Lucknow: లఖ్‌నవూ సూపర్‌.. పంజాబ్‌కు అయిదో ఓటమి

టాస్‌ గెలిచిన జట్టు బౌలింగ్‌ ఎంచుకోవడం.. చిన్న లక్ష్యాలైతే అలవోకగా, పెద్దవైతే కొంచెం కష్టపడి ఛేదించేయడం.. ఈ  సీజన్‌లో ఎక్కువగా జరుగుతున్నది ఇదే. 200 లక్ష్యాలను కాపాడుకోవడం

Updated : 30 Apr 2022 06:45 IST

ఆరో విజయంతో మూడో స్థానానికి

153 పరుగులను కాపాడుకున్న బౌలర్లు

టాస్‌ గెలిచిన జట్టు బౌలింగ్‌ ఎంచుకోవడం.. చిన్న లక్ష్యాలైతే అలవోకగా, పెద్దవైతే కొంచెం కష్టపడి ఛేదించేయడం.. ఈ  సీజన్‌లో ఎక్కువగా జరుగుతున్నది ఇదే. 200 లక్ష్యాలను కాపాడుకోవడం కూడా కష్టమైపోయిన తరుణంలో.. లఖ్‌నవూ సూపర్‌జెయింట్స్‌ 154 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించి కూడా పంజాబ్‌పై విజయం సాధించింది. బౌలర్లు సమష్టిగా చెలరేగడంతో ఆ జట్టు ఆరో విజయంతో పట్టికలో మూడో స్థానానికి ఎగబాకింది.

పుణె

బ్యాట్స్‌మెన్‌ చేతులెత్తేసినా.. బౌలర్లు సమష్టిగా సత్తా చాటడంతో లఖ్‌నవూ స్ఫూర్తిదాయక విజయం నమోదు చేసింది. శుక్రవారం ఆ జట్టు 20 పరుగుల తేడాతో పంజాబ్‌ను ఓడించింది. మొదట రబాడ (4/38), రాహుల్‌ చాహర్‌ (2/30)ల ధాటికి లఖ్‌నవూ 8 వికెట్లకు 153 పరుగులే చేయగలిగింది. డికాక్‌ (46; 37 బంతుల్లో 4×4, 2×6), దీపక్‌ హుడా (34; 28 బంతుల్లో 1×4, 2×6) మినహా బ్యాట్స్‌మెన్‌ విఫలమయ్యారు. అనంతరం మోసిన్‌ ఖాన్‌ (3/24), కృనాల్‌ పాండ్య (2/11), చమీర (2/17) సత్తా చాటడంతో పంజాబ్‌ 8 వికెట్లకు 133 పరుగులే చేయగలిగింది. బెయిర్‌స్టో (32; 28 బంతుల్లో 5×4) టాప్‌స్కోరర్‌. 9 మ్యాచ్‌ల్లో పంజాబ్‌కిది అయిదో ఓటమి.

మెరుపులతో మొదలై..: పంజాబ్‌ ఛేదన మొదలైన తీరు చూస్తే ఆ జట్టు సునాయాసంగా గెలిచేస్తుందనిపించింది. కెప్టెన్‌ మయాంక్‌ అగర్వాల్‌ (25; 17 బంతుల్లో 2×4, 2×6) దూకుడుగా ఆడి ఇన్నింగ్స్‌కు మంచి ఆరంభాన్నిచ్చాడు. కానీ మంచి ఊపుమీదున్న అతణ్ని అయిదో ఓవర్లో చమీర ఔట్‌ చేయడంతో కథ మారిపోయింది. ఇక్కడి నుంచి ఏ దశలోనూ వికెట్ల పతనం ఆగలేదు. మధ్య ఓవర్లలో స్పిన్నర్లు రవి బిష్ణోయ్‌, కృనాల్‌ పాండ్య పంజాబ్‌ను గట్టి దెబ్బే తీశారు. పరుగులు చేయడానికి చాలా ఇబ్బంది పడుతున్న ధావన్‌ (5)ను బిష్ణోయ్‌ బౌల్డ్‌ చేయగా, ఎంతో కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేసిన కృనాల్‌.. రాజపక్స (9), జితేశ్‌ శర్మ (2)లను పెవిలియన్‌ బాట పట్టించాడు. రెండు సిక్సర్లు బాది లఖ్‌నవూను కంగారు పెట్టిన లివింగ్‌స్టోన్‌ (18)ను మోసిన్‌ ఖాన్‌ ఔట్‌ చేయడంతో పంజాబ్‌ అవకాశాలు సంక్లిష్టమయ్యాయి. 5 ఓవర్లలో 51 పరుగులు చేయాల్సిన స్థితిలో చమీర బౌలింగ్‌లో బెయిర్‌స్టో వెనుదిరగడంతో పంజాబ్‌ ఆశలకు తెరపడింది.

అతి కష్టం మీద..: అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌ చేసిన లఖ్‌నవూకు.. భారీ స్కోరు చేసే అవకాశం వచ్చినా ఉపయోగించుకోలేకపోయింది. ఫామ్‌లో ఉన్న కెప్టెన్‌ రాహుల్‌ (6)ను రబాడ ఆరంభంలోనే ఔట్‌ చేసినా.. డికాక్‌, దీపక్‌ హుడా నిలకడగా ఆడి ఇన్నింగ్స్‌ను నిర్మించారు. 10 ఓవర్లకు స్కోరు 67/1 కాగా.. వికెట్లు చేతిలో ఉండడంతో క్రీజులో కుదురుకున్న డికాక్‌, దీపక్‌ దూకుడు పెంచారు. 13.1 ఓవర్లకు ఆ జట్టు 100 దాటింది. అప్పటికే డికాక్‌ ఔటైనప్పటికీ.. దీపక్‌కు తోడు కృనాల్‌, స్టాయినిస్‌, బదోని, హోల్డర్‌ లాంటి హిట్టర్లుండడంతో సూపర్‌ జెయింట్స్‌ భారీ స్కోరు చేస్తుందనిపించింది. కానీ హుడా రనౌటైపోవడం.. కృనాల్‌ (7), స్టాయినిస్‌ (1), బదోని (4) ఇలా వచ్చి అలా వెళ్లిపోవడంతో ఇన్నింగ్స్‌ గాడి తప్పింది. టెయిలెండర్లు హోల్డర్‌ (11), చమీర (17), మోసిన్‌ (13) తలో చేయి వేయడంతో లఖ్‌నవూ కష్టం మీద 150 దాటగలిగింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని