకుండా ధనాధన్‌ షాట్లతో ఇన్నింగ్స్‌ను నడిపించాడు. సందీప్‌ ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు కొట్టిన అతడు.. రాహుల్‌ చాహర్‌ ఓవర్లో ఓ ఫోర్‌, సిక్స్‌ దంచాడు. అయినా చివరి అయిదు ఓవర్లలో 70 పరుగులు చేయాల్సిన స్థితిలో చెన్నైకి సమీకరణం చాలా కష్టంగానే ఉంది. కానీ ఆ దశలో రాయుడు కళ్లు చెదిరే షాట్లతో విరుచుకుపడ్డాడు. సందీప్‌ బౌలింగ్‌లో వరుసగా 6, 6, 6, 4 దంచేసి మ్యాచ్‌ను రసవత్తరంగా మార్చేశాడు. చెన్నైకి మంచి అవకాశాలు ఉన్న దశ అది. కానీ ఆఖరి మూడు ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్‌ చేసిన పంజాబ్‌ బౌలర్లు తమ జట్టును విజయపథంలో నడిపించారు.  17వ ఓవర్లో అర్ష్‌దీప్‌ కేవలం 6 పరుగులే ఇవ్వగా.. తర్వాతి ఓవర్లో రబాడ ఆరు పరుగులే ఇచ్చి ప్రమాదకర రాయుడును ఔట్‌ చేయడంతో చెన్నై అవకాశాలు సన్నగిల్లాయి. జడేజా, ధోనీలను స్వేచ్ఛగా ఆడినవ్వని అర్ష్‌దీప్‌ 19వ ఓవర్లో ఎనిమిదే పరుగులిచ్చాడు. ఆఖరి ఓవర్లో చెన్నైకి 27 పరుగులు అవసరం కాగా తొలి రెండు బంతుల్లో ఏడు పరుగులిచ్చిన రిషి.. మూడో బంతికి ధోనీని ఔట్‌ చేయడంతో పంజాబ్‌ విజయం ఖాయమైంది.

మెరిసిన ధావన్‌: 187.. అంతకుముందు పంజాబ్‌కు ఇది ఊహించని స్కోరే. ఇన్నింగ్స్‌ సగం ముగిసే సరికి పరుగుల వేటలో వెనుకబడ్డ ఆ జట్టు.. ఆ తర్వాత వేగం పెంచి, ఆఖర్లో మరింత విరుచుకుపడి మెరుగైన స్కోరుతో ముగించింది. ఓపెనర్‌ ధావన్‌ కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. అయితే అతడితో పాటు మరో ఓపెనర్‌ మయాంక్‌ (18; 21 బంతుల్లో 2×4) ధాటిగా ఆడలేకపోవడంతో పంజాబ్‌కు మంచి ఆరంభం దక్కలేదు. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆ జట్టును చెన్నై బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్‌తో కట్టడి చేశారు. ఆరో ఓవర్లో మయాంక్‌ను తీక్షణ ఔట్‌ చేసేటప్పటికి స్కోరు 37 మాత్రమే. తీక్షణతోపాటు ముకేశ్‌  చౌదరి, శాంట్నర్‌ బ్యాట్స్‌మెన్‌ను స్వేచ్ఛగా బ్యాటింగ్‌ చేయనివ్వలేదు. ధావన్‌కు తోడుగా భానుక రాజపక్స (42) నిలిచినా.. బౌండరీలు కొరవడడంతో స్కోరు వేగంగా రాలేదు. అయితే ఇద్దరూ సింగిల్స్‌ ఎక్కువగా తీశారు. చేతుల్లో పడ్డ క్యాచ్‌ను శాంట్నర్‌ వదిలేయడంతో రాజపక్స బతికిపోయాడు. 11 ఓవర్లకు స్కోరు 78/1. అయితే దూకుడు పెంచిన ధావన్‌ ముకేశ్‌ ఓవర్లో మూడు ఫోర్లు బాదడంతో స్కోరు బోర్డు ఊపందుకుంది. రాజపక్స సిక్స్‌, ధావన్‌ ఫోర్‌ కొట్టడంతో ప్రిటోరియస్‌ ఓవర్లో 14 పరుగులొచ్చాయి. బ్రావో ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు సాధించిన ధావన్‌.. ముకేశ్‌ బౌలింగ్‌లోనూ ఓ బంతిని బౌండరీ దాటించాడు. పంజాబ్‌ 17 ఓవర్లకు 145/1తో నిలిచింది. 18వ ఓవర్లో కేవలం 7 పరుగులే ఇచ్చిన బ్రావో.. రాజపక్సను ఔట్‌ చేయడంతో 110 పరుగుల రెండో వికెట్‌ భాగస్వామ్యానికి తెరపడింది. లివింగ్‌స్టోన్‌ (19; 7 బంతుల్లో 1×4, 2×6) కాసేపే ఉన్నా.. మెరుపు బ్యాటింగ్‌తో తన జట్టుకు విలువైన పరుగులు అందించాడు. అతడు వరుసగా 4, 6, 6.. ధావన్‌ ఓ ఫోర్‌ బాదడంతో 19వ ఓవర్లో ప్రిటోరియస్‌ 22 పరుగులు సమర్పించుకున్నాడు. చివరి ఓవర్లో తొలి బంతికి లివింగ్‌ స్టోన్‌ ఔట్‌ కాగా.. శిఖర్‌ ఓ సిక్స్‌,  బెయిర్‌ స్టో ఓ ఫోర్‌ కొట్టారు. ఆఖరి బంతికి బెయిర్‌స్టో రనౌటయ్యాడు. చివరి 5 ఓవర్లలో పంజాబ్‌ 64 పరుగులు రాబట్టింది.


రిషి.. ముఖ కవచంతో

పంజాబ్‌ బౌలర్‌ రిషి ధావన్‌ ఇలా ముఖానికి కవచం పెట్టుకుని బౌలింగ్‌ చేశాడు. అందుకు ఓ కారణం ఉంది. ఈ ఏడాది రంజీ ట్రోఫీ ఆడుతుండగా ముక్కుకు గాయం కావడంతో అతడికి శస్త్ర చికిత్స జరిగింది. దీంతో రెండే మ్యాచ్‌లు ఆడగలిగాడు. ఈ నేపథ్యంలో అయిదేళ్ల తర్వాత టీ20 బరిలో దిగిన అతడు మరో గాయం కాకుండా ఉండడం కోసం ప్రత్యేకమైన ముఖ కవచం ధరించాడు. ఇప్పటి వరకు పంజాబ్‌ తరఫున నాలుగు టీ20 సీజన్లు (2013-2016) ఆడిన రిషిని మెగా వేలంలో రూ.55 లక్షలు పెట్టి అదే జట్టు తిరిగి దక్కించుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని