Virat Kohli - Rohit Sharma: వీళ్లిద్దరికి ఏమైంది?

అంతర్జాతీయ క్రికెట్లో ఆ ఇద్దరూ అత్యుత్తమ ఆటగాళ్లే. ఫార్మాట్‌తో సంబంధం లేకుండా అద్భుత ప్రదర్శనతో పరుగుల యంత్రంగా, ఛేదన రారాజుగా పేరు గడించిన ఆటగాడు ఒకరు. పరిమిత ఓవర్ల

Updated : 30 Apr 2022 07:05 IST

అంతర్జాతీయ క్రికెట్లో ఆ ఇద్దరూ అత్యుత్తమ ఆటగాళ్లే. ఫార్మాట్‌తో సంబంధం లేకుండా అద్భుత ప్రదర్శనతో పరుగుల యంత్రంగా, ఛేదన రారాజుగా పేరు గడించిన ఆటగాడు ఒకరు. పరిమిత ఓవర్ల క్రికెట్లో ప్రపంచ మేటి బ్యాట్స్‌మెన్‌లో ఒకడిగా ఎదిగి, ఇప్పుడు టెస్టుల్లోనూ సత్తాచాటుతూ, అన్ని ఫార్మాట్లలో టీమ్‌ఇండియాను నడిపిస్తున్న క్రికెటర్‌ మరొకరు.  టీ20 మెగా లీగ్‌ చరిత్రలోనే 6411 పరుగులతో అగ్రస్థానం ఒకరిది.. 5764 పరుగులతో మూడో స్థానం మరొకరిది. ఈ ఉపోద్ఘాతం విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మల గురించే అని భారత క్రికెట్‌ అభిమానులకు అర్థమై ఉంటుంది. కానీ ఇప్పుడు.. 8 మ్యాచ్‌ల్లో 19.13 సగటుతో 153 పరుగులు, 9 మ్యాచ్‌ల్లో 16 సగటుతో 128 పరుగులు.. ఇవీ వరుసగా ఈ సీజన్‌లో రోహిత్‌, కోహ్లీల గణాంకాలు. పరుగుల వరద పారించే, అలవోకగా భారీ ఇన్నింగ్స్‌ ఆడే ఈ ఆటగాళ్లకు ఏమైంది? ఈ వైఫల్యానికి కారణమేంటి?

ఈనాడు క్రీడావిభాగం

విరాట్‌, రోహిత్‌.. టీమ్‌ఇండియాకు ఎన్నో ఏళ్ల నుంచి మూల స్తంభాల్లా ఉంటున్నారు.  టీ20 మెగా లీగ్‌ విషయానికి వస్తే ముంబయికి    రోహిత్‌,  బెంగళూరుకు కోహ్లి కీలక ఆటగాళ్లు. నిలకడగా రాణిస్తూ తమ జట్లకు విజయాలు అందించే ఈ ఆటగాళ్లు ఈ సీజన్‌లో దారుణంగా విఫలమవుతున్నారు. క్రీజులో నిలబడడమే కష్టమన్నట్లు.. పరుగులు చేయడం అలవాటు లేని పని అన్నట్లు.. పెవిలియన్‌ చేరిపోతున్నారు. ఈ వైఫల్యం వారి జట్ల మీద బాగానే ప్రభావం చూపుతోంది. అందులోనూ కోహ్లి రెండంకెల స్కోర్లు చేయడానికి కూడా ఆపసోపాలు పడిపోతుండటం, వరుసగా రెండు మ్యాచ్‌ల్లో గోల్డెన్‌ డక్‌ కావడం అభిమానులకు పెద్ద షాక్‌. అతను ఏ ఫార్మాట్లో అయినా సెంచరీ చేసి రెండున్నరేళ్లవుతోంది. అయితే ఇన్నాళ్లూ సెంచరీ కోసం చూసిన అభిమానులు.. ఇప్పుడు కాస్త నిలబడి 30-40 పరుగులైనా చేస్తే చాలన్నట్లు చూస్తున్నారు. ఇక రోహిత్‌ సైతం పెద్ద ఇన్నింగ్స్‌ ఆడలేక బాగా ఇబ్బంది పడుతున్నాడు. తొలి విజయం కోసం నిరీక్షిస్తున్న ముంబయిని ముందుండి నడిపించాల్సిన రోహిత్‌.. తనే ఘోరంగా విఫలమవుతుండటం అతడి అభిమానులకు రుచించడం లేదు. వీళ్లిద్దరి పేలవ ఫామ్‌ టీ20 మెగా లీగ్‌ దాటి భారత జట్టుకు ఆడుతున్నప్పుడూ కొనసాగితే ఏమిటన్నదే ఇప్పుడు రేకెత్తుతున్న ప్రశ్న. ఇంకొన్ని నెలల్లోనే భారత్‌ టీ20 ప్రపంచకప్‌ ఆడాల్సి ఉంది. ఈసారైనా కప్పు గెలిపిస్తారని వీళ్లిద్దరి మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటే.. పేలవ ప్రదర్శనతో ఆందోళన రేకెత్తిస్తున్నారు. మరోవైపు టెస్టు జట్టులో ఇప్పటికే సీనియర్లు పుజారా, రహానె ఫామ్‌లేమితో జట్టుకు దూరమయ్యారు. ఇప్పుడు కోహ్లి, రోహిత్‌ కూడా వాళ్ల బాటలోనే సాగితే జట్టుపై కోలుకోలేని దెబ్బ పడుతుంది. టాప్‌ఆర్డర్‌ బలహీనంగా మారుతుంది.


ఏమిటి సమస్య?

కోహ్లి చివరగా 2019 నవంబర్‌లో శతకం సాధించాడు. అప్పటి నుంచి అతని ప్రదర్శన పడిపోతూ వస్తోంది. గత రెండున్నరేళ్లుగా 112 ఇన్నింగ్స్‌ల్లో ఒక్క సెంచరీ లేదు. తన బ్యాటింగ్‌పై ప్రభావం పడుతుందని నాయకత్వానికి గుడ్‌బై చెప్పాడు. టీ20 మెగా లీగ్‌లోనూ బెంగళూరు పగ్గాలు వదిలేశాడు. అయినా అతని ఆటలో మార్పు లేకపోగ ఇంకా దిగజారుతోంది. ఇలా రావడం.. వికెట్‌ ఇచ్చేయడం.. అలా పెవిలియన్‌ చేరడం.. ఇదే విరాట్‌ వరస. అతనిలో ఆత్మవిశ్వాసమే కనిపించడం లేదు. తన షాట్ల ఎంపిక చాలా పేలవం. క్రీజులో సౌకర్యంగా కదల్లేకపోతున్నాడు. ఆఫ్‌స్టంప్‌ ఆవల పడ్డ బంతులను వేటాడి బలైపోయే బలహీనతను కొనసాగిస్తున్నాడు. ఫ్రంట్‌ఫుట్‌ను సమర్థంగా వాడడం లేదు. ప్రత్యర్థులు పన్నిన ఉచ్చులో పడుతున్నాడు. రాజస్థాన్‌తో మ్యాచ్‌లో అతని కోసం లెగ్‌సైడ్‌ ఇద్దరు ఫీల్డర్లను మోహరిస్తే.. షార్ట్‌ పిచ్‌ బంతిని అటువైపే ఆడి పెవిలియన్‌ చేరాడు. లఖ్‌నవూ, కోల్‌కతాతో మ్యాచ్‌ల్లో ఆఫ్‌స్టంప్‌ ఆవల పడ్డ బంతిని ఆడి ఔటయ్యాడు. హైదరాబాద్‌ మ్యాచ్‌లోనూ(హైదరాబాద్‌)ఖాతా తెరవకుండానే జాన్సన్‌ వేసిన బంతిని అలసత్వంతో పుష్‌ చేయాలని ప్రయత్నించి రెండో స్లిప్‌లో దొరికిపోయాడు. చెన్నైపై బంతిని నేరుగా స్క్వేర్‌లెగ్‌లోని ఫీల్డర్‌ చేతుల్లోకి ఫ్లిక్‌ చేశాడు. వికెట్ల మధ్య అత్యంత వేగంగా పరుగులు తీసే అతను.. రెండు మ్యాచ్‌ల్లో రనౌటవడం గమనార్హం. అతని టైమింగ్‌ మునుపటిలా ఉండడం లేదు. బబుల్‌ ఆందోళన తనపై ప్రభావం చూపుతుండొచ్చు. ఒకప్పటి వేగం కనిపించడం లేదు. ఫిట్‌నెస్‌ తగ్గుతున్నట్లుంది. ఇప్పుడు కేవలం బ్యాటర్‌గా కొనసాగుతున్న అతనిలో ఒకప్పటి దూకుడు లేదనేది స్పష్టమవుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో అతను క్రికెట్‌ నుంచి కాస్త విరామం తీసుకోవాలని రవిశాస్త్రి, కెవిన్‌ పీటర్సన్‌ లాంటి మాజీలు సూచిస్తున్నారు. కొన్ని రోజుల ముందు వరకు కోహ్లి బాగానే ఆడుతున్నాడని వ్యాఖ్యానిస్తూ వచ్చిన రవిశాస్త్రి.. అతను విశ్రాంతి తీసుకోవాలని వారం వ్యవధిలో రెండుసార్లు నొక్కి వక్కాణించడం గమనార్హం. షాట్ల ఎంపికపై స్పష్టత లేకుండా.. బుర్రలో గందరగోళంతో క్రీజులో అడుగు పెడితే ఇలాగే ఉంటుందని, అతని మెదడు మునుపటిలా పదునుగా మారాలంటే విశ్రాంతి అవసరమని విశ్లేషకులు అంటున్నారు.


ఇలాగే కొనసాగితే..

టీ20 మెగా లీగ్‌లో అయిదు సార్లు ముంబయిను విజేతగా నిలిపిన రోహిత్‌.. ఇప్పుడు భారత్‌కు మూడు ఫార్మాట్లలోనూ కెప్టెన్‌. కానీ ఈ సీజన్‌లో బ్యాటర్‌గా, సారథిగా రాణించలేకపోతున్నాడు. ఆడిన ఎనిమిది మ్యాచ్‌ల్లోనూ జట్టు ఓడింది. టీమ్‌ఇండియా సారథ్య బాధ్యతలు రోహిత్‌కు కట్టబెట్టడంలో టీ20 మెగా లీగ్‌లో ముంబయి కెప్టెన్‌గా తన ప్రదర్శన కూడా దోహదపడింది. కానీ తీరా ఇప్పుడు భారత జట్టుకు కెప్టెన్‌ అయిన తర్వాత టీ20 మెగా లీగ్‌లో నాయకుడిగా విఫలమవుతున్నాడు. అతను ఇలాగే కొనసాగితే అది టీమ్‌ఇండియాపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఆటగాడిగానూ అతని ప్రదర్శన నామమాత్రమే. ఓపెనర్‌గా జట్టుకు శుభారంభాలు అందించాల్సింది పోయి.. ఆరంభంలోనే వికెట్‌ చేజార్చుకుని బ్యాటింగ్‌ ఆర్డర్‌పై భారం పెంచుతున్నాడు. షార్ట్‌పిచ్‌ బంతులను హుక్‌ చేసి అలవోకగా స్టాండ్స్‌లో పడేసే అతనికి.. ఇప్పుడదే బలహీనతగా మారింది. స్వ్కేర్‌లెగ్‌లో ఫీల్డర్‌ను పెట్టి.. స్లో షార్ట్‌పిచ్‌ బంతితో అతణ్ని బోల్తా కొట్టిస్తున్నారు. తన షాట్లు గురి తప్పుతున్నాయి. బంతి బ్యాట్‌ ఎడ్జ్‌ తీసుకుని ఫీల్డర్ల చేతుల్లో పడుతోంది. లఖ్‌నవూతో మ్యాచ్‌లో ధనాధన్‌ షాట్లతో దూకుడు మీద కనిపించిన రోహిత్‌.. ఉన్నట్లుండి బంతిని అంచనా వేయడంలో విఫలమయ్యాడు. చెన్నైతో పోరులోనైతే ఆడిన రెండో బంతికే ఫీల్డర్‌కు క్యాచ్‌ ప్రాక్టీస్‌ కోసం అన్నట్లు మిడాన్‌లో బంతిని గాల్లోకి లేపి డకౌట్‌గా వెనుదిరిగాడు. అతని బ్యాటింగ్‌లోనూ టైమింగ్‌ కనిపించడం లేదు. జట్టు వరుస పరాజయాలతో అతనిపై ఒత్తిడి పెరిగినట్లే ఉంది. పరుగుల వేటలో వెనకబడడంతో ఆత్మవిశ్వాసం తగ్గింది. అతడిపై వయసు ప్రభావం పడుతున్నట్లు కనిపిస్తోంది.

* ఈ ఏడాది అక్టోబర్‌లో ఆస్ట్రేలియాలో టీ20 ప్రపంచకప్‌ ఆరంభమవుతుంది. గతేడాది ఈ పొట్టి ప్రపంచకప్‌లో గ్రూప్‌ దశలోనే నిష్క్రమించిన భారత్‌ నిరాశ కలిగించింది. కానీ ఈ సారి రోహిత్‌ సారథ్యంలో జట్టు మెరుగైన ప్రదర్శన చేస్తుందనే అంచనాలున్నాయి. కానీ ఇప్పుడు రోహిత్‌, కోహ్లి ఇదే ఫామ్‌ కొనసాగిస్తే జట్టుకు మళ్లీ భంగపాటు తప్పదు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని