Harshal Patel: అప్పుడు అత్తరు దుకాణంలో పని చేశా.. 2017లో మధ్యలోనే ఇంటికి పంపారు: హర్షల్ పటేల్‌

గత టీ20 సీజన్లో అద్భుత ప్రదర్శనతో అత్యధిక వికెట్ల వీరుడిగా నిలిచిన పేసర్‌ హర్షల్‌ పటేల్‌.. టీనేజీలో అమెరికాలో అత్తరు దుకాణంలో పని చేశాడట. ఆ విషయాన్ని స్వయంగా అతనే బయటపెట్టాడు.

Updated : 28 Apr 2022 06:57 IST

ముంబయి: గత టీ20 సీజన్లో అద్భుత ప్రదర్శనతో అత్యధిక వికెట్ల వీరుడిగా నిలిచిన పేసర్‌ హర్షల్‌ పటేల్‌.. టీనేజీలో అమెరికాలో అత్తరు దుకాణంలో పని చేశాడట. ఆ విషయాన్ని స్వయంగా అతనే బయటపెట్టాడు. తన 17 ఏళ్ల వయసులో అతని కుటుంబం యుఎస్‌కు వలస వెళ్లింది. ‘‘న్యూజెర్సీలోని ఎలిజబెత్‌లో పాకిస్థాన్‌ వ్యక్తికి చెందిన అత్తరు దుకాణంలో పని చేసేవాణ్ని. అప్పటివరకూ గుజరాతీ మీడియంలో చదువుకోవడంతో ఆంగ్లం వచ్చేది కాదు. స్థానికంగా ఉండే వాళ్లతో మాట్లాడి ఆ భాష నేర్చుకున్నా. దాదాపు 12 నుంచి 13 గంటల పాటు కష్టపడితే రోజుకు 35 డాలర్లు (ఇప్పటి లెక్కల్లో రూ.2,679) వచ్చేవి. అక్కడ జూనియర్‌ క్రికెట్‌ ఆడేవాణ్ని. బౌలింగ్‌లో వేగం చూసి ప్రోత్సహించాలనే ఉద్దేశంతో నా తల్లిదండ్రులు గుజరాత్‌లో వదిలి వెళ్లారు. మొతెరాలో సాధన చేసేవాణ్ని. అక్కడ ఉండే ఓ దుకాణంలో తక్కువ ధరకు వచ్చే శాండ్‌విచ్‌ తిని ప్రాక్టీస్‌ కొనసాగించేవాణ్ని. 2018 టీ20 వేలానికంటే ముందు మూణ్నాలుగు జట్లు నన్ను కొనుగోలు చేస్తాయని చెప్పాయి. కానీ వేలంలో అవి ముందుకు రాలేదు. దీంతో వెన్నుపోటు పొడిచారనిపించింది. అప్పుడు నిరాశలో మునిగిపోయిన నాకు సోదరుడి మాటలు స్ఫూర్తి కలిగించాయి. నా నైపుణ్యాలు మెరుగుపర్చుకుంటే వేలంలో కొనుగోలు చేస్తారనే ఆత్మవిశ్వాసాన్ని కలిగించాడు. అప్పుడే నా విలువ పెంచుకోవాలని నిర్ణయించుకున్నా. ఇప్పుడు బెంగళూరు నా కోసం రూ.10.75 కోట్లు పెట్టడం సంతోషమే. డబ్బు కంటే కూడా అది అందించే విలువ నాకు ముఖ్యం. నాకా అర్హత ఉందని అప్పుడు కోహ్లి సందేశం పంపించాడు. నాకు కావాల్సిన స్వేచ్ఛ దిశగా సాగేందుకు డబ్బు ఓ సాధనం మాత్రమే’’ అని హర్షల్‌ పేర్కొన్నాడు.

మధ్యలోనే పంపించారు..: 2017టీ20  సీజన్‌లో తనను మధ్యలోనే ఇంటికి పంపించారని హర్షల్‌ తెలిపాడు. ‘‘2016లో అయిదు మ్యాచ్‌లే ఆడా. 2017లోనూ అలాంటి పరిస్థితే ఎదురైంది. పైగా నన్ను మధ్యలోనే ఇంటికి పంపించారు. ఆడించని ఓ ఆటగాడిని జట్టుతో ఉంచుకుంటే హోటల్‌ గది, రోజువారీ భత్యాలు, విమాన టికెట్లు, ప్రాక్టీస్‌కు తీసుకెళ్లడం.. ఇలా ఎంతో ఖర్చు, ప్రయాస ఉంటుంది. అందుకే.. కనీసం నాలుగైదు మ్యాచ్‌ల వరకూ  ఆడించే అవకాశం లేదని, ఇంటికి పంపిస్తున్నామని వెటోరి చెప్పాడు. అది నన్ను తిరస్కరించడమే. నాలుగైదు మ్యాచ్‌ల తర్వాత బెంగళూరు ప్లేఆఫ్స్‌కు చేరదని తేలిపోయింది. అందుకే ఒక మ్యాచ్‌లో ఆడే అవకాశం ఇవ్వాలని వెటోరీకి సందేశం పంపించా. చివరి మ్యాచ్‌ కోసం పిలిచారు. మూడు వికెట్లతో జట్టును గెలిపించి ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’గా నిలిచా’’ అని హర్షల్‌ తెలిపాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని