Mumbai: ముంబయి ఎట్టకేలకు.. రాజస్థాన్‌ పరాజయం

ముంబయికి ఓ విజయం. పేలవ ప్రదర్శనతో తొలి ఎనిమిది మ్యాచ్‌ల్లో ఓడిన ఆ జట్టు ఎట్టకేలకు టీ20 లీగ్‌లో బోణీ కొట్టింది. ఇప్పటికే ప్లేఆఫ్స్‌కు దూరమైన రోహిత్‌ సేన.. రాజస్థాన్‌ను ఓడించి కాస్త ఊరట

Updated : 01 May 2022 07:09 IST

టీ20 లీగ్‌లో రోహిత్‌సేనకు తొలి గెలుపు

ముంబయికి ఓ విజయం. పేలవ ప్రదర్శనతో తొలి ఎనిమిది మ్యాచ్‌ల్లో ఓడిన ఆ జట్టు ఎట్టకేలకు టీ20 లీగ్‌లో బోణీ కొట్టింది. ఇప్పటికే ప్లేఆఫ్స్‌కు దూరమైన రోహిత్‌ సేన.. రాజస్థాన్‌ను ఓడించి కాస్త ఊరట పొందింది. బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగ్‌తో మొదట ప్రత్యర్థికి కళ్లెం వేసిన ముంబయి.. సూర్యకుమార్‌, తిలక్‌ రాణించడంతో లక్ష్యాన్ని అందుకుంది.

ముంబయి

వరుస పరాభవాలతో తల్లడిల్లిన ముంబయి.. మొత్తానికో విజయం సాధించింది. శనివారం 5 వికెట్ల తేడాతో రాజస్థాన్‌ను ఓడించింది. బట్లర్‌ (67; 52 బంతుల్లో 5×4, 4×6) మెరవడంతో మొదట రాజస్థాన్‌ 6 వికెట్లకు 158 పరుగులు చేసింది. మెరెడిత్‌ (2/24), షోకీన్‌ (2/47), కుమార్‌ కార్తికేయ (1/19) బంతితో రాణించారు. సూర్యకుమార్‌ (51; 39 బంతుల్లో 5×4, 2×6), తిలక్‌ వర్మ (35; 30 బంతుల్లో 1×4, 2×6) రాణించడంతో లక్ష్యాన్ని ముంబయి 19.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది.
మెరిసిన సూర్య: సూర్యకుమార్‌ బాధ్యతాయుత బ్యాటింగ్‌తో ఛేదనలో ముంబయి ఇన్నింగ్స్‌కు వెన్నెముకలా నిలిచాడు. రోహిత్‌ (2)ను అశ్విన్‌ మూడో ఓవర్లోనే వెనక్కి పంపగా క్రీజులోకి వచ్చిన సూర్య ఎలాంటి తడబాటు లేకుండా ఆడాడు. ఆరో ఓవర్లో జట్టు స్కోరు 41 వద్ద మరో ఓపెనర్‌ ఇషాన్‌ కిషన్‌ (26; 18 బంతుల్లో 4×4, 1×6) నిష్క్రమించినా.. తిలక్‌ వర్మ (35; 30 బంతుల్లో 1x4, 2x6)తో కలిసి ఇన్నింగ్స్‌ నడిపించాడు. చూడ చక్కని షాట్లతో అలరించాడు. వీలైనప్పుడల్లా బంతిని బౌండరీ దాటించాడు. తిలక్‌ వర్మ ఎక్కువగా సింగిల్స్‌ తీసినా.. సూర్యకు చక్కని సహకారాన్నిచ్చాడు. సాధించాల్సిన రన్‌రేట్‌ మరీ ఎక్కువేమీ లేకపోవడంతో ముంబయికి తొందరపడాల్సిన అవసరం లేకపోయింది. 12 ఓవర్లకు స్కోరు 95/2. ఆ తర్వాత అశ్విన్‌ బౌలింగ్‌లో సూర్య, చాహల్‌ బౌలింగ్‌లో తిలక్‌ సిక్స్‌లు కొట్టారు. 32 బంతుల్లో 38 పరుగులు చేయాల్సిన స్థితిలో మ్యాచ్‌ పూర్తిగా ముంబయి నియంత్రణలో ఉంది. కానీ భారీ షాట్లు ఆడే ప్రయత్నంలో చాహల్‌ బౌలింగ్‌లో సూర్య, ప్రసిద్ధ్‌ బౌలింగ్‌లో తిలక్‌ ఔట్‌ కావడంతో మ్యాచ్‌ ఆసక్తికరంగా మారింది. రాజస్థాన్‌లో కాస్త ఆశలు చిగురించాయి. ఆ జట్టు బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేశారు. తేలిగ్గా పరుగులివ్వలేదు. ముఖ్యంగా పొలార్డ్‌ షాట్లు ఆడేందుకు కష్టపడ్డాడు. అయితే మరో వైపు టిమ్‌ డేవిడ్‌ (20 నాటౌట్‌; 9 బంతుల్లో 2×4, 1×6) కాస్త బ్యాట్‌ ఝుళిపించడంతో ముంబయి 19 ఓవర్లలో 155/4తో విజయానికి చేరువైంది. కానీ కుల్‌దీప్‌ సేన్‌ వేసిన చివరి ఓవర్లో నాలుగు పరుగులు చేయాల్సిన స్థితిలో తొలి బంతికే పొలార్డ్‌ (10) ఔట్‌ కావడంతో మ్యాచ్‌ రసవత్తరంగా మారింది. అయితే ఉత్కంఠను డేనియల్‌ సామ్స్‌ (6*) కొనసాగనివ్వలేదు. నాటకీయతకు అవకాశం లేకుండా తర్వాతి బంతికే సిక్స్‌ కొట్టి మ్యాచ్‌ను ముగించాడు.

రాణించిన బట్లర్‌: 91/2. 14 ఓవర్లకు రాజస్థాన్‌ స్కోరిది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆ జట్టు పరుగుల కోసం కష్టపడింది. కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేసిన ముంబయి బౌలర్లు.. ఆ జట్టు బ్యాట్స్‌మెన్‌ను స్వేచ్ఛగా పరుగులు చేయన్వివలేదు. సూపర్‌ ఫామ్‌లో ఉన్న బట్లర్‌ కూడా బ్యాట్‌ ఝుళిపించలేకపోయాడు. అయిదో ఓవర్లో పడిక్కల్‌ (15)ను షోకీన్‌ ఔట్‌ చేసేటప్పటికి స్కోరు 26 పరుగులే. ఓ రెండు సిక్స్‌లు బాదిన సంజు శాంసన్‌ (16) ఇన్నింగ్స్‌కు ఊపు తెచ్చే ప్రయత్నం చేశాడు కానీ.. ఎక్కువసేపు నిలువలేదు. మిచెల్‌ (17; 20 బంతుల్లో 1×4)తో కలిసి బట్లర్‌ ఇన్నింగ్స్‌ను నడిపించాడు కానీ. అతడి బ్యాటింగ్‌లో దూకుడు కొరవడింది. బ్యాట్స్‌మెన్‌ ఇద్దరూ ఎక్కువగా సింగిల్స్‌తోనే సరిపెట్టుకున్నారు. ఎదుర్కొన్న తొలి 41 బంతుల్లో బట్లర్‌ 38 పరుగులే చేయగా.. మిచెల్‌ తన మొదటి 19 బంతుల్లో 17 పరుగులే చేయలిగాడు. కార్తికేయ, సామ్స్‌, మెరెడిత్‌, బుమ్రా రాజస్థాన్‌ బ్యాట్స్‌మెన్‌కు కళ్లెం వేశారు. చేతిలో చాలా వికెట్లే ఉన్నా... పరుగుల వేటలో రాజస్థాన్‌ బాగా వెనుకబడింది. 11 నుంచి 14 ఓవర్ల మధ్య ఒక్క ఫోర్‌ కూడా రాలేదు. ఒత్తిడితో దూకుడు పెంచడానికి ప్రయత్నించిన మిచెల్‌ సామ్స్‌ వేసిన ఇన్నింగ్స్‌ 15వ ఓవర్లో క్యాచ్‌ ఔటయ్యాడు. కానీ బట్లర్‌ మాత్రం చెలరేగిపోయాడు. గేర్‌ మార్చి.. విధ్వంసక బ్యాటింగ్‌తో ఇన్నింగ్స్‌కు ఊపు తెచ్చాడు. సామ్స్‌ బంతిని బౌండరీ దాటించిన అతడు.. షోకీన్‌ ఓవర్లో (16వ) ఏకంగా నాలుగు సిక్స్‌లు బాదాడు. అతడు ఇంకాసేపు ఉండుంటే రాజస్థాన్‌ మరింత స్కోరు చేసేదే. కానీ అదే ఓవర్లో అతడు వెనుదిరిగాడు. ముంబయి బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో రాజస్థాన్‌ చివరి నాలుగు ఓవర్లలో 32 పరుగులే చేసి 2 వికెట్లు కోల్పోయింది. అశ్విన్‌ (21; 9 బంతుల్లో 3×4, 1×6) బ్యాట్‌ ఝుళిపించాడు. హెట్‌మయర్‌ (6 నాటౌట్‌) 14 బంతులు ఆడి ఒక్క బౌండరీ కూడా కొట్టలేకపోయాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని